Home ఆఫ్ బీట్ ఆత్మవిశ్వాసంతో విజయం సాధ్యం..

ఆత్మవిశ్వాసంతో విజయం సాధ్యం..

lf

ఒకవైపు కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు, మరోవైపు ఇంట్లో కుటుంబ బాధ్యతలు ఈ రెంటినీ సమన్వయం చేసుకుంటూ తమ రంగాల్లో ఉన్నతంగా దూసుకుపోతున్నారు మహిళలు. ఉన్నతంగా ఎదిగిన వాళ్లంతా మొదట్లో జీవితంలో అష్టకష్టాలు పడ్డవాళ్లే. అలాంటి వారిలో ఒకరు దివ్య సూర్యదేవర. ఇప్పుడు ఈమె ప్రపంచదృష్టిని ఆకర్షించింది. ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ ప్రైవేటు కంపెనీల్లో అత్యున్నత స్థాయిలో ఉన్న మహిళల శాతం చాలా తక్కువ. అలాంటిది దివ్య అధికారి కంగా సీఎఫ్‌ఓ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఫార్చూన్ టాప్ 10 కంపెనీల్లో ఒకటైన జనరల్ మోటార్స్‌లో తొలి రెండు అత్యున్నత స్థానాల్లోనూ మహిళలే ఉన్నారు.

తొలి చైర్మన్, సీఈఓ మేరీ బర్రా కాగా, తొలి సీఎఫ్‌ఓ దివ్య కానుంది. సెప్టెంబర్ ఒకటి నుంచి దివ్య బాధ్యతలు నిర్వర్తించనుంది. 39 ఏళ్ల దివ్య కార్పొరేట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది. 13 ఏళ్ల కిందట జనరల్ మోటార్స్ కంపెనీలో చేరింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చింది. ప్రస్తుతం అదే కంపెనీలో కార్పొరేట్ ఫైనాన్స్ విభాగంలో ఉపాధ్యక్షురాలిగా విధులు నిర్వర్తిస్తోంది.
జనరల్ మోటార్స్ సిఇఒగా పనిచేసినప్పుడు ఆ కంపెనీకి చెందిన దాదాపు రూ. 5.78 లక్షల కోట్ల ఆర్థిక కార్యకలాపాలను చక్కగా నిర్వర్తించి మెప్పు పొందింది. ఇటీవల జపాన్ టెక్ జెయింట్ ముఖ్యమైన ఒప్పందాల్లో కీలకపాత్ర పోషించి, కంపెనీని అత్యున్నత స్థానంలో నిలిపింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జీఎం యాజమాన్యం దివ్యను సీఎఫ్‌ఓగా నియమిస్తూ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ.. నా చిన్నతనమంతా చెన్నైలోనే గడిచింది. చిన్నప్పుడే నాన్న చనిపోయారు. అమ్మకు ముగ్గురం కూతుళ్లం. మా భారమంతా అమ్మపై పడింది. అయినా సరే అమ్మ మా చదువు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఎలాంటి ఆటంకాలు లేకుండా జీవించాలంటే చదువు అవసరమని గుర్తించింది. మాకు ఉన్నత చదువులు చదివించింది. మేం కూడా అమ్మ కలను నెరవేర్చడంలో ఎంతో కష్టపడ్డాం. కష్టపడకుండా ఏదీ సులభంగా దొరకదని అమ్మ వల్లే నేర్చుకున్నాం… నాకైతే సవాళ్లలంటే చాలా ఇష్టం. వాటిని సాధించేవరకూ నిద్రపోను..అంటోంది దివ్య సూర్యదేవర. 2016లో ఆటోమేటివ్ రైజింగ్ స్టార్‌గా, గతేడాది క్రెయిన్స్ డెట్రాయిడ్ బిజినెస్ 40 అండర్ 40గా నిలిచి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దివ్యకు చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌లో ఎంకాం చేసింది. అమెరికాలోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో చేరి ఎంబిఎ పట్టా పొందింది. చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, చార్టర్డ్ అకౌంటెంట్ ( సిఎ) కూడా చేసింది. చదువంతా ఎడ్యుకేషన్‌లోన్‌తో సాగింది. పాతికేళ్ల వయసులోనే జనరల్ మోటార్స్ ఉపాధ్యక్షురాలిగా హోదా చేపట్టింది. భర్త రాజ్ సూర్యదేవర. వీరికి ఒక కుమార్తె. దివ్య కుటుంబం న్యూయార్క్‌లో నివసిస్తోంది. ఆమె మాత్రం డెట్రాయిట్‌లో పనిచేస్తుంది. వారాంతాల్లో కుటుంబంతో గడుపుతోంది. జనరల్ మోటార్స్‌కు ముందు ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్, యూబీఎస్ ఇన్వెస్ట్‌మెంట్‌బ్యాంకులో వివిధ హోదాల్లో పనిచేసింది.
అనుకరణ కంటే సొంత వ్యక్తిత్వంతో ముందుకు వెళ్లడం వల్ల విజయం సాధ్యమంటోంది దివ్య. ప్రతి ఒక్కరిపై ఇంట్లో పరిసరాలు , తల్లిదండ్రుల పెంపకం అనేవి ప్రభావం చూపుతాయంటుంది. దాన్ని బట్టే లక్షాలను ఏర్పరుచుకుని ముందుకుసాగాలని చెబుతోంది.