Home ఎడిటోరియల్ పరిశోధనలు ఫలించాలంటే – దూరం తగ్గాలి

పరిశోధనలు ఫలించాలంటే – దూరం తగ్గాలి

alexసర్ అలెగ్జాండర్ ప్లెమింగ్ ‘పెన్సిలిన్’ను కనుగొన్నాడు. అది ఇప్పుడు ప్రపంచమంతా వాడుకునే గొప్ప మందు. మన దేశంలో ఆ మందు ఎంత మందికి పడుతుంది., ఎంతమందికి పడదు అని నిర్ధారించు కోవాల్సింది మన దేశపు వైద్య శాస్త్రజ్ఞులు. దాని ఉత్పత్తి ఎంత అవసరమో చూసుకోవాల్సింది మందుల కంపెనీలు . అలాగే పెనిసిలిన్‌కి ప్రత్యామ్నాయంగా వాడదగ్గ మరో మందును దేశంలో ఉత్పత్తి చేసుకోగలమా అన్న అంశాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించాలి. ఇతర దేశాల వారెవరూ వచ్చి చెప్పరు. అందువల్ల జాతీయ దృకథం అనేది అందరితో పాటు శాస్త్రవేత్తలకు కూడా చాలా అవసరం.

శాస్త్రజ్ఞులు, సాంకేతిక నిపుణులు ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రపంచ దేశాల్లో మనది మూడవది. స్వాతంత్య్రానంతరం మనం శాస్త్ర, వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో కేవలం పరిశోధన కోసం సుమారు ఐదువేల కోట్లకుపైగా ఖర్చుపెట్టాం. జాతీ య స్థాయిలో సుమారు ఐదువందల పరిశోధనా సంస్థలు చురుకుగా పనిచేస్తున్నాయి. అందులో కొన్ని అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపా దించుకున్నాయి. కొన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థతో సంయుక్తంగా పనిచేస్తున్నాయి. అంతర్జాతీ యంగా గుర్తింపుపొందిన శాస్త్రవేత్తలూ లేకపోలేదు. కాని, ప్రపంచ పురోగమనానికి దోహదం చేసిన భారతీయ పరిశోధన ఏదీ అని ఎవరైనా నిలదీస్తే, మనం నేల చూపులు చూడకతప్పదు. ఎందుకంటే అంతగా చెప్పుకోదగ్గ ఉన్నతస్థాయి పరిశోధనలు ఇటీవల లేవు.
భారతదేశమంటే పల్లెలు అనే ఒక అభిప్రాయం ఉంది. అలాంటప్పుడు గ్రామీణాభివృద్ధికి దోహదం చేస్తున్న పరిశోధనలు ఏవీ? చిన్నచిన్న అభివృద్ధి పథకాలే విజయవంతం కావడం లేదు. ఇక పరిశోధ నల దాకా ఎందుకూ? ప్రతిసారీ మన జాతీయ ప్రణాళికా మండలి వ్యవసాయం గూర్చి ఎక్కువగా చర్చిస్తుంది. వ్యవసాయం, పెంపుడు జంతువులు, పాడి, కోళ్ళపెంపకం, ఉన్ని పరిశ్రమ వంటివాటిమీద ప్రత్యేక పరిశోధనలేమైనా జరుగుతున్నాయా? లేదు. ఆ జరిగేవైనా, ఆయా శాస్త్రవేత్తల సౌలభ్యంకొద్దీ జరుగుతున్నాయేగాని, అవి నేరుగా రైతులకు ఉపయోగపడే విధంగా ఉండడం లేదు. అలాగే ఇతర రంగాలలోని పరిశోధనలు కూడా! అయితే దీనికి ప్రధానంగా ఒక ముఖ్య కారణం ఉంది. సమాజానికీ విశ్వవిద్యాలయాలకు లేదా పరిశోధనా సంస్థలకు మధ్య దూరం ఎక్కువవుతూ ఉండడం!
పరిశోధనా రంగానికి చెందిన ఉద్యోగులు, అధ్యాపకులు సమాజంలో భాగస్వాములే. వారు ఆ విషయం గుర్తుంచుకుని బాధ్యతతో సమాజావస రలకు అనుగుణంగా పరిశోధనలకు రూపకల్పన చేసుకోవాలి. వారి పరిశోధనలు జనావళికి పని కొచ్చేవి కావాలి. కేవలం తమకు మాత్రమే పని కొచ్చేవిగా ఉండకూడదు. ఉద్యోగం సంపాదించు కోవడానికో, ప్రమోషన్ కొట్టేయడానికో పనికొచ్చే పరిశోధనలు సమాజానికి అంతగా ఉపయోగపడక పోవచ్చు. అందువల్ల భారతీయ పరిశోధనలకు ఒక ధ్యేయం, ఒక ఉద్దేశం, ఒకప్రయోజనం లేకుండా పోతుందేమో అన్న అనుమానం కలుగుతోంది. ముందు మనం ఈ విషయం గ్రహిస్తే, తర్వాత చెయ్యా ల్సిన వాటిని గూర్చి నిదానంగా ఆలోచించు కోవచ్చు. ముఖ్యంగా పరిశోధన రంగంలోకి అడుగుపెట్టే యువతీయువకులు దేశ కాల పరిస్థితుల్ని క్షుణంగా అవగతం చేసుకోవాల్సి ఉంది.
అంతర్జాతీయ పరిశోధనారంగంలో మన భారతదేశపు పాత్ర ఎంతుందో తెలుసుకోవాల్సి ఉంది. ఏ ప్రొఫెసరో సూచించిన విషయంపై పరి శోధన చేసి, పిహెచ్.డి.యే పరమావధి అని అనుకున్నంతకాలం ఈ దేశం బాగుపడదు. యూని వర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆగ్రికల్చరల్ సైన్సెస్, మెడికల్ సైన్సెస్, ఇండిస్ట్రియల్ రీసెర్చ్ వంటి జాతీయ సంస్థలన్నీ తమతమ పరిశోధనా ప్రణాళికలను సమీక్షించు కోవాల్సి ఉంది. వెచ్చిస్తున్నది ప్రజాధనం గనక, ప్రజాభి ప్రాయాల్ని గణనలోకి తీసుకోవడం అవసరం. స్కాండినేవియన్ దేశాల్లో పరిశోధన ప్రజా సమస్య, అక్కడ పిహెచ్.డి.వైవా (మౌఖిక పరీక్ష) బహిరంగం గా ప్రజల మధ్య జరుగుతుంది. దీని వల్ల సామాన్య పౌరుడికి కూడా ప్రశ్నించే అవకాశం దొరుకుతుంది. ప్రజలకు పనికిరాని పరిశోధనలు పనిగట్టుకొని చేసే అలవాటు దానంతట అదే సమసిపోతుంది.
ఈ విషయంలో ఒక భిన్నమైన అభిప్రాయం ఉంది. శాస్త్ర పరిశోధనకు ఎల్లలుండవని, అది అంతర్జాతీయ విషయమని! నిజమే- వైజ్ఞానిక అవగాహనకు పరిధులుండవు. పరిమితులుండవు. ప్రపంచ పౌరుల సంక్షేమం గూర్చి ప్రపంచ పౌరులందరూ ఆలోచించాలి. కాని ఒక్కో దేశంలో లేదా ఒక్కో ప్రాంతంలో సభావసిద్ధంగా లభించే వనరులు, అక్కడి నైసర్గిక స్వరూపం, వాతావరణ పరిస్థితులు ఆయాదేశాల్లో జరిగే పరిశోధనలకు మూలమవుతాయి.(అలాంటి పరిశోధనలు ఆయా దేశానికి తప్ప ఇతర దేశాలకు అంతగా ఉపయోగ పడవు). ఉదాహరణకు సముద్రపు చేపల మీద జరిగే పరిశోధనలు తెలంగాణ జిల్లాల్లో జరపలేం కదా! ఇక్కడ మరొక విషయం కూడా ఉంది. ఏ గొప్ప పరిశోధన అయినా మొదట ఒక శాస్త్రవేత మెదడు లో మొలకెత్తాలి. అద్భుతాలు అక్కడే సాధ్య మవుతాయి. అక్కడ విషయం నిర్థారితమైతే ప్రయోగ పూర్వకంగా నిరూపితమైతే, ఒక సిద్ధాంతంగా రూపుదిద్దుకుంటుంది. ఆ పరిశోధన సిద్ధాంత ఫలితంగా వచ్చిన వస్తువులు, ఉత్పత్తులు లేదా ఫలితాలు అందరికీ అందుబాటులోకి వస్తాయి. కనుగొన్న కొత్త విషయాన్ని దేశ కాల పరిస్థితులకు అన్వయించుకొని కృషి చేసేందుకు వందలమంది, వేలమంది అవసరమవుతారు. అప్పుడు దేశాల ప్రాధాన్యత వెలుగులోకి వస్తుంది.
పరిశోధనారంగానికి వ్యవసాయం, పరిశ్రమలు, వైద్య ఆరోగ్య, సాంఘిక, సంక్షేమ, భూగర్భ జలవనరుల రంగాలన్నింటితో సన్నిహిత సంబంధా లు పెంపొందే విధంగా చూసుకోవాలి. ఆయా రంగాలలోని వారిని పరిశోధనా రంగంలో జరుగు తున్న ప్రయత్నాల గూర్చి తెలుసుకోనివ్వాలి. జర్మనీలో ఇలాంటి పథకాలు అమలులో ఉన్నాయి. విద్యావేత్తలు, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు పరిశోధన రంగంలో ఉన్న వారినందరినీ కర్మాగారాలకు పంపు తారు. వ్యవసాయ శాస్త్రవేత్తల్ని సేద్యపు భూములకు పంపుతారు. అలా వాస్తవ ప్రపంచంలో ప్రత్యక్షంగా పాల్గొన్నప్పుడే సమస్యలు అర్థమవు తాయి. అర్థమైనప్పుడే కోరుకున్నదిశలో పురోగ మించడం సాధ్యమవుతుంది. మన ఇండియన ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ వంటి సంస్థలు పరస్పరం సహక రించుకునే కార్యక్రమాలు లోగడ నామమాత్రంగా నిరహించాయి. అయితే అవి సరిపోవు.
దేశంలో ఆకస్మాత్తుగా డాక్టరేట్ల సంఖ్య ఎక్కు వైంది. కొద్ది సంవత్సరాల క్రితం వరకు విశ్వవిద్యా లయాల్లో ఈ సంఖ్య లెక్కబెట్టగలిగేదిగా ఉండేది. ఇప్పుడు డాక్టరేట్లు లేని అధ్యాపకులు, పరిశోధన సంస్థల్లోనూ, అకాడెమీల్లోనూ డాక్టరేట్లు లేని ఉద్యోగు లూ అరుదైన పరిస్థితి నెలకొంది. దేశకాల పరిస్థి తులను బాగా ఆకళింపు చేసుకుని ఆలోచిస్తే, మనకు ఇంతమంది డాక్టరేట్లు అవసరమా అన్న అనుమానం కలుగుతూ ఉంటుంది. మీరు ఏ విశ్వవిద్యా లయం లోని ఏ విభాగానికైనా వెళ్ళి చూడండి. 1950-80 మధ్య డాక్టరేట్లు పుచ్చుకున్న వారి సంఖ్యను 1980-90 మధ్య డాక్టరేట్లు పుచ్చుకున్న వారి సంఖతో పోల్చిచూడండి. ఆ ముప్పయేళ్ళలో డిగ్రీలు తీసుకున్న వారికన్నా ఈ పదేళ్ళలో డిగ్రీలు తీసుకున్న వారి సంఖ్య సుమారు రెట్టింపు ఉంటుంది. అంటే ఉన్నత విద్య సాధించా లన్న ధ్యేయం కన్నా, నిరుద్యోగ ప్రభావం పరిశోధనా రంగంపై ఎక్కువగా ఉందన్న విషయం స్పష్టమవు తోంది.
యువ పరిశోధకులు, దేశ భవిష్యత్తును నిర్ధారించే మేధావులు ఈ విషయాలను క్షుణంగా అర్థం చేసుకుని,ఆలోచించి, తక్షణం ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉంది. తమ పరిశోధనలకు ఒక నిర్దుష్టమైన ధ్యేయాన్ని, దిశను ఏర్పరచుకుని దేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత వారి మీదే ఉంది.