Home ఎడిటోరియల్ మళ్లీ అడ్డుకున్న చైనా

మళ్లీ అడ్డుకున్న చైనా

Suicide bomb attack in Pulwama    జైష్ ఎ మొహమ్మద్ అధినేత మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గుర్తించకుండా చైనా అడ్డుకోడం గత పదేళ్లల్లో ఇది నాలుగోసారి. 2009, 16, 17వ సంవత్సరాల్లోనూ ఇదే పని చేసింది. జమ్ము కశ్మీర్‌లోని పుల్వామాలో ఆత్మాహుతి బాంబు దాడికి తెగించి 40 మంది భారత సిఆర్‌పిఎఫ్ జవాన్లను హతమార్చి ఆ నిర్వాకానికి పాల్పడింది తానే నంటూ జైష్ ప్రపంచం పైకప్పు ఎక్కి చాటింపు వేసిన తర్వాతనైనా ఈ మానవ విద్వేష విష సర్పం అంతు చూసేలా చేయాలన్న సదుద్దేశం బీజింగ్‌లో కలుగుతుందని అంకురించిన ఆశలు అడుగంటిపోయాయి. మసూద్‌ను ప్రపంచ టెర్రరిస్టుల జాబితాలో చేర్చాలని ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా దేశాలు మూడూ కలిసి గత నెల 27వ తేదీన చేసిన ప్రతిపాదనపై అభ్యంతరాలు చెప్పడానికి భద్రతా మండలి పది రోజుల వ్యవధినిచ్చింది. చివరి రోజైన బుధవారం నాడు గడువు ముగుస్తుందనగా చైనా ‘సాంకేతిక’ అభ్యంతరంతో నిర్ణయాన్ని అడ్డుకున్నది.

అదేమిటని అడిగితే ఈ అంశంపై నిర్ణయం తీసుకునే 1267 అల్‌కాయిదా ఆంక్షల కమిటీ నిబంధనల మేరకే ఆ పని చేశామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లూ కాంగ్ సమాధానమిచ్చారు. సంబంధిత పక్షాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకొనేలా చేయాలని, ప్రాంతీయ శాంతి సుస్థిరతల సాధన కృషి మరింత జటిలం కాకుండా చూడాలనే సదుద్దేశంతోనే అడ్డుపడ్డామని అన్నారు. సమస్యను కూలంకషంగా అధ్యయనం చేయడానికి కమిటీకి వ్యవధి ఇవ్వాలని భావించి ఇందుకు పాల్పడ్డామని వివరణ ఇచ్చారు. ఇదేదో భారత పాకిస్థాన్‌లకు సమాన దూరంలో ఉన్న నిష్పక్షపాత దేశం ఇలా అంటే కొంత అర్థముండేది. నిరంతరం భారత వ్యతిరేక కక్షపూరిత దృష్టితో పాకిస్థాన్ వైపు తూగిపోయి ఉన్న చైనా ఇలాంటి సుద్దులు చెబితే నమ్మేదెవరు? ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మధ్య గత ఏడాది అక్కడి వుహాన్‌లో జరిగిన శిఖరాగ్ర సభ రెండు దేశాల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచిందని, ఈసారి మసూద్ విషయంలో చైనా తన వైఖరిని మార్చుకుంటుందని ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది.

2001లో భారత పార్లమెంటు భవనంపై జరిగిన ఉగ్రదాడి వెనుక కూడా మసూద్ హస్తముందని రూఢి అయింది. అటువంటి ముష్కర మూక నేతను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చడానికి చైనాకు గల అభ్యంతరమేమిటో తెలియదు. ఇప్పటికీ మసూద్‌కు ఆశ్రయమిస్తున్న పాకిస్థాన్‌ను సంతృప్తి పర్చడానికే చైనా ఇలా ఈ విషయంలో అవరోధం కలిగిస్తున్నదని స్పష్టపడుతున్నది. భద్రతా మండలిలో చైనా తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై ఇతర సభ్యదేశాలు మండిపడ్డాయన్న సమాచారం గమనించదగినది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా పరిగణన పొందడానికి మసూద్ అజర్ అన్ని విధాలా తగినవాడని, అతడు ప్రాంతీయ సుస్థిరత, శాంతి సాధనకు ప్రమాదకారి అని అమెరికా వ్యక్తం చేసిన అభిప్రాయం చైనా నిర్ణయం పట్ల దాని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నది. చైనా ఇదే వైఖరిని కొనసాగించినట్లయితే ఇతర సభ్య దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించవలసి వస్తుందని భద్రతా మండలిలోని ఒక దౌత్యవేత్త అభిప్రాయపడినట్లు తెలిసింది.

విశేషమేమిటంటే భారత, చైనాల మధ్య 1964 యుద్ధం తర్వాత మళ్లీ అటువంటి చెప్పుకోదగిన ఘర్షణ తల ఎత్తలేదు. మొన్నటి డోక్లాం ప్రతిష్టంభన, అరుణాచల్ ప్రదేశ్ భూభాగంపై పరస్పర విరుద్ధ వైఖరుల మాదిరివి అప్పుడప్పుడు తల ఎత్తుతున్నా అవి రెండు దేశాల మధ్య వైషమ్యాలను తీవ్ర స్థాయికి తీసుకువెళ్లలేకపోయాయి. ఇది ఎంత హర్షదాయకమైన అంశమో పాకిస్థాన్‌కు వెన్నుదన్నుగా ఉంటూ దానిని చైనా ముద్దిస్తూ ఉండడం అంత ఆందోళనకరం. భారత్‌పై తన కక్షను పాకిస్థాన్ దుష్ట చర్యలకు అండగా ఉండడం ద్వారా చైనా తీర్చుకుంటున్నదనే అభిప్రాయానికి ఇది తావు కలిగిస్తుంది. ఈసారి ప్రపంచ దేశాలన్నీ మన వైపు నిలబడగా, పాకిస్థాన్ ఉగ్రవాద అనుకూల పాత్రను చైనా ఒక్కటే వెనకేసుకురావడం స్పష్టంగా రుజువైంది.

దాని తీరును ప్రపంచ మంతా ఖండించిన పరిణామమైనా భవిష్యత్తులో బీజింగ్‌ను సరైన దారిలోకి మళ్లించగలదేమో చూడాలి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, ఆ సంస్థలకు ఆశ్రయమివ్వడం ప్రపంచ శాంతికిగాని, ప్రాంతీయ సుస్థిరతకుగాని ఎంతమాత్రం దోహదపడకపోగా ఆ మహత్తర లక్ష్యాలకు తీవ్ర అవరోధం కలిగిస్తుంది. మసూద్‌ను ప్రపంచ టెర్రరిస్టుల జాబితాలో చేర్చబోవడాన్ని మరోసారి అడ్డుకుంటూ చైనా వహించిన ఆందోళనకరమైన పాత్రపట్ల అసంతృప్తిని ప్రకటిస్తూనే ఉగ్రవాదులకు తగిన శాస్తి జరిగేలా చూడడానికి అన్ని విధాలా ప్రయత్నాలు కొనసాగిస్తామని భారత్ చేసిన ప్రకటన ఎంతో హుందాగా ఉన్నది.

Suicide bomb attack in Pulwama