న్యూఢిల్లీ:పార్లమెంటు సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం పెడతామని టిడిపి ఎంపి సుజనాచౌదరి తెలిపారు. ఆదివారం టిఆర్ఎస్ ఎంపిలు కె.కేశవరావు, జితేందర్ రెడ్డిలతో సుజనా చౌదరి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం, విభజన హామీల అమలుపై చర్చించామని తెలిపారు. టిఆర్ఎస్ నేతలు కూడా ఎపికి జరిగిన అన్యాయాన్ని అంగీకరించారని తెలిపారు. అవిశ్వాస తీర్మానానికి టిఆర్ఎస్ సానుకూలంగా స్పందించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఎంపి కేశవరావు మాట్లాడుతూ..అవిశ్వాస తీర్మానంపై సుజనా చౌదరి టిఆర్ఎస్ మద్దతు కోరినట్లు ఆయన పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీలను తెలంగాణలో కూడా అమలు చేయలేదన్నారు. దీంతో పాలనలో అడ్డంకులు ఎదురుకుంటున్నామని, టిడిపి పార్లమెంటులో అవిశ్వాసం తీర్మానం పెడితే ఆలోచిస్తామని కేకే చెప్పారు.