Home దునియా మండుటెండలు తట్టుకునేదెలా..!

మండుటెండలు తట్టుకునేదెలా..!

ఎండాకాలం అంటేనే మండే ఎండలతోపాటు పిల్లలకు పరీక్షలు, ఆ తర్వాత సెలవులు.. అమ్మమ్మ తాతయ్యల దగ్గరకు ఊర్లకు వెళ్లడాలు.. సమ్మర్ కోచింగ్ సెంటర్లకు వెళ్లి  కొత్త విద్యల్ని నేర్చుకోవడాలు.. కుటుంబమంతా కలిసి కొత్త ప్రదేశాలకు వెళ్లడం వీటన్నింటితోపాటు శరీరానికి మనసుకు చల్లదనాన్నిచ్చే పుచ్చకాయలు, మామిడికాయలు, కర్బూజాలు…మత్తెక్కించే మల్లెలు ..ఇంత హంగామా చేస్తుంది వేసవి. వీటన్నింటినీ ఎంజాయ్ చేయాలంటే ఈ కాలంలో నీడపట్టున ఉంటూ, మంచి పోషకాహారం తీసుకుంటూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మిగతా అన్ని కాలాలలాగే సమ్మర్‌నీ చక్కగా ఆస్వాదించొచ్చు.

 

తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి

* శరీరం చెమట వాసన రాకుండా ఉండాలంటే ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల వెనిగర్ కలపాలి.
* ముఖానికి నిమ్మరసం రాసుకొని అరగంట అయిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే ముఖం తాజాగా ఉంటుంది.
* పెరుగును ఎక్కువగా తీసుకోవాలి. పెరుగు చల్లదనాన్ని కలిగించడమే కాకుండా మంచి పౌష్టికాహారంగా కూడా ఉంటుంది.
* ప్రతి రోజూ 7 నుంచి 8 గ్లాసుల మంచి నీటిని తాగాలి. నీటిని తాగడం వల్ల డీ హైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటారు.
* సబ్బుకు బదులు శనగపిండిని వాడటం వల్ల చర్మం మీద దద్దుర్లు, పొక్కులు, దురదలు రాకుండా ఉంటాయి.
* ఎండలో వెళ్లినప్పుడు తలకు స్కార్ఫు కట్టుకోవాలి. లేదంటే వేడికి వెంట్రుకలు చిట్లిపోయి రంగు మారే ప్రమాదం ఉంటుంది.

 

వేసవికాలం అనగానే సాధ్యమైనంత వరకు ఎవరైనా సరే నీడపట్టున ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే సూర్యుని నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలు చర్మంలోని మెరుపు తగ్గిపోయి, ముడుతలు వచ్చి, వార్ధక్యపు ఛాయలు స్పష్టంగా కనిపించేలా చేస్తాయి. చర్మానికి హానిచేసేది మధ్యాహ్నపు ఎండ. చర్మానికి సహజంగా ఉండే సాగే గుణం, మృదుత్వాన్ని కూడా ఈ ఎండలోని కిరణాలు ధ్వంసం చేస్తాయి. పిగ్మెంటేషన్ తప్పదు, చర్మక్యాన్సర్ ప్రమాదమూ ఉంటుంది. కాబట్టి, మరీ అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్లకపోవడం శ్రేయస్కరం.అయితే, ఎండలవల్ల చర్మానికి కీడే కాదు, మేలూ కూడా జరుగుతుంది. ఉదయం 6.30-7.30 గంటల మధ్య వచ్చే ఎండ ఎంతో మంచిది. ఆ సమయంలో 10 నిమిషాలు ఎండలో నిలబడితే, శరీరంలో హార్మోన్లు చక్కగా ఉత్పత్తి అవుతాయి. జీర్ణక్రియ వేగవంతమవుతుంది. డి విటమిన్ అందటమే గాకుండా, కాల్షియంను సులభంగా స్వీకరించగలుగుతుంది. ఈ కాలంలో వాడే మాయిశ్చరైజర్ యువిఏ, యువిబి ఫిల్టర్ అయి ఉంటే మంచిది. రెండుమూడు గంటలకోసారి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. అదనంగా ముక్కు, మెడ, పాదాల సంరక్షణకు విడిగా బామ్, పెదవులకు లిప్‌బామ్ కూడా తప్పనిసరిగా రాసుకోవాలి. సన్‌స్క్రీన్ రాసుకుంటే నేరుగా ఎండలో వెళ్లవచ్చనేది అపోహ మాత్రమే. వెంట గొడుగు, లేదా స్కార్ఫ్ తప్పనిసరి. చర్మం కాస్త ఎర్రబడినా, దురదగా అనిపిస్తున్నా, ఎండ ఎక్కువగా ఉన్నట్లే. కాబట్టి దానికి తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. చర్మం మరీ మంటగా ఉంటే కలబందతో తయారైన జెల్ వాడితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. పుట్టుమచ్చలు, ఫ్రెకిల్స్, కుటుంబచరిత్రలో చర్మక్యాన్సర్ ఉన్నవాళ్లు సాధ్యమైనంతవరకు ఎండలో తిరగకూడదు. ఈ ఎండల్లో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎండ దెబ్బకి నీరస పడిపోవాల్సిందే. వేసవి ముగిసేవరకూ ప్రతి ఒక్కరూ, ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. వేసవిలో దుస్తులు విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. తెల్లని కాటన్ దుస్తులే  వేసవికి సరిగ్గా సరిపోతాయి.

Nutrient Drinks in Summer
Nutrient Drinks in Summerఆరోగ్యం జాగ్రత్త…

వేసవిలో మనం ఆరోగ్యాన్ని ఏ మాత్రం నిర్లక్షం చేసినా ఆ ప్రభావం ముందుగా చర్మం మీదే పడుతుంది. మిట్టమధ్యాహ్నాలు బయటికి వెళ్లకపోవడమే మంచిది. తప్పనిసరై వెళ్లాల్సివచ్చినప్పుడు టోపీ, కళ్లజోడు వంటివి కొంత రక్షణనిస్తాయి. ఒంట్లో తగిన మోతాదులో నీళ్లు లేకపోవడం వల్ల కూడా చర్మం పొడిబారిపోతుంది. రోజూ రెండు పూటలా స్నానం చేయాలి. శుభ్రంగా ఉతికిన బట్టలు వేసుకోవాలి, ఎండాకాలం నీటికొరత తీవ్రంగా ఉంటుంది. అడుగూ బొడుగూ నీటిని కూడా నల్లాల్లో వదుల్తారు. దీని వల్ల నీటికి సంబంధించిన వ్యాధులు రాజ్యమేలతాయి. వాంతులు, విరేచనాలు, కామెర్లు, కలరా, టైఫాయిడ్ విజృంభించే ప్రమాదం ఉంది. నీటి పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. కాచి వడపోసిన నీళ్లు తాగాలి.

వేసవి కాలం వచ్చిందంటే చాలు భగభగ మండే సూర్యుడు తన ప్రతాపాన్ని మనమీద చూపుతాడు. మండే ఎండ బారి నుంచి రక్షణ పొందాలంటే కొన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి ఏటా మన దేశంలోనూ లక్షలాది మంది చర్మక్యాన్సర్ బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో వేసవిలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగ్గంటల వరకూ తీవ్ర ఎండలో హానికరమైన యూవీ కిరణాలు నేరుగా శరీరంపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

కళ్లకు రక్షణ అవసరం

ఎండలో వెళ్లేటప్పుడు కళ్లకు రక్షణగా సన్‌గ్లాసెస్‌ను వాడితే మంచిది. సూర్యకిరణాలు కళ్లలోకి పడితే కాటరాక్టు, గ్లూకోమా లాంటి కంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. యూవీ కిరణాలు కళ్లపై పడకుండా ఉండటంతోపాటు కళ్ల చుట్టూ ఉన్న సున్నితమైన కణాలు దెబ్బతినకుండా చలువ కళ్లద్దాలు కాపాడతాయి. సన్‌గ్లాసెస్‌ను ఎంపిక చేసుకునేటపుడు బ్లాక్ కలర్‌తోపాటు పెద్ద సైజువి ఎంపిక చేసుకోవడం మేలు.

వడదెబ్బకు చెక్ పెట్టాలంటే….వేసవి కాలంలో ద్రవ పదార్థాలు తగిన మోతాదులో తీసుకోకుంటే ఆరోగ్య సమస్యలతోపాటు ప్రాణానికి ప్రమాదం. వడదెబ్బతో పల్స్ రేటు పెరిగి, శ్వాస పీల్చడం కష్టమవుతుంది. వేడి బారి నుంచి రక్షణ పొందటానికి కూలర్ కింద నీడపట్టున ఉండాలంటారు. ఎండలో తిరిగేవారు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

* శరీరానికి నీరిచ్చే పుచ్చకాయ లాంటి ఆహారంతోపాటు ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. సోడా తాగే అలవాటు ఉంటే ఫ్రిజ్ వాటర్‌కు ప్రత్యామ్నాయంగా సోడా తాగొచ్చు.
* వ్యాయామం చేసేటట్లయితే దానికి ముందు ఎక్కువ నీరు తాగడం మంచిది. ఆఫీసులో పనిచేస్తున్నా అధికనీరు తాగడంతోపాటు వెంట బాటిల్ ఉంచుకోవడం మేలు. ఆహారం తీసుకునే ముందు నీళ్లు తాగడం మంచిది.
* ఎండ వేడిమి వల్ల శరీరంపై చెమట కాయలు వచ్చే అవకావం ఉంది. దీని బారి నుంచి రక్షణ పొందటానికి వేసవిలో ప్రిక్లీహీట్ పౌడర్‌ను వాడాలి.

పిల్లల విషయంలో మరింత జాగ్రత్త

Temperature Increased in Summer, Heavy Heat in Telangana

చిన్నారులు భానుడి ప్రతాపానికి చిగురుటాకుల్లా వణికిపోతారు. వారు ఆటల్లో పడితే ఆకలి దప్పులుండవు. వారికోసం ఇలా చేయండి..
*మధ్యాహ్నాలు ఇంట్లోనే ఆడుకోమని చెప్పండి. క్రికెట్‌లాంటి ఆటలను సాయంత్రాలకే పరిమితం చేయాలి. కథల పుస్తకాలు, పజిల్స్ అందుబాటులో ఉంచాలి. మార్కెట్‌లో దొరికే ఆహారం జోలికెళ్లకుండా పుష్టికరమైన చిరుతిళ్లు చేసిపెట్టాలి. నిపుణల సంరక్షణ ఉన్న స్విమ్మింగ్‌పూల్స్‌కి పంపాలి. బయటి తిండిని అస్సలు ఇవ్వకండి. నిల్వ ఉంచిన రుచులు, కూల్‌డ్రింక్స్ అస్సలు మంచివికావు. కలుషిత జలాలతో చేసిన చాట్ రుచులు, సురక్షితంకాని ఐసుముక్కలు కలిపిన చెరుకు రసాలు జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి. వెంటబడి మరీ మంచినీళ్లు తాగించాలి. డీహైడ్రేషన్ బారినపడకుండా పళ్ల రసాలు, మజ్జిగ లాంటివి ఇవ్వాలి. చెమట రూపంలో శరీరంలోని ఉప్పు బయటకు వెళ్లిపోతుంది .కాబట్టి మజ్జిగలో కాస్త ఉప్పు ఎక్కువైనా పర్వాలేదు.

కేశాలకు మరింత రక్షణ అవసరం

ఎండలో తిరగినప్పుడు తలకు చెమట పట్టి ఆ ప్రభావం జుట్టు పై పడుతుంది. ఏ కాలంలో నైనా జుట్టుకు పోషణ అవసరం. వేసవిలో సాధారణంగా జుట్టు పొడిగా నిర్జీవంగా తయారౌతుంది.
ఈ సమయంలో జుట్టు చివరలను కత్తిరించండి. కేశాలు చూడటానికి అందంగా కనపడటానికి, క్రమంగా కేశాలను అంచులో పావు వంతు కత్తిరించండి. తలపైన చెమట ఎక్కువగా రావటం వల్ల ఫలితంగా చుండ్రు కూడా ఎక్కువ అవుతుంది. ఇలాగని ప్రతిరోజూ తలస్నానం చేయాల్సిన అవసరంలేదు. అందువల్ల తలపై ఉండే చర్మం సహజ నూనెలను కోల్పోతుంది.
జుట్టును రోజు కాకుండా రెండు రోజులకు ఒక్కసారి శుభ్రం చేయడం మంచిది. కేశాలకు ప్రతిసారి షాంపూలను వాడటం వల్ల రీహైడ్రేషన్‌కు గురవుతాయి.
కాబట్టి ప్రోటీన్‌లతో కూడిన కండిషనర్‌లను వాడినట్లయితే షాంపూలను వాడటం వల్ల కలిగే నష్టాన్ని ఇవి భర్తీ చేస్తాయి. వారానికి ఒకసారి మాత్రమే కండిషనర్‌లను వాడాలి.

వడ దెబ్బతో జాగ్రత్త


గతేడాదికంటే ఈసారి ఎండలు మరింత మండిపోయే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోకుంటే వడదెబ్బబారిన పడతాం. మానవ శరీరం 32 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. ఈ ఉష్ణోగ్రత తీవ్రత 35 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరుకుంటే వడదెబ్బ సమస్య ఏర్పడుతుంది. 38 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరుకుంటే ప్రాణాంతకంగా మారినట్టే. వడదెబ్బకు గురైన వ్యక్తి అధిక ఉష్ణోగ్రత కారణంగా ఐదు రోజుల్లో మృతిచెందే అవకాశం ఉంటుంది. ఐదేళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు త్వరగా వడదెబ్బకు గురవుతారు. గర్భిణి స్త్రీలు కూడా శరీరంలో తేమ శాతాన్ని కాపాడుకోవాలి. లేకుంటే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. వడదెబ్బ ముందుగా శరీరంపై ప్రభావం చూపుతుంది. రక్తకణాలు కుంచించుకు పోయి దాని ప్రభావం కిడ్నీలు, ఊపిరి తిత్తులు, కాలేయంపై పడుతుంది.

వడదెబ్బ లక్షణాలు :

* వడదెబ్బకు గురైనవారి శరీరంలో నీటిశాతం లోపించి బాడీ డీహైడ్రేట్ అవుతుంది.
* శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది. దీని వల్ల గుండె, రక్తనాళాలు, కాలేయం, మూత్ర పిండాలు దెబ్బతింటాయి.
* ఒంట్లోని లవణాలు చెమట రూపంలో బయటకు వెళ్లిపోవడంతో మనిషి నీరసించిపోతాడు.
* జ్వరం, వాంతులు, విరేచనాలు, తల తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
* అధిక ఉష్ణోగ్రత వల్ల పల్స్ పడిపోతుంది. తల తిరగడం, తలనొప్పి వస్తాయి.
* మతి కోల్పోవడం, కోమాలోకి వెళ్లడం, మూత్రం పచ్చగా రావడం లాంటి లక్షణాలుంటాయి.
*వీటన్నింటిని జాగ్రత్తగా గమనిస్తూండాలి.

చికిత్స:
* వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే నీడలోకి తీసుకురావాలి.
* బట్టలను వదులు చేసి 25..- 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉన్న నీటితో శరీరాన్ని తడపాలి. దీని వల్ల శరీరంపై ఉండే రక్తనాళాలు కుంచించుకు పోకుండా ఉంటాయి.
* శరీర ఉష్ణోగ్రత తగ్గేలా చూడాలి. గజ్జలు, చంకలు, మెడపై ఐస్‌ప్యాక్‌లు పెట్టాలి.
* వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి.. సకాలంలో చికిత్స అందించాలి.
పాటించాల్సిన జాగ్రత్తలు:
* ప్రధానంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఎండలో తిరుగక పోవడం ఉత్తమం.
* ఏదైనా పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే తలకు, ముఖానికి ఎండ తగులకుండా జాగ్రత్త పడాలి. టోపీ, గొడుగు, తలపాగా ధరించాలి.
* ఇళ్లు, కార్యాలయాల్లో చల్లటి వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
* ప్రతిరోజూ 5 లీటర్లకు తక్కువ కాకుండా నీరు తాగాలి.
* నీరసంగా అనిపిస్తే ఓఆర్‌ఎస్, గ్లూకోజ్ కలిపిన నీటిని తీసుకోవాలి.
* ఆహారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.
* కారం, మసాలాలకు వీలైనంత దూరంగా ఉండాలి.
* కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలి.
* వేపుడు పదార్థాలు, కాఫీ, ఫాస్ట్‌ఫుడ్, ఆల్కహాల్ తాగడం మానేయాలి.
* యోగా, నడకకు ప్రాధాన్యం ఇవ్వాలి.
* వదులుగా ఉండే కాటన్ దుస్తులనే ధరించాలి.

వేసవిలో ఇన్ని జాగ్రత్తలను తీసుకోవడంతోపాటు ఇంట్లోనే చక్కని జ్యూస్‌లను తయారుచేసుకుని ఇంటిల్లిపాదీ తాగొచ్చు. బయట దొరికే జ్యూస్‌లకు వీలైనంత దూరంగా ఉండటమే మంచిది. కొంచెం సమయం కేటాయిస్తే ఆరోగ్యం, ఆనందం సొంతం అవుతుంది. ఇంట్లోనే సులభంగా తయారుచేసుకునే కొన్ని జ్యూస్‌లను ఎలా చేయాలో తెలుసుకుందాం…
నిమ్మ-పుదీనా జ్యూస్
సోడాలంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ బయట దొరికే సోడాలన్నీ ఆరోగ్యానికి అంత మంచివి కావు. అవి ఇష్టపడేవారు నిమ్మ-పుదీనా జ్యూస్‌ను ఇంట్లోనే తయారుచేసుకుని తీసుకుంటే మంచిది. ఒక గ్లాసు నిమ్మ-పుదీనా జ్యూస్ తీసుకుంటే 76 కేలరీల శక్తి శరీరానికి అందుతుంది. దీనిలోని 40 గ్రా. సోడియం, 20.1 గ్రా. కార్బోహైడ్రేట్స్ శరీరానికి మేలు చేస్తాయి
తయారీ: గ్లాసులో కొంచెం నిమ్మరసం తీసుకోండి. దానిలో కొన్ని తాజా పుదీనా ఆకులు వేయండి. తీపి కోసం మీకిష్టమైన సిరప్‌ను రెండు స్పూన్స్ కలుపుకోండి. ఇప్పుడు గ్లాసు నిండా చల్లని కార్బోనేటెడ్ వాటర్ (క్లబ్ సోడా, టానిక్ వాటర్ వంటివి వాడొద్దు) పోయాలి. జ్యూస్ చల్లగా లేకపోతే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు.
ఆరెంజ్ స్పోర్ట్ డ్రింక్
కృత్రిమంగా తయారుచేసి రిఫ్రిజిరేటర్లలో పెట్టి అమ్మే జ్యూసుల జోలికిపోవద్దు. ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే 100 శాతం సహజసిద్ధమైన జ్యూసులు తీసుకోండి. ఈ వేసవిలో ఇలాంటి జ్యూసులు మీకు డీహైడ్రేషన్ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. వాటిలో ముఖ్యమైనది ఆరెంజ్ స్పోర్ట్ డ్రింక్ ఒకటి. ఎండలో బాగా కష్టపడేవారికి, ఎక్కువగా అలసటకు గురయ్యేవారికి ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఒక గ్లాసు ఆరెంజ్ స్పోర్ట్ డ్రింక్ తాగితే 61 కేలరీల శక్తి అందుతుంది. 162 మిల్లీ గ్రాముల సోడియం, 15.3 కార్బోహైడ్రేట్స్ శరీరానికి అందుతాయి. అంతేకాదు ఇది జీరో కొలెస్ట్రాల్ డ్రింక్.
తయారీ: అర గ్లాసు నీళ్లను పొయ్యి మీద పెట్టి బాగా మరిగించండి. మరిగిన నీటిని గ్లాసులో పోసుకుని దానిలో రెండు టీస్పూన్ల తేనె, అరటీస్పూన్ ఉప్పు కరిగేంత వరకు కలపండి. ఇప్పుడు మరో గ్లాసులో కొంచెం మంచి నీళ్లు తీసుకొని దానికి ఒక నారింజ పండు జ్యూస్, ఒక నిమ్మకాయ రసాన్ని కలపండి. ఇప్పుడు రెండు గ్లాసుల్లోని నీళ్లను కలపాలి. ఇప్పుడు ఈ పానీయాన్ని రిఫ్రిజిరేటర్‌లో పెట్టి బాగా చల్లగా అయిన తరవాత సేవించండి.
దానిమ్మ రసం
ఇంట్లో రెండే రెండు నిమిషాల్లో తయారుచేసుకోగల ఈ దానిమ్మ రసం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ మధ్యకాలంలో కృత్రిమ దానిమ్మ జ్యూస్‌లు మార్కెట్‌లో ఎక్కువగా దొరుకుతున్నాయి. వాటిని మర్చిపోండి. దానిమ్మ పళ్లను కొనుగోలుచేసి ఇంట్లోనే జ్యూస్ తయారుచేసుకుని తాగితే ఉత్తమం. ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్‌తో 75 కేలరీల శక్తి శరీరానికి అందుతుంది. గ్లాసు దానిమ్మ రసంలో 18.5 గ్రాముల కార్బోహైడ్రేట్స్, జీరో కొలెస్ట్రాల్ ఉంటాయి.
తయారీ: ఇష్టాన్ని బట్టి దానిమ్మ రసాన్ని మంచి నీటితోనూ, కార్బోనేటెడ్ వాటర్‌తో తయారుచేసుకోవచ్చు. ఒక కప్పు దానిమ్మ పిక్కలు తీసుకొని మిక్సీలో జ్యూస్ ఆడాలి. దాన్ని ఒక గ్లాసులో వడపోయాలి. దీనిలో అరకప్పు కార్బోనేటెడ్ వాటర్ లేదా మంచి నీటిని కలుపుకోవాలి. దీనికి కొంచెం నిమ్మరసం జతచేస్తే రుచి బాగుంటుంది. చల్లదనం కోసం కొన్ని ఐస్ క్యూబ్‌లు వేసుకుని తాగితే వేసవిలో హాయిగా అనిపిస్తుంది.
వాటర్‌మిలన్ చిల్లర్
వేసవిలో ఎక్కవ మంది ఇష్టంగా తినే పండు పుచ్చకాయ. ఈ జ్యూస్‌ను కూడా చాలా మంది ఇష్టపడతారు. చాలా సులభంగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. అయితే బయట రెగ్యులర్‌గా దొరికే పుచ్చకాయ జ్యూస్‌కు ‘వాటర్‌మిలన్ చిల్లర్’ కాస్త తేడా ఉంది. పుచ్చకాయ, దానిమ్మ, నిమ్మ కాంబినేషన్‌లో తయారుచేసే ఈ జ్యూస్ నోటిని రుచిగా ఉంటుంది. అంతేకాకుండా శరీరానికి 87 కేలరీల శక్తిని అందజేస్తుంది. కొలెస్ట్రాలు ఉండవు. గ్లాసు వాటర్‌మిలన్ చిల్లర్‌తో 22.1 గ్రాముల కార్బోహైడ్రేడ్స్, 1.1 గ్రాముల ప్రొటీన్ శరీరానికి అందుతుంది.
తయారీ: పుచ్చకాయను చిన్న చిన్న ముక్కలుగా కోసి, వాటిలోని పిక్కలను తొలగించాలి. ఇప్పుడు మిక్సీలో రెండు కప్పుల పుచ్చకాయ ముక్కలు, అరకప్పు దానిమ్మ జ్యూస్, కొంచెం నిమ్మరసం, రెండు పుదీనా ఆకులు వేసి బ్లెండ్ చేయాలి. ఇప్పుడు ఆ రసంలోని ఐస్ క్యూబ్స్ వేసుకుని గానీ, చల్లగా అయ్యేంత వరకు ఫ్రిజ్‌లో పెట్టుకుని గానీ తీసుకోవచ్చు. ఈ వేసవికి ఇది ది బెస్ట్ జ్యూస్.  ఇలా ఇంట్లో తయారయ్యేవాటిని తాగుతూ ఈ వేసవిని సరదాగా ఎంజాయ్ చేసేద్దాం..

మల్లీశ్వరి వారణాసి

 

Summer Safety Tips: Sun and Heat Precaution