Home జాతీయ వార్తలు వృద్ధి రేటు 8 శాతం చేరుకుంటుంది : సునీల్ కనోరియా

వృద్ధి రేటు 8 శాతం చేరుకుంటుంది : సునీల్ కనోరియా

Sunil-Kanoriaన్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి రేటు 8 శాతానికి చేరుకుంటుందని అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోఛాం)కు కొత్తగా అధ్యక్షునిగా ఎన్నికైన సునీల్ కనోరియా ఆశాభావం వ్యక్తం చేశారు. జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందితే వృద్ధి రేటు సునాయసంగా 9.5 శాతానికి చేరుకుంటుందని అన్నారు. అసోఛాం అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి విలేకరుల సమావేశంలో సునీల్ మాట్లాడుతూ జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందకపోవడం పట్ల చింతిస్తున్నానని, దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్టపరిస్థితుల నుండి బయటపడడం చాలా కష్టంగా మారిందని అన్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించైనా, ప్రస్తుత సమావేశాలను పొడిగించైనా జిఎస్‌టి సవరణ బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదం పొందింపజేసి వచ్చే ఆర్థిక సంవత్సరంలోనైనా అమలుచేసేలా చూడాలని అన్నారు. జిఎస్‌టి ఆదాయ తటస్థీకరణకు దారి తీస్తుందన్న కేంద్ర ప్రభుత్వవాదనకు ఏకీభవిస్తున్నట్లు కనోరియా తెలిపారు. ఖచ్చితమైన జిఎస్‌టికి చాలా సమయం పడుతుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు బలమైన భాగస్వామ్యంతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కాంట్రాక్టు (ఇపిసి) వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ప్రత్యేకంగా మౌలిక రంగం పతన దశకు చేరుకుంటుందన్నారు.