Home ఆఫ్ బీట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌తో సూపర్ కెరీర్

ఇంటర్నేషనల్ రిలేషన్స్‌తో సూపర్ కెరీర్

lf

పెద్ద కెరీర్‌లో ఎస్టాబ్లిష్ కావాలని కోరుకునేవారు ఎంబిబిఎస్, ఇంజనీరింగ్ వంటి కొన్ని కోర్సుల దగ్గరే ఆగిపోతున్నారు. ఐఎఎస్, ఐపిఎస్ అంటూ కొన్ని లక్ష్యాలకే పరిమితమవుతున్నారు. నిజంగా చాలామందికి అంతగా అవగాహనలేని కోర్సు, అద్భుతమైన అవకాశాలు ఉన్న కోర్సు ఇంటర్నేషనల్ రిలేషన్స్! దేశాల మధ్య దౌత్యసంబంధాలు కుదుర్చడం, ఉన్న వాటిని సవ్యంగా సాగేలా కృషిచేయడం, అంతర్జాతీయ వేదికలతో సత్సంబంధాలు కొనసాగేలా చూడడం, అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించడం, ప్రభుత్వాల మధ్య సన్నిహిత సంబంధాలు నెలకొనే విధంగా చూడడం వంటి కీలకమైన బాధ్యతలను నిర్వహించే సువర్ణావకాశం ఈ కోర్సు చదివిన వారికి అవకాశం లభిస్తుంది.
మారుతున్న వాతావరణంలో ప్రపంచ దేశాలు పరస్పరం కలిసి పనిచేయాల్సిన పరిస్థితులు పెరిగిపోతున్నాయి. కయ్యానికి కాలుదువ్వేందుకు ఎవ్వరు ఆవేశపడినా దాని ప్రభావం ప్రపంచం మొత్తం మీద ఉంటుంది. పరిస్థితులు ఏవైనా, ఎలా ఉన్నా చక్కదిద్దేందుకు కృషిచేయాల్సిన బాధ్యత రాజకీయనాయకులకు ఎంత ఉంటుందో అంతకుమించి దౌత్యాధికారుల మీద ఉంటుంది. ఈ దౌత్యాధికారులుగా పనిచేయడానికి ఈ కోర్సు వీలు కల్పిస్తుంది. రాజకీయ, ఆర్థిక, సామాజిక సాంస్కృతిక వ్యవస్థలన్నిటిలోనూ ఈ కోర్స్ చదువుకున్న వారికి పనిచేసే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కోర్స్ చదవడం వల్ల రాజకీయ వ్యవహారాలు, ప్రభుత్వాల విధానాలు, ఆర్థిక పోకడలు, సామాజిక వివాదాలు, అంతర్జాతీయ న్యాయం వంటి అనేక అంశాలపైన విస్తృత అవగాహన కలుగుతుంది.
డిప్లమాట్ ః డిప్లమాట్‌గా ఉద్యోగంలో కుదురుకుంటే రాజకీయ రంగంలో, వాణిజ్య, వ్యాపార రంగాలలో, సలహాలు, సంప్రదింపుల రూపంలో అనేక రకాలుగా సేవలందించడానికి, ప్రత్యక్ష పాత్ర నిర్వహించడం ద్వారా దేశానికి ఉపయోగపడే అనేక పనులు చేశామన్న తృప్తి పొందడానికి ఉపయోగపడుతుంది. జాతి ప్రయోజనాలను కాపాడే బృహత్తర యాగంలో నా వంతు పాత్ర నిర్వహించి దేశం రుణం తీర్చుకున్నానని గర్వంగా జీవించడానికి గొప్ప అవకాశం కలుగుతుంది. అతి కొద్దిమందికి మాత్రమే లభించే ఈ ప్రత్యక్ష సేవ మీకు లభిస్తుంది. జాబ్ సాటిస్‌ఫాక్షన్, జేబు సాటిస్ఫాక్షన్ సమానంగా ఉండే ఉద్యోగంలో చేరతారు కనుక అసంతృప్తి పడడానికి ఆస్కారం ఉండదు.
దౌత్యవేత్తగా ఒక దేశానికి వెళ్తే కనీసంగా మూడేళ్ళపాటు పనిచేయాల్సి ఉంటుంది. మీ సొంత దేశానికి, మీరు పనిచేసే దేశానికి మధ్య చక్కని లంకె లాగా మీ సేవలు ఉపయోగపడతాయి. ఉభయదేశాల మధ్య యుద్ధపరిస్థితులు నివారించడానికి, వ్యాపార, వాణిజ్య, ఆర్థిక సాంస్కృతిక రంగాలలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి మీ సేవలు అద్భుతంగా ఉపయోగపడతాయి. కీలక స్థానాలలో ఉండే అధికారులతో, నాయకులతో కలిసి పనిచేయడానికి, వారితో చర్చలు జరపడానికి, బేరసారాలు సాగించడానికి, రాయబారాలు నడపడానికి దివ్యమైన అవకాశం ఈ చదువు మీకు ఇస్తుంది.
ఈ డిప్లమసి వైపు ఉండి దేశానికి, మీ దేశ పౌరులకు సేవలందించాలనుకుంటే మీకు ఈ రంగంలో మంచి విద్య నందించేందుకు కల్చరల్ అండ్ డిజిటల్ డిప్లమసి కోర్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కోర్స్‌ను ఇటలీలోని యూనివర్శిటి కట్టొలిక డెల్ సాక్రో క్యురో ఆఫర్ చేస్తోంది. అలాగే అంతర్జాతీయ సంబంధాలు, దౌత్యం గురించి చదవాలనుకుంటే చెక్ రిపబ్లిక్‌లోని ఆంగ్లో అమెరికన్ యూనివర్శిటీ అందిస్తోంది. సాంస్కృతిక దౌత్యం, అంతర్జాతీయ వేడుకులంటే ఆసక్తి ఉంటే కల్చరల్ డిప్లమసి అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కోర్స్‌ను చదవాలి. దీన్ని యుకెలోని వెస్ట్ స్కాట్‌ల్యాండ్ వర్శిటీ అందిస్తోంది.
ఇంటెలిజెన్స్ స్పెషలిస్ట్ ః మీకు ఇంటెలిజెన్స్ స్పెషలిస్ట్‌గా ఉండాలనుకుంటే దానికి కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. దేశానికి ప్రాణసమానమైన సమాచారాన్ని సేకరించి ఇవ్వడానికి ఈ డిప్లమసి ఉద్యోగం ఎంతగానో ఉపయోగపడుతుంది. కంటి ముందు జరుగుతున్న అనేకాంశాలపై ఓ కన్నేసి ఉండడం, అవసరమైన సమాచారాన్ని సేకరించడంలో ఆసక్తి ఉన్నవారికి ఇది స్వర్గంలా ఉంటుంది. సైనిక, నౌకాదళ, భద్రతా బలగాలు, జాతీయ, రాష్ట్రీయ నిఘా విభాగాలలో పనిచేయడానికి ఈ కోర్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రహస్యాలను సేకరించడంవిశ్లేషించడం, నివేదికలు తయారు చేయడం, సేకరించిన డేటా ఆధారంగా మ్యాప్‌లు, చార్ట్‌లు తయారుచేయడం, ఫలితాలను విశ్లేషించడం, గ్రాఫ్‌లు తయారుచేయడం, డేటాబేస్‌లు, గ్రంథాలయాలు, ఫైళ్లను జాగ్రత్తగా నిర్వహించడం వంటి అనేక ఉద్యోగాలలో ఈ కోర్స్ చదువుకున్న వారి సేవలు ఉపయోగపడతాయి. ఈ కోర్స్‌ను యుకెలోని యూనివర్శిటీ ఆఫ్ బర్మింగ్‌హమ్, బెల్జియంలోని వెసాలియస్ కాలేజీ (బ్రజెల్స్) ఆఫర్ చేస్తున్నాయి.
ఇక రాజకీయ విశ్లేషకులిగా రాజకీయ వాతావరణాన్ని ఎప్పటికప్పుడు గమనించి, విశ్లేషించే ఆసక్తి ఉంటే పొలిటికల్ ఎనలిస్ట్ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సేవలను వినియోగించుకును ప్రభుత్వ ఉద్యోగాలున్నా మీడియా కంపెనీలు, రీసెర్చి ఇనిస్టిట్యూట్‌లు కూడా అవకాశాలు ఇస్తుంటాయి. రాజకీయాలనే కాదు చట్టాలను, పబ్లిక్ పాలసీలను, ప్రభుత్వ నిర్ణయాలను విశ్లేషించే అవకాశం ఈ ఉద్యోగం కల్పిస్తుంది. ప్రభుత్వ అధికారులకు, రాజకీయపార్టీలకు, మీడియాకు సలహాదారులుగా పనిచేయడానికి కూడా ఈ కోర్స్ వీలుకల్పిస్తుంది. రాజకీయ పోకడలను అంచనా వేయడానికి, ఎన్నికల ఫలితాలను విశ్లేషించడానికి, గత కాలపు లోతు పాతులు గమనించి విశదీకరించడానికి ఈ కోర్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రంగంలో మీకు ఆసక్తి కనుక ఉంటే చెక్ రిపబ్లిక్‌లోని మసర్యక్ వర్శిటీని సంప్రదించండి. అక్కడ కాన్‌ఫ్లిట్ అండ్ డెమక్రసీ స్టడీస్ అనే కోర్స్ ఉంది. అలాగే నెదర్లాండ్స్‌లోని ట్వింటె వర్శిటీలో యూరోపియన్ స్టడీస్ కోర్స్ ఉంది.
లాబీయిస్ట్ ః మరో కీలకమైన ఉద్యోగం లాబీయిస్ట్. అప్పగించిన అంశానికి మద్దతు కూడగట్టి ఆ పని ఎలాగైనా పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యతను స్వీకరించాల్సి ఉంటుంది. దేశం పరువు, అవసరం, మిమ్మల్ని హైర్ చేసుకున్న వారి పరువు, అవసరం మీ ప్రావీణ్యంమీద, మీ సమయోచిత ప్రతిభాపాటవాల మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి చాలెంజింగ్ టాస్క్ చేయాలనే ఉత్సాహం మీకు ఉంటే మీ సేవలు వినియోగించు కోడానికి పెద్దపెద్ద సంస్థలు ముందుకొస్తాయి. ఈ విషయంలో మీకు మంచి ఫౌండేషన్ వేయగల కోర్సును నెదర్లాండ్స్‌లోని రాడ్‌బౌడ్ వర్శిటీ, డెన్మార్క్‌లోని రాస్కిల్‌డే వర్శిటీలు అందిస్తున్నాయి.
కమ్యునికేషన్స్ స్పెషలిస్ట్‌ః ఈ రంగంలోనే మీకు అందుబాటులో ఉన్న మరో మంచి అవకాశం కమ్యునికేషన్స్ స్పెషలిస్ట్. ఈ కోర్స్‌చేస్తే అంతర్జాతీయ స్థాయిలో మీ సేవలు వినియోగించుకోడానికి అనేక సంస్థలు ముందుకొస్తాయి. వాటిలో వరల్డ్ విజన్, రెడ్‌క్రాస్ వంటి లాభాపేక్షలేని ప్రపంచస్థాయి సంస్థలు ముందు వరసలో ఉంటాయి. మంచి కమ్యుని
కేషన్ స్కిల్ ఉండాలి. అలాంటి శుభలక్షణాలు మీకుంటే నెదర్లాండ్స్‌లోని టిల్‌బర్గ్ వర్శిటీ ఆన్‌లైన్ కల్చర్‌గ్లోబల్ కమ్యునికేషన్ డిగ్రీ ఆఫర్ చేస్తోంది. అలాగే స్ట్రాటజిక్ కమ్యునికేషన్ కోర్స్‌ను ఆస్ట్రేలియాలోని యూనివర్శిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఆఫర్ చేస్తోంది. ఇంత మంచి కోర్సులు కళ్ళముందు ఉంటే ఆలస్యం దేనికి? వెంటనే అప్లయ్ చేయండి. జాగ్రత్తగా ప్రిపేరై సీటు సంపాదించండి. ఎదురు చూడాల్సిన అవసరం లేకుండానే ఉద్యోగం మీ ఒళ్ళోకి వచ్చి వాలుతుంది. ఆల్ ది బెస్ట్!!