Home నిజామాబాద్ ఫలించిన ఎంపి వ్యూహం

ఫలించిన ఎంపి వ్యూహం

Support for growing councilors to the chairman

చైర్మన్‌కు పెరుగుతున్న కౌన్సిలర్ల మద్దతు

మనతెలంగాణ/బోధన్: మున్సిపల్ చైర్మన్ పదవికి కౌన్సిలర్లు ఎసరు పెట్టడంతో పలు నాటకీయ పరిణామాల మధ్య చైర్మన్‌పై ఎంఐఎం కౌన్సిలర్లతో పాటు అధికార పార్టీకి చెందిన కొందరు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ కలెక్టర్‌కు సంతకాలతో నివేదికను అందించారు. ప్రధాన ప్రతిపక్షంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఏడుగురు ఎంఐఎం కౌన్సిలర్లను ఉసిగొలిపి చైర్మన్‌ను ఒంటరి చేస్తూ బల్దియాలో కాంగ్రెస్ నాయకులు చైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు 29 మంది కౌన్సిలర్లతో అవిశ్వాసానికి పూనుకున్నారు. కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని కలెక్టర్ రామ్మోహన్ రావు స్వీకరించి బల నిరూపణ కోసం చైర్మన్‌కు 25వ తేదీని ఖరారు చేయడంతో నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత రంగ ప్రవే శం చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యూహా న్ని తిప్పికొట్టారు. చైర్మన్‌ను గట్టెక్కించేందుకు ఎంపి రచించిన వ్యూహం ఫలించి చైర్మన్ ఎల్లయ్యకు కౌన్సిలర్ల మద్దతు పెరిగేలా చేశారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఏదైతే ఎంఐఎం కౌన్సిలర్లతో చైర్మన్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టాలని వారిని పావులా వాడుకుని కాంగ్రెస్ నాయకులు చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఎంపీ కవిత ఎంఐఎం కౌన్సిలర్లను పిలిపించి మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీతో కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకునేలా చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు కుదేలై అంతుచిక్కని పరిస్థితుల్లో మిన్నకుండిపోయారు. కాంగ్రెస్ పార్టీని ఒంటరి చేస్తూ ఎమ్మెల్యే షకీల్ తో పాటు ఎంపి పాచికలు వేసి చైర్మన్ పదవిని గండం నుండి ఎల్లయ్యను గట్టెక్కించారు. బిజెపి కౌన్సిలర్లు సైతం అధికార పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తుండడంతో చైర్మన్‌కు మరింత మద్దతు పెరగడంతోపాటు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సైతం కొందరు అధికార పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు.
బోధన్ బల్దియాలో పలు నాటకీయ పరిణాలమాల మధ్య చైర్మన్ పదవికి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి తెర పడింది. ఎంపి నిర్ణయంతో అధికార పార్టీకి దళిత సంఘాల మద్దతు మరింత పెరిగింది. దళితులను రెచ్చగొట్టి ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వేసిన పన్నా గం ఫలించకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.