Home రాష్ట్ర వార్తలు కోదండరామ్‌కు అండ

కోదండరామ్‌కు అండ

టిజెఎసి చైర్మన్‌పై టిఆర్‌ఎస్ విమర్శలకు భగ్గుమన్న ఓయూ విద్యార్థులు
ఒయూలో సిఎం, మంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేసిన తెలంగాణ నిరుద్యోగ జెఎసి

OUఉస్మానియా యూనివర్సిటీ / మన తెలంగాణ: తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌పై రాష్ట్ర మంత్రులు, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం ఒక్కసారిగా భగ్గుమన్నది. తెలంగాణ నిరుద్యోగ జేఏసి చైర్మన్ జె. కల్యాణ్ ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం ఓయూ ఆర్ట్ కళాశాల ముందు సిఎం కేసిఆర్, మంత్రుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కల్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జేఏసి చైర్మన్‌గా నాయకత్వం వహిస్తూ ఉద్యమాన్ని గ్రామ..గ్రామాన తీసుకుపోయి అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేసిన వ్యక్తి కోదండరామ్ అని పేర్కొ న్నారు. టిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్, టిఆర్‌ఎస్ నాయకులు ఉద్యమం చేయ కుండా ఉంటే ఉద్యమాన్ని బతికించింది, ముందుకు తీసుకుపోయింది కోదండరామ్ అని తెలిపారు. అలాంటి నేతపై టిఆర్‌ఎస్ మంత్రులు, ఎం.పిలు, ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇక రాష్ట్రంలో కేసిఆర్ ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకత ప్రారంభమైందని, రానున్న రోజుల్లో ఉద్యమం ఉధృతమ వుతుందన్నారు. ఈ కార్య క్రమంలో తెలంగాణ నిరుద్యోగ జేఏసి నాయకులు సాంబశివగౌడ్, బాబూ లాల్ నాయక్, రవీంద్రనాయక్, నరేందర్‌పవార్, గణేష్, అశోక్ పవార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రొఫెసర్ కోదండ రాంపై టిఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎం.పిలు చేసిన అనుచిత వ్యాఖ్య లను ఓయూ విద్యార్థి సంఘాల జేఏసి నాయకులు తీవ్రంగా ఖండించారు. కేసిఆర్ ప్రభుత్వానికి ఇక పతనం ప్రారంభమైందని వారు విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. బాలలక్ష్మి, మాందాల భాస్కర్, దుర్గం భాస్కర్, కల్యాణ్, దరువు ఎల్లన్న, పుల్లారావు యాదవ్, చారకొండ వెంకటేష్, సాంబశివగౌడ్, విజయ్‌యాదవ్, చరణ్‌కౌశిక్ యాదవ్, ఉదయ్, బాబూలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పై టిఆర్‌ఎస్ మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక అధ్యక్షులు నిజ్జెన రమేశ్ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆర్ట్ కళాశాల ముందు తెలంగాణ ద్రోహుల పేరుతో టిఆర్‌ఎస్ మంత్రులు తుమ్మల, తలసాని, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కొండాసురేఖ, ఎం.పి డిఎస్ మొదలైన వారి ఫొటోలు ప్రదర్శించి ఆ ఫొటోలను చెప్పులతో కొట్టి విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టివియూవి ప్రధాన కార్యదర్శి సలీం, బాలకృష్ణ, చందర్ తదితరులు పాల్గొన్నారు.

కోదండరామ్ తెలంగాణ గాంధీ : దాసోజు

కోదండరామ్ తెలంగాణ గాంధీ అని, కెసిఆర్ చెంచాలు ఆయనై దాడి చేస్తుంటే తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని టిపిసిసి ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ అన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించే వ్యక్తులను కెసిఆర్ అణిచిస్తున్నారని, ఇదేమైనా కల్వకుంట్ల దేశమా? అని ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వం కోదండరామ్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ కోదండరామ్‌పై టిఆర్‌ఎస్ దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.  రైతుల ఎన్నో ఇక్కట్లు పడుతున్నారని, వారి తరుపున కోదండరామ్ మాట్లాడడం తప్పా అని ప్రశ్నించారు.

కోదండరామ్‌ను కరివేపాకులా తీసేస్తారా? 

ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణపై నిబద్ధత కలిగిన నేత అని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు.హైదరాబాద్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోదండరామ్‌ను ఉద్యమ సమయంలో టిఆర్‌ఎస్ ఉపయోగించుకొని, ఇప్పుడు కరివేపాకులా తీసి పడేస్తున్నదని విమర్శించారు. ప్రశ్నించే ప్రతి వ్యక్తిని కాంగ్రెస్ ఏజెంట్ అనడం దారుణమన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ దళారీ అన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, వైసిపిని టిఆర్‌ఎస్‌లో కలిపి తుమ్మల కమిషన్ కింద మంత్రి పదవి తీసుకున్నారని ఆరోపించారు. త్వరలో ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతి బైటపెడతామని, కొన్ని చోట్ల పోలీసులు టిఆర్‌ఎస్ కార్యకర్తల్లాగా పని చేస్తున్నారని అన్నారు.

అసలైన నాగు పాము కెసిఆర్ : రేవంత్‌రెడ్డి

తెలంగాణ ఉద్యమాన్ని మేథోసంపత్తితో శాంతియుతంగా సాధించడంలో కీలక పాత్ర పోషించిన  కోదండరామ్‌ను విషనాగు అని టిఆర్‌ఎస్ నేతలు విమర్శించడం దారుణమని, కెసిఆర్, ఆయన అనుచరులే అసలైన నాగు పాములని టిడిపి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎన్‌టిఆర్ భవన్‌లో మంగళవారం టిడిపి సీనియర్ నేతలు విజయ రమణారావు, పాల్వాయి రజనీకుమారి, చిలుక మధుసూదన్‌రెడ్డిలతో కలిసివిలేకరుల సమావేశం లో ఆయన   మాట్లాడారు.  రెండేళ్లుగా కోదండరామ్ రాష్ట్రం లో పర్యటించి వాస్తవ పరిస్థితిని చూసిన తర్వాతనే స్పందించారని అన్నారు. కోదండరామ్‌పై వ్యాఖ్యలు చేసిన మంత్రులకు సిఎం కెసిఆర్ షోకాజ్ నోటీసులు ఇచ్చి జరిగిన తప్పిదానికి వివరణ ఇవ్వాలని, లేకపోతే మరోసారి మేధావి వర్గంతో కలిసి పోరుకు దిగుతామని  హెచ్చరించారు.

కోదండరామ్ తెలంగాణ గాంధీ : దాసోజు  

కోదండరామ్ తెలంగాణ గాంధీ అని, కెసిఆర్ చెంచాలు ఆయనై దాడి చేస్తుంటే తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని టిపిసిసి ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ అన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించే వ్యక్తులను కెసిఆర్ అణిచిస్తున్నారని, ఇదేమైనా కల్వకుంట్ల దేశమా? అని ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వం కోదండరామ్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ కోదండరామ్‌పై టిఆర్‌ఎస్ దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.  రైతుల ఎన్నో ఇక్కట్లు పడుతున్నారని, వారి తరుపున కోదండరామ్ మాట్లాడడం తప్పా అని ప్రశ్నించారు.

ప్రశ్నిస్తే ఉలుకెందుకు? : జీవన్‌రెడ్డి

తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్‌ను చూస్తే టిఆర్‌ఎస్ ఉలిక్కిపడుతుందని మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి అన్నారు. సిఎల్‌పి కార్యాలయం వద్ద మంగళవారం ఆయన మాట్లాడుతూ కోదండరామ్‌పై మంత్రులు చేసిన విమర్శలు తెలంగాణ వాదులను అవమాన పర్చడమేనని అన్నారు. తెలంగాణ జెఎసి కన్వీనర్‌గా కోదండరామ్ తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించారని జీవన్‌రెడ్డి గుర్త చేశారు. క్షేత్ర స్థాయిలో వెల్లడవుతున్న అభిప్రాయాన్నే కోదండరామ్ వ్యక్తం చేశారని చెప్పారు. కోదండరామ్ తెలంగాణ పౌరుడు కాదా? ప్రజల ఆకాం క్షను వ్యక్తం చేయొద్దా? అని ప్రశ్నించారు. ఉద్యమంలో పని చేసిన వారిపై ఆంక్షలు విధిస్తారా? అని మండిపడ్డారు. రాష్ట్రం లో పౌర హక్కులు ఉన్నాయా? లేదా? అని అనుమానం కలుగు తుందన్నారు. కోదంరామ్‌పై చేస్తున్న దాడి కెసిఆర్ రాచరికపు పాలనను తలపిస్తుందన్నారు.

టిఆర్‌ఎసలో అసహనం పెరిగింది: పొంగులేటి

మనతెలంగాణ /న్యూఢిల్లీ : తెరాసలో అసహనం ఎక్కువై పోయిందని పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. కోదండరాం పట్ల తెరాస నేతలు వ్యవహరిస్తున్న తీరుతో అధికార పార్టీలోని అసహనం మరోసారి బయటపడిందని అన్నారు. ప్రభుత్వ పనితీరులో లోపాల్ని ఎత్తిచూపిన కోదండరాంపై టీఆర్‌ఎస్ పార్టీ మొత్తం వ్యక్తిగత దూషణలకు దిగడం సిగ్గుచేటని అన్నారు. కోదండరాం లెవనెత్తిన అంశాలకు సమాధానం ఇవ్వకుండా ఆయన్ని పాములతో పోల్చడం ఏంటని ప్రశ్నించారు. అధికార పార్టీ హుందాతనాన్ని కోల్పోయిందని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ మొత్తం ఒక్క కోదండరాంను టార్గెట్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. జేఎసీ ఛైర్మన్‌గా ఎంపిక కావడంలో కేసీఆర్‌తో పాటు అన్ని పార్టీల  పాత్ర ఉందని అన్నారు.

తప్పులు ఎత్తిచూపితే వాగ్బాణాలా? : నాగం

అవసరం కోసం జెఎసిని వాడుకున్న టిఆర్‌ఎస్ ఇప్పుడు తాను చేస్తున్న తప్పిదాలను చెపితే ఎందుకు కోదండరామ్ పై వాగ్బాణాలు సంధిస్తున్నారని మాజీ మంత్రి,బిజెపి నేత నాగం జనార్ధన్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం జరిగిన పోరులో ఏనాడూ జండా పట్టని మంత్రి తలసాని కూడా కోదండరామ్‌ను ప్రశ్నించే స్దితికి వచ్చాడా అంటూ నిప్పుటు చెరిగారు. రాష్ట్ర బిజెపి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇదేమి రాచరిక వ్యవస్థా ప్రశ్నించవద్దంటే ఏమిటని ప్రశ్నించారు. ప్రశ్నించడమనేది రాజ్యాంగం కల్పించిన హక్కని ఎవరైనా ఎవరినైనా ప్రశ్నించే హక్కు ఉందన్నారు. జెఎసి వారి సొంత జాగిరి కాదని,ఎవరి అనుమతులు తీసుకుని మాట్లాడవలసిన అవసరం లేదని అన్నారు.

అనుచిత వ్యాఖ్యలు సరికాదు : సుధాకర్

సోమాజిగూడ/మన తెలంగాణ: ప్రజల గొంతులను నొక్కాలని చూస్తే వంద జెఎసిలు పుట్టు కొస్తాయని తెలంగాణ ఉద్యమ వేదిక హెచ్చరించింది. జెఎసిలు లేక పోతే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేదా అని ప్రశ్నించారు.  మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో వేదిక అధ్యక్షుడు చెరుకు సుధాకర్, కార్యదర్శి యన్నం శ్రీనివాస్ రెడ్డి, ప్రజా తెలంగాణ కన్వీనర్ శ్రీశైల్‌రెడ్డిలు మాట్లాడుతూ మంత్రులు, ప్రజాప్రతినిధులు కోదండరామ్‌పై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. రెండేళ్ల టిఆర్‌ఎస్ పాలనలో చేసింది ఏమీ లేదని, అనేక తప్పుడు నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపించే వారిపై మౌఖిక దాడులకు పాల్పడటం  సిగ్గుచేటని అన్నారు.

విమర్శలకు న్యూడెమోక్రసీ ఖండన

టిజెఎసి ఛైర్మెన్ కోదండరాం పై రాష్ట్ర ప్రభుత్వం, టిఆర్‌ఎస్ పార్టీ నేతలు చేస్తున్న మాటల దాడిని సిపిఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసి ఒక ప్రకటనలో  ఖండించింది. ప్రభుత్వ విధానాలపై అనుకూలంగా, ప్రతికూలంగా స్పందించడం ఎవరికైనా హక్కు ఉంటుందని పేర్కొంది. అయితే, ఇలా ప్రశ్నించిన వారిపైన విరుచుకుపడితే మాత్రం చరిత్ర సహించబోదని సిపిఐ(ఎంఎల్-న్యూడెమోక్రసీ) రాష్ట్ర సెక్రటేరియేట్ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య అన్నారు. ఈ దాడి కోదండరాంపై జరిగిన దాడి కాదు, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఆయన  అభివర్ణించారు. హక్కులపై పోరాడుతున్న పార్టీలపై, వ్యక్తులపై విచక్షణ కోల్పోయి వ్యవహరించరాదని ప్రభుత్వానికి, పార్టీకి ఈ సందర్భంగా ఆయన  గుర్తుచేశారు. ఇది మంచి సంస్కృతి కాదని హితవు పలికారు.