Home ఎడిటోరియల్ సంపాదకీయం: సుప్రీంకోర్టు హుకుం

సంపాదకీయం: సుప్రీంకోర్టు హుకుం

sampadakeyam

సుప్రీంకోర్టు బుధవారంనాడు అసహనం, నేతల అవినీతి ఆర్జనపై కేంద్రప్రభుత్వ నిష్క్రియాపరతను ప్రశ్నించింది. తక్షణ చర్యలకు ఆదేశించింది. మొదటిది, గోరక్షకుల పేరుతో సాగుతున్న ఆగడాలు, రెండవది, రెండు ఎన్నికల మధ్యకాలంలో ఆస్తులు 500శాతంపైగా పెరిగిన ఎమ్మెల్యేలు, ఎంపిల వ్యవహారం. ఇవి ఆహ్వానించదగిన హుకుంలు.

గోరక్షణ పేరుతో కొందరు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటుంటే పాలకులు మౌన ప్రేక్షకుల్లా ఉండకూడదని ధర్మాసనం గుర్తుచేసింది. శాంతిభద్రతలు రాష్ట్రాల అధికార పరిధి అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ అధికారాన్ని వినియోగించకుండా మిన్నకుండ జాలదని స్పష్టం చేసింది. గోరక్షకుల దుందుడుకు చర్యలను అంతం చేయాలని గట్టి హెచ్చరికచేస్తూ, అటువంటి గుంపులపై చర్య తీసుకునేందుకు ప్రతి జిల్లాలో సీనియర్ పోలీసు అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని రాష్ట్రప్రభుత్వాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. నోడల్ అధికారులను నియమిస్తామని, గోరక్షకుల దాడులు జరిగినప్పుడు వెంటనే చర్య తీసుకుంటామని హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ ప్రభుత్వాలు వెంటనే అంగీకరించగా, ధర్మాసనం ఈ ఆదేశం జారీ చేసింది.

గోరక్షకుల దాడులను అరికట్టాలని కోరుతూ మహాత్మాగాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను అనుసరించి సుప్రీంకోర్టు ఏప్రిల్‌లో కేంద్రానికి, కొన్ని రాష్ట్రాలకు నోటీసు జారీచేసింది. అటు తర్వాత గోరక్షకుల అఘాయిత్యాలు తగ్గకపోగా పెరిగాయి. ‘సదుద్దేశంతో’ వ్యవహరించారనే పేరుతో అట్టి హంతకులకు చట్టం రక్షణ కల్పిస్తోంది. పోలీసులు హంతకులపై చర్య తీసుకునేబదులు బాధితులపై కేసులు బనాయిస్తున్నారు.

కేంద్రంలో, అనేక రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి వచ్చాక గోరక్షణ చట్టాలను కఠినతరం చేయటం, పశువుల క్రయవిక్రయాలపై ఆంక్షలు విధించటం తెలిసిందే. అదే పార్టీ రాజకీయంగా తనకు అవసరమనుకున్నచోట కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో, ఆవుమాంసం భుజించటంపై ఆంక్షలు లేవంటూ రెండు నాలుకల నాటకం ఆడుతోంది. ముస్లింలు, దళితులపై దాడులు చేయటానికి గోరక్షణ అంశాన్ని వినియోగించటం మరీ దారుణం. సుప్రీంకోర్టు తాజా ఆదేశాన్ని వారంలో అమలు చేసి కోర్టుకు తెలియ చేయాల్సి ఉంది. పాలక బిజెపి సిద్ధాంతం గోరక్షణకు అనుకూలంగా ఉండటం, ప్రైవేటు గోరక్షక ముఠాలకు కోరలు తెచ్చింది. గోరక్షణ పేరుతో మనుషుల్ని చంపటం ఆమోదయోగ్యం కాదని ప్రధానమంత్రి కొద్ది మాసాల క్రితం ప్రకటించినప్పటికీ అది ఉగ్ర హిందూత్వవాదులను నిరోధించలేకపోయింది. గోరక్షకుల కార్యకలాపాలను నిరోధించాల్సిందిగా ఆర్టికల్ 256 కింద కేంద్రం, రాష్ట్రాలకు సలహా ఇవ్వవచ్చు. కాని ఆ అధికారాన్ని ఉపయోగించలేదు.

రెండు, లెజిస్లేటర్ల పదవీకాలంలో వారి ఆస్తులు అనేకరెట్లు పెరగటం గురించి, నామినేషన్ పత్రంలోనే, ప్రచారానికి తమ ఆదాయ వనరుల గూర్చి వెల్లడించే కాలం చేర్చాలని ఒక ఎన్‌జిఒ దాఖలు చేసిన పిటిషన్‌పై, కేంద్రప్రభుత్వం నోరు మెదపక పోవటం పట్ల సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండు ఎన్నికల మధ్య ఆస్తులు 500శాతంపైగా పెరిగిన 289మంది ఎమ్మెల్యేలు, ఎంపిలపై ఏమి చర్య తీసుకుంటారో చెప్పాలని ప్రభుత్వాన్ని కోరింది. ఎన్నికల సంస్కరణల గూర్చి ఆలోచిస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వం ఈ నిర్దిష్టమైన కేసుల్లో తీసుకున్న చర్యలేమీ లేవు. ఈ కేసులో ప్రత్యక్ష పన్నుల కేంద్రబోర్డు దాఖలు చేసిన అఫిడవిట్ ‘టైపు చేసిన పేపర్లు’ తప్ప మరొకటి కాదంటూ ‘ఇది భారత ప్రభుత్వ వైఖరా’ అని ప్రశ్నించింది. అస్పష్ట ప్రకటనలు చేయకుండా, సవివరమైన తాజా అఫిడవిట్‌ను ఈనెల 12 లోగా దాఖలు చేయాలని ఆదేశించింది. ఎన్నికల్లో ధనప్రవాహం రోజురోజుకు పెరుగుతుండటం జగమెరిగిన సత్యం. అభ్యర్థులు తప్పుడు లెక్కలతో ఎన్నికల సంఘాన్ని దగా చేస్తున్నారు. ఎన్నికల్లో అవినీతిని అరికట్టాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉన్నట్లయితే ఈ కేసులోని ధనపతులపై దర్యాప్తు జరపాలి, సమగ్రమైన ఎన్నికల సంస్కరణలతో ముందుకు రావాలి.