Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

సూపర్ అంటారు.. ఇదేం చెత్త?

SUPREME

ఢిల్లీ ఎల్‌జిపై మరోసారి సుప్రీం ఫైర్

న్యూఢిల్లీ : ‘మీకు మీరే సూపర్ అనుకుంటారు. అంతేకానీ చెత్తపై కిమ్మనకుండా ఉంటారు…ఏమీ చలనం ఉండదు’ అని ఢిల్లీ లెఫ్టినెంట్‌గవర్నర్(ఎల్‌జి)ని సుప్రీం కోర్టు మందలించింది. ఎల్‌జి కార్యాలయం చెత్తను ఏరివేయడంలో నిర్లక్షం వహిస్తోందని చురకలు పెట్టింది. ఢిల్లీ పరిధిలోకి వచ్చే మున్సిపల్ కార్పొరేషన్లపై లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీసుకు అపరిమిత అధికారాలు ఉన్నాయి. అయితే వీటి ద్వారా పరిసరాల పరిశుభ్రతకు సరైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ధర్మాసనం గురువారం ఆగ్రహం వ్యక్తం చేసిం ది. ఢిల్లీలో చెత్తాచెదారం సమస్యపై, దీనికి ఎవరు బాధ్యులు అనే అంశంపై న్యాయమూర్తులు ఎంబి లోకూర్, దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం స్పందించింది. చెత్త వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానానికి లెఫ్టినెంట్ గవర్నర్ తరఫున వివరణ ఇచ్చుకున్నారు. ఈ అఫిడవిట్‌పై ధర్మాసనం స్పందిస్తూ ఢిల్లీ సంబంధిత కార్పొరేషన్లన్నీ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ పరిధిలో ఉంటాయి. ఎల్‌జికే అవి కట్టుబడి ఉండాలి. వాటి నుంచి పనితీరుపై వివరణలు తెప్పించుకోవల్సిన బాధ్యత లేదా? అని ధర్మాసనం ప్రశ్నించింది.
‘మీరే సంపూర్ణాధికారాలతో ఉన్నారని అంటారు. సూపర్‌పవర్ అని చెపుతారు. అయితే కీలకమైన విషయంలో చేతలకు దిగకుండా ఉంటారు. మిమ్మల్ని మీరు సూపర్ పవర్ అనుకుంటూ ఉంటారు. అన్నింటికీ బాధ్యత మీదే అనుకుంటున్నప్పుడు ఎవరూ ప్రశ్నించరాదనుకుంటే ఎట్లా? ’ అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. చెత్తను ఎత్తివేయడం లో కాలపరిమితిని చెప్పడం కష్టం అని అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ స్పష్టం చేసిన తరువాత కోర్టు తీవ్రంగా స్పందించింది. తాము చెత్త విషయంలో సరైన ఆదేశాలు వెలువరించిన తరువాత ఎప్పటిలోగా దీనిని నిర్మూలించడం జరుగుతుందనేది నిర్ధిష్టంగా కాలపరిమితితో తెలియచేస్తామని పింకీ తెలిపారు. ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఎల్‌జికి అన్ని అధికారాలు ఉన్నప్పుడు తక్షణమే దీనిపై ఎందుకు సమాచారం తెప్పించుకోవడం లేదు. చెత్తకుప్పలను ఇప్పటికైనా ఎప్పటిలోగా క్లియర్ చేస్తారో చెప్పండని ధర్మాసనం నిలదీయడంలో ఎల్‌జి తరఫు నుంచి సమాధానం లేకుండా పోయింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆప్ ప్రభుత్వానికి మధ్య అధికారాల విషయంలో తీవ్రస్థాయి వివాదం, కోర్టు తీర్పులు సాగుతున్నాయి. ఈ దశలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు తీవ్రస్ధాయి మందలింపులు వెలువడటం కీలకంగా మారింది.
ఢిల్లీ చెత్తతో మరో కుతుబ్‌మినార్
దేశ రాజధానిలో చెత్తకుప్పల పరిస్థితిపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చింది. రోజురోజుకీ ఈ చెత్త నిల్వలు పేరుకుపోతూ ఉంటే చివరికి ఇవే ఢిల్లీకి ప్రతికాత్మకమైన 73 మీటర్ల ఎతైన కుతుబ్‌మినార్‌లాగా మరో శిఖరంగా మారుతాయని కూడా స్పందించింది. దీనిపై నుంచి విమానాలు ఎగరకుండా జాగ్రత్త చర్యగా ఎర్ర లైట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందేమో అని వ్యాఖ్యానించింది.

Comments

comments