Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

హైకోర్టు విభజనపై సుప్రీం విచారణ

Supreme Court Inquiry into Special Leave petition

తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు ఉన్నత న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలన్న కేంద్రం పిటిషన్‌పై వాదనలు
హైదరాబాద్‌లోనే ఇప్పుడున్న భవనంలోగానీ, వేరొక చోట గానీ మరో హైకోర్టుకు అనుమతించాలని కోరిన అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్
కేంద్ర ప్రభుత్వ అభి్రప్రాయంతో తెలంగాణ ఏకీభావం

మన తెలంగాణ / న్యూఢిల్లీ: హై కోర్టు విభజనపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కొద్దిరోజుల క్రితం స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. 2015, మే 1వ తేదీన హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కేంద్రం స్పెషల్ లీవ్ పిటిషన్‌లో కోరింది. జస్టిస్ ఎకె సిక్రి నేతృత్వంలోని ధర్మాసనం ముందు కేంద్ర ప్రభు త్వం తరఫున అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ వాదనలు వినిపించారు. తెలుగు రాష్ట్రాలకు ప్రస్తు తం ఉన్న ఉమ్మడి హైకోర్టును విభజించాల్సిన ఆవశ్యకత ఉందని, హైకోర్టు భవనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా నిర్మించలేదని వేణుగోపాల్ తెలిపారు. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో 24 కోర్టు హాల్‌లు వున్నాయని, ఇప్పుడు ఉన్న భవనంలోకానీ, హైదరాబాద్‌లో మరేదైనా భవనంలోకానీ తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులను ఏర్పాటు చేయవచ్చునని పిటిషన్‌లో పేర్కొన్నట్లు వేణుగోపాల్ వివరించారు.

హైకోర్టు విభజన విషయం లో కేంద్ర ప్రభుత్వం వాదనలతో ఏకీభవిస్తున్నామని తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహతగీ తన వాదనల్లో నొక్కిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత చట్ట సభలు, అధికారుల విభజన జరిగిందని, అయితే న్యాయ విభా గం విభజన జరగలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనంలోకానీ, వేరే భవనంలోకానీ తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని ముకుల్ రోహతగీ వాదనల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చి బయటకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. హైకోర్టు న్యాయమూర్తులలో తెలంగాణకు తగిన ప్రాతినిధ్యం లేదని ధర్మాసనానికి వివరించారు. వాదనలను విన్న తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో నూతన హైకోర్టు స్థితి ఏమిటని అటార్నీ జనరల్ వేణుగోపాల్‌ను జస్టిస్ సిక్రి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు భవనం నిర్మాణం ఇంకా జరగలేదని వేణుగోపాల్ ధర్మాసనానికి వివరించారు. దాంతో హైకోర్టు విభజనపై ఆంధ్రప్రదేశ్ వైఖరి తెలియజేయాలని జస్టిస్ ఏకె సిక్రి నోటీసులు జారీచేశారు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

సచివాలయాల్ని విభజించినప్పుడు హైకోర్టుకు ఎందుకు సాధ్యం కాదు? పరిపాలనా సౌలభ్యం కోసం రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న హైదరాబాద్‌లోని సచివాలయాన్ని అవసరాలకు అనుగుణంగా భవనాలను, బ్లాకులను విభజించుకున్నప్పుడు హైకోర్టు విభజనకు మాత్రం ఈ సూత్రం ఎందుకు వర్తించదని కేంద్ర ప్రభుత్వం తన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో ప్రశ్నించింది. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు భవనంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు వేర్వేరు హైకోర్టులను ఎందుకు పనిచేయించకూడదు అని ప్రశ్నించిన కేంద్రం విభజన చట్టంలోని 31(1) సెక్షన్‌కు విరుద్ధమైన నిర్ణయాన్ని హైకోర్టు 2015లో వెలువరించిందని పేర్కొనింది. ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టును నెలకొల్పడానికి పక్కా భవనాలు సిద్ధమయ్యేంత వరకు ఉమ్మడి హైకోర్టును విభజించరాదన్న నిబంధన ఎక్కడా లేదని పేర్కొనింది. అలాంటి నిబంధన ఎక్కడైనా ఉందా అని కూడా ప్రశ్నించింది. అదే భవనంలోనూ లేదా అదే నగరంలోనూ విడిగా హైకోర్టును పనిచేయించడానికి ఎలాంటి చిక్కులూ లేవని నొక్కిచెప్పింది. హైదరాబాద్‌లోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉండడానికి వీల్లేదంటూ హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలకు కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆ రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల్లో కాకుండా హైదరాబాద్‌లో నెలకొల్పడం విభజన చట్టంలోని సెక్షన్ 31కు విరుద్ధమైన చర్య అంటూ ధర్మాసనం అభిప్రాయపడడం సహేతుకంగా లేదని కేంద్రం తన ఎస్‌ఎల్‌పిలో ఉదహరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైన సచివాలయాన్ని, రాజ్‌భవన్‌ను, హైకోర్టు భవనాలను నిర్మించుకోడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 500 కోట్లను 2015 మార్చి 31వ తేదీన విడుదల చేసిందని, కానీ ఇప్పటివరకూ ఆ దిశగా చర్యలు తీసుకోలేదని, హైకోర్టుకు అవసరమైన భవనాలను నిర్మించలేదని కేంద్రం పేర్కొనింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోరుకున్నట్లయితే ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు కొనసాగుతున్న భవనంలోనే ఆ రాష్ట్ర హైకోర్టును పనిచేయించుకుంటే అభ్యంతరం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛందంగా ముందుకొచ్చి తెలంగాణ హైకోర్టును గచ్చిబౌలిలోని మరో భవనానికి వెళ్ళిపోతామని స్పష్టంగా ఉమ్మడి హైకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొనిందని కేంద్రం గుర్తుచేసింది. అయినా హైకోర్టు డివిజన్ బెంచ్ మాత్రం తెలంగాణకు అలా మరో ప్రాంతానికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదని, ఆ అంశమే ఉత్పన్నం కాదని చేసిన వ్యాఖ్యను కూడా కేంద్రం ఉదహరించింది

Comments

comments