Home జాతీయ వార్తలు నిప్పుతో చెలగాటమొద్దు

నిప్పుతో చెలగాటమొద్దు

 Ranjan Gogoi

న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థపై కుట్రలు చేయడం తీవ్రమైన చర్య అని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిజెఐని రాజీనామా చేయించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తూ న్యాయవాది ఉత్సవ్ బైన్స్ వేసిన అఫిడవిట్‌కు బలం చేకూర్చే మరికొన్ని పత్రాలను ఆయన గురువారం సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్‌లో సమర్పించారు. తాను అందించిన పత్రాల్లోని సమాచారాన్ని ప్రివిలేజ్‌గా పరిగణించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. అయితే దీనికి అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ అభ్యంతరం చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం స్పందిస్తూ.. ‘తమ వద్దకు వచ్చిన ఏ పత్రాలనైనా పరిశీలించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. సిజెఐపై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణ జరుపుతున్న అంతర్గత కమిటీపై బైన్స్ దాఖలు చేసిన అఫిడవిట్ ఎలాంటి ప్రభావం చూపించదు. నిప్పుతో చెలగాటం ఆడకండి. డబ్బు, అధికార శక్తి సుప్రీంకోర్టును ఏమీ చేయలేవని మేం అందరికీ చెప్పదలచుకున్నాం’ అని జస్టిస్ అరుణ్ మిశ్రా వ్యాఖ్యానించారు. ప్రజలకు నిజం ఏమిటో తెలియాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అన్నారు.

గత మూడు నాలుగేళ్లుగా సుప్రీంకోర్టుపై రకరకాల ఆరోపణలు వస్తున్నాయని, ఇప్పుడు సిజెఐ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా అందులో భాగమేనని ధర్మాసనం పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు లాంటి ఉన్నతస్థాయి వ్యవస్థలో పని చేసే వారు అలాంటి తప్పులకు పాల్పడరని అభిప్రాయపడింది. ఒక వేళ అలాంటి తప్పులు చేస్తే మాత్రం న్యాయస్థానాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ‘న్యాయవ్యవస్థలో చాలా విషయాలు జరుగుతున్నాయి. దాన్ని సరి చేయడానికి ఒక వ్యక్తి ప్రయత్నిస్త్తే ఆయనపైకూడా బురద చల్లుతున్నారు’ అని కూడా న్యాయస్థానం పేర్కొంది. ‘ఇప్పుడు బ్లాక్‌మెయిలింగ్‌లో ఈ దశకు మనం చేరుకున్నాం. ఏం జరుగుతోందోఎవరికీ తెలియదు’ అని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే అంతకు మించి వివరించలేదు. నానీ ఫాల్కీవాలా, ఫాలీ ఎస్ నారిమన్, కె పరాశరన్ లాంటి ప్రముఖ న్యాయకోవిదులు సుప్రీంకోర్టు ప్రతిష్ఠను ఇనుమడింపజేశారని, అయితే ఇప్పుడు ప్రతి రోజూ బెంచ్ ఫిక్సింగ్‌కు సంబంధించిన వార్తలు మీడియాలో వస్తున్నాయని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది

Supreme Court Inquiry on Sexual Assault on Ranjan Gogoi