Home ఎడిటోరియల్ కొలీజియం వివాదాస్పద నిర్ణయం!

కొలీజియం వివాదాస్పద నిర్ణయం!

Supreme Court Judge Justice Sanjay  దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ మరొక్కసారి వివాదంలో చిక్కుకున్నది. సుప్రీంకోర్టు ముందుకు వచ్చే ప్రధానమైన కేసులను తమను విస్మరించి జూనియర్ జడ్జీలతో కూడిన ధర్మాసనాలకు కేటాయించడాన్ని నిరసిస్తూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తుల బృందం బహిరంగంగా గళం విప్పిన వివాదం గతంలో సంచలనం రేపింది. ఇప్పుడు హైకోర్టుల చీఫ్ జస్టిస్‌లు, జడ్జీల నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించే క్రమంలో సీనియారిటీని ఉల్లంఘిస్తున్నారనే వివాదం తల ఎత్తింది. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దినేశ్ మహేశ్వరిని ఢిల్లీ హైకోర్టు జడ్జి సంజీవ్ ఖన్నాను సుప్రీంకోర్టు జస్టిస్‌లుగా నియామకానికి సిఫారసు చేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సారథ్యంలోని కొలీజియం తీసుకున్న తాజా నిర్ణయాన్ని కొందరు ప్రస్తుత, విశ్రాంత జడ్జీలు తప్పుపట్టారు.

రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రదీప్ నందరాజోగ్‌ను, ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ రాజేంద్ర మీనన్‌ను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియామకానికి సిఫారసు చేయాలని గత నెల 12 తేదీన తాను తీసుకున్న తొలి నిర్ణయాన్ని తానే రద్దు చేస్తూ కొలీజియం తాజా నిర్ధారణకు వచ్చింది. ఇలా రావడంలో ముఖ్యంగా సంజీవ్ ఖన్నా విషయంలో 32 మంది న్యాయమూర్తుల సీనియారిటీని కొలీజియం పక్కన పెట్టడం ఆశ్చర్యానికి గురి చేసింది. అభ్యంతరాలకు తావు కల్పించింది. సుప్రీంకోర్టు జడ్జీలుగా నియామకానికి అర్హులను కొలీజియం సిఫారసు చేయడం కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం సాధారణంగా జరుగుతున్నది. ఇందులో సీనియారిటీకే అగ్ర తాంబూలం దక్కుతున్నది. సంజీవ్ ఖన్నా విషయంలో కొలీజియం ఈ సంప్రదాయానికి స్వస్తి చెప్పింది. అంతేగాక సంజీవ్ ఖన్నా, దినేశ్ మహేశ్వరి లిద్దరూ ఇతరులెవ్వరికంటే అర్హులని, యోగ్యులని నిర్ధారణకు వచ్చినందునే తన తొలి నిర్ణయాన్ని మార్చుకోకతప్పలేదని కొలీజియం సంబంధిత రికార్డులలో పేర్కొన్నట్టు వార్తలు చెబుతున్నాయి. కొలీజియం ఇలా నిర్ణయం మార్చుకోవడం, సీనియారిటీ క్రమాన్ని తప్పించి సిఫారసు చేయడం హైకోర్టుల్లోని జస్టిస్‌లు, చీఫ్ జస్టిస్‌లందరి మనోభావాల మీద వ్యతిరేక ప్రభావం చూపుతుందని ఆ మేరకు వారి పని నాణ్యతను అది దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంటుందని ప్రత్యేకించి చెప్పుకోనక్కరలేదు.

యోగ్యతాయోగ్యతలు, అర్హతానర్హతలను నిర్ణయించడానికి ప్రత్యేకించి కొలబద్దలంటూ ఉండవు. నిర్ణయించే వారి వ్యక్తిగత ఇష్టానిష్టాలు ప్రభావం చూపే ప్రమాదమున్నది. లేదా అధికారం గుప్పెట్లో ఉన్నవారి ఒత్తిడుల మేరకు నిర్ణయాలు తీసుకునే తప్పుడు పద్ధతికి అవకాశం ఏర్పడే వీలున్నది. అందుకే సీనియారిటీ జాబితాను బట్టి నడుచుకునే ప్రక్రియను ఆశ్రయిం చడమే ఉన్నంతలో మేలైన పద్ధతి. సీనియారిటీ జాబితాలో 32 వస్థానంలో ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నాను ఉన్నపళంగా ఇంత లాంగ్ జంప్ చేయించి సుప్రీంకోర్టు జడ్జిగా నియామకానికి సిఫారసు చేసి ఉండవలసింది కాదనే అభిప్రాయానికి విలువ ఏర్పడుతున్నది. జస్టిస్ సంజీవ్ ఖన్నా తాత సుప్రసిద్ధ న్యాయమూర్తి హెచ్‌ఆర్ ఖన్నా సీనియారిటీని ఎమెర్జెన్సీ హయాంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం తృణీకరించి ఎఎన్ రేని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన ఉదంతం అప్పట్లో సంచలనం సృష్టించింది.

సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కృష్ణ కౌల్, ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ కైలాస్ గంభీర్‌లు కొలీజియంను బహిరంగంగానే తప్పుపట్టారు. సీనియారిటీ సూత్రానికి విరుద్ధంగా జూనియర్‌కు సుప్రీంకోర్టు జడ్జి పదవి కట్టబెట్టడం దేశంలోని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, జడ్జీల మేధస్సు, యోగ్యత, శీల సమగ్రతల మీద అనుమానాలను రేకెత్తించడమేనని జస్టిస్ గంభీర్ రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కొలీజియం చేసిన గత సిఫార్సులతో విభేదించి జస్టిస్ కెఎం జోసెఫ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాకుండా ఏడాది పాటు అడ్డుకున్న కేంద్ర ప్రభుత్వం ఈసారి హుటాహుటిన ఆమోద ముద్ర వేయడం కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను రద్దు చేసిన జోసెఫ్ మీద కేంద్రం కక్ష గట్టిందనే అభిప్రాయం కూడా అప్పట్లో వెలువడింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకం జరిగేటప్పుడు సంబంధితులందరితోను రాష్ట్రపతి సంప్రదింపులు జరపాలని రాజ్యాం గం సూచిస్తున్నది. అలాగే కొలీజియం పెద్దగా దేశ ప్రధాన న్యాయమూర్తి ఈ సంప్రదింపుల సూత్రాన్ని గౌరవించి నడచుకోవాలి. న్యాయమూర్తుల నియామకంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇష్టా విలాసం చెల్లకూడదనే దృష్టితోనే కొలీజియం వ్యవస్థకు ప్రాణం పోశారు. దాని నిర్ణయాలు కూడా విమర్శలకు అతీతం కాకపోవడం ఎంతైనా బాధపడవలసిన పరిణామం.

Supreme Court Judge Justice Sanjay Coliseum publicly blamed