Home ఎడిటోరియల్ ప్రజాస్వామ్యానికి పట్టం

ప్రజాస్వామ్యానికి పట్టం

Article about Modi china tour

దేశ రాజధాని ఢిల్లీ ప్రజలను చిరకాలంగా వేధిస్తున్న అత్యంత చిక్కు సమస్యను ఎంతో సమంజసంగా చాకచక్యంగా పరిష్కరించినందుకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని అభినందించాలి. భిన్నాభిప్రాయం అనే సందును ఉపయోగించుకొని ప్రజలెన్నుకున్న ఢిల్లీ ప్రభుత్వాన్ని ఇంతకాలం వేధిస్తూ వచ్చిన ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతారాహిత్యానికి ఈ తీర్పు తెరదించింది. అక్కడ పాలన సజావుగా జనహితంగా సాగడానికి తోడ్పడాలేగాని అవరోధంగా మారడం ఎంతమాత్రం తగదని ఎల్‌జికి తన బాధ్యతను ధర్మాసనం మొట్టికాయ పెట్టి మరీ గుర్తు చేసింది. ఢిల్లీ ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అక్కడ జరగవలసిన పరిపాలన విషయంలో రాజ్యాంగ నిర్మాతలు పొందుపరిచిన అధికరణలు, వాటికి అనుగుణంగా రూపొందిన చట్టాల పరిధిలోనే ఎవరు ఎలా నడుచుకోవాలో హద్దు గీతలు గీసి స్పష్టం చేసింది.
దేశ రాజధాని ప్రాంతానికి అంతిమ పాలనాధినేత లెఫ్టినెంట్ గవర్నరేనని 2016 ఆగస్టులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు సృష్టించిన అప్రజాస్వామిక స్థితిని సుప్రీంకోర్టు తొలగించింది. రాష్ట్ర ప్రభుత్వమా, లెఫ్టినెంట్ గవర్నరా? తేల్చాలని అభ్యర్థిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వం చేసుకున్న అప్పీళ్లపై సుప్రీంకోర్టు 2017 డిసెంబర్ 17న ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ ధర్మాసనం ఢిల్లీకి పరిపూర్ణ రాష్ట్ర ప్రతిపత్తిని ఇవ్వకుండానే లెఫ్టినెంట్ గవర్నర్ చలాయిస్తున్న అపరిమిత అధికారాలకు కత్తెర వేసింది. ఎల్‌జి ఇష్టారాజ్యం చెల్లదుగాక చెల్లదని స్పష్టం చేసింది. భూమి, పోలీసు, శాంతి భద్రతలనే మూడు అంశాలపై ఆ పదవికి గల అదుపాజ్ఞలు తప్ప ఇతర అన్ని అంశాలకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గ సిఫారసుల మేరకే లెఫ్టినెంట్ గవర్నర్ నడచుకోవాలని, ప్రజలెన్నుకున్న ప్రభుత్వానిదే పైచేయి కావాలని కుండ బద్దలుకొట్టినట్టు చెప్పింది. మంత్రి వర్గ సిఫారసులతో తాను విభేదించినప్పుడు ఆ విషయాన్ని రాష్ట్రపతికి నివేదించడానికి తనకు గల వెసులుబాటును చీటికిమాటికీ దుర్వినియోగపరిచే అధికారం ఎల్‌జికి లేదని, కీలకాంశాలలో తేడావచ్చినప్పుడు మాత్రమే ఆ అవకాశాన్ని వాడుకోవాలనిచెబుతూ అనుల్లంఘనీయమైన గిరిగీసింది.రాష్ట్ర ప్రభు త్వం కూడా తన ప్రతి నిర్ణయంపైనా ఎల్‌జి అనుమతికోసం వేచి ఉండవలసిన అవసరం లే దని చెప్పింది. దానిని ఎల్‌జి దృష్టికి పంపించడం వరకే దాని బాధ్యత అని సూత్రీకరించింది.
ఢిల్లీ దేశ రాజధాని కావడం వల్ల పోలీసు, శాంతి భద్రతలు, భూ వ్యవహారాలను కేంద్రం చేతిలో రాజ్యాంగం ఉంచింది. అలాగే దాని లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాష్ట్రాల గవర్నర్లకున్నదానికి మించిన ప్రాధాన్యాన్నిచ్చింది. ఢిల్లీ ఎల్‌జిలు ఈ స్థితిని అవగాహన చేసుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఈ తకరారు తల ఎత్తేది కాదు. రాష్ట్రాల గవర్నర్ల మాదిరిగానే కేంద్ర పాలిత ప్రాంతాల ఎల్‌జిలు కూడా కేంద్రానికి తోకలుగా వ్యవహరిస్తుండడంవల్లనే ఢిల్లీలో ఈ దుస్థితి తలెత్తింది. షీలాదీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలున్నాయి. కాబట్టి ఆమెది నల్లేరుమీద నడక అయింది. అన్నాహజారే ఉద్యమం అందించిన కేజ్రీవాల్ ఆమ్‌ఆద్మీ పార్టీని పెట్టి ఢిల్లీ బరిలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు రెండింటి మీద దిగ్విజయాలు సాధించిన నేపథ్యంలో కేంద్రంలోని పాలక పార్టీకి తన కాళ్లకింద నేల కదిలినట్టయింది. దేశ రాజధానిలోనే తనకు రాజకీయంగా నూకలు దొరకని పరిస్థితి తల ఎత్తింది. భారతీయ జనతా పార్టీకి ఇది బొత్తిగా సహించలేనిదయింది. ఆప్‌ను, కేజ్రీవాల్‌ను ఢిల్లీ ప్రజల ముందు పలుచనపరచడమే పనిగా మోడీ ప్రభుత్వం పావులు కదపడం ప్రారంభించింది. ఎల్‌జి వద్దగల పోలీసు అధికారాలను ఉపయోగించి ముఖ్యమంత్రి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపించడం, ఐఎఎస్‌ల చేత సహాయ నిరాకరణ చేయించడం వంటి దుశ్చర్యలకు తెరలేపింది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ బృందం ఎల్‌జి ఆఫీసులో రోజుల తరబడి రాత్రింబవళ్లు ధర్నా జరిపారు. ఇటువంటి అస్తవస్త పరిస్థితులలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు నిరంకుశ పాలకులకు నియమ విరుద్ధ అధికారులకు చక్కని గుణపాఠం. పాండిచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్‌గా తనవే సర్వాధికారాలని దురుసు వ్యాఖ్యలు చేసిన కిరణ్ బేడీ వంటి వారికి చెంపపెట్టు వంటిది ఈ తీర్పు. దీనితో ఢిల్లీలో అంతా చక్కబడిపోతుందని కేంద్రం కుయుక్తులు పూర్తిగా ఆగిపోతాయని కూడా అనుకోలేము. కేంద్రం ఎల్‌జి ద్వారా సృష్టించిన గందరగోళాన్ని మాత్రం ఈ తీర్పు తొలగించింది. ప్రజాస్వామ్య రీతికి పట్టం కట్టింది.