Home బిజినెస్ ఆమ్రపాలి గ్రూప్ డైరెక్టర్లకు పోలీసు కస్టడీ

ఆమ్రపాలి గ్రూప్ డైరెక్టర్లకు పోలీసు కస్టడీ

 ఇక దాగుడుమూతలు ఆపాలంటూ మండిపడిన సుప్రీంకోర్టు

Amrapali

న్యూఢిల్లీ : రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్‌కు చెందిన డైరెక్టర్లపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక మీ దాగుడు మూతలు ఆపాలని, డాక్యుమెంట్లు అందజేసేంత వరకు పోలీసు కస్టడీలోనే ఉండాలంటూ మండిపడింది. ఆమపాలి ముగ్గురు డైరెక్టర్లు అనిల్ శర్మ, శివ ప్రియ, అజయ్ కుమార్‌లను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, యు.యు.లలిత్‌ల నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఫోరెన్సిక్ ఆడిటర్లకు డాక్యుమెంట్లను సమర్పించేంత వరకు వారిని పోలీసు కస్టడీలోనే ఉంచాలని ఆదేశించింది. దీంతో కోర్టు ప్రాంగణంలోనే వారిని పోలీసులు అరెస్టు చేశారు. గంట పాటు జరిగిన విచారణలో డాక్యుమెంట్లను సమర్పించకపోవడానికి పలు కారణాలను చెబుతూ డైరెక్టర్లు తప్పించుకుంటున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది.

గృహదారులు పెట్టుబడిగా పెట్టిన నగదును, మరో అవసరాల కోసం తరలించారా? అని కోర్టు ప్రశ్నించింది. అన్ని డాక్యుమెంట్లు ఆడిటర్లకు సమర్పించేంత వరకు మీరు కస్టడీలోనే ఉండాలని, అది ఒక్క రోజు పట్టవచ్చు లేదా నెల అవ్వొచ్చు అని బెంచ్ పేర్కొంది. గ్రూప్‌కు సంబంధించిన పత్రాలన్నింటిన్నీ సీజ్ చేయాలని ఢిల్లీ పోలీసులను, నోయిడా పోలీసులను కోర్టు ఆదేశించింది. అన్ని డాక్యుమెంట్లను ఆడిటర్లు పొందినట్టు తెలిశాకనే వారిని వదిలి వేయాలని బెంచ్ స్పష్టం చేసింది. ఈ ముగ్గురి పాస్‌పోర్టులను కూడా కోర్టు రద్దు చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 24కు వాయిదా వేసింది.

Supreme Court Serious on Amrapali Directors 

Telangana news