Home ఎడిటోరియల్ సంపర్క స్వేచ్ఛ నేరం కాదు

సంపర్క స్వేచ్ఛ నేరం కాదు

Supreme Court verdict that freedom of worship is not crime

ఎల్‌జిబిటిక్యు సముదాయంలో స్వలింగ సంపర్కాన్ని నేర రహితం చేస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం పురోగామి తీర్పు ఇచ్చింది. ఐదుగురు న్యాయమూర్తులు విడివిడిగా రాసిన నాలుగు తీర్పులూ ఐపిసి సెక్షన్ 377 లోని ఈ భాగం రాజ్యాంగ విరుద్ధమని, ఏ రకమైన లైంగిక సుఖాన్ని ఎంచుకోవాలనే పౌరుల స్వేచ్ఛకు విరుద్ధమని ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. సామాజిక నైతికత రాజ్యాంగ నైతికతను త్రోసిపుచ్చజాలదని స్పష్టం చేసింది. ప్రేమ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో అంతర్భాగమని పేర్కొన్నది. మెజారిటీ ప్రజల లైంగిక భావనకు భిన్నమైన మార్గాల్లో లైంగిక సుఖం పొందేవారిని నేరస్థులుగా పరిగణించటం, కళింకితులుగా వెలివేయటం, రాజ్యాంగ హక్కులకు దూరం చేయటం చెల్లుబాటు కాదని చెప్పింది. గోపత్యను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ 9 మంది జడ్జీలతో కూడిన పూర్తిస్థాయి రాజ్యాంగ ధర్మాసనం 2017 ఆగస్టులో తీర్పు చెప్పాక పరస్పర అంగీకారంతో వయోజనులు జరుపుకునే లైంగిక కార్యం గోప్యత, పరువులో భాగమవుతుందని, అందువల్ల వారు చట్ట భయంతో బతకాల్సిన పని లేదని పేర్కొన్నది.

స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న సెక్షన్ 377 పదేళ్ల జైలు శిక్ష విధింపును ఆదేశిస్తున్నది. అయితే జంతువులతో, చిన్న పిల్లలతో జరిపే అసహజ లైంగిక చర్యను నేరంగా కొనసాగించిందీ తీర్పు. ఒకే లింగం వారి మధ్య వివాహాలను ఆమోదించలేదు. బ్రిటీష్ కాలం నాటి చట్టాన్ని ఉపయోగించి స్వతంత్ర భారతంలో “పాశవికమైన” అణచివేతకు పాల్పడినందుకు చరిత్రను క్షమించాలని ఎల్‌జిబిటిక్యు (రతి జరుపుకునే స్త్రీలు, నపుంసకులు, ద్విలింగపరులు, లింగమార్పిడి చేయించుకున్నవారు, విచిత్ర లైంగిక వాంఛాపరులు) సముదాయాన్ని న్యాయమూర్తులు కోరారు. అది జీవ సంబంధంగా సంక్రమించిన లైంగిక వాంఛా లక్షణమేగాని మానసిక రుగ్మత కాదు. అది మానసిక రుగ్మత కాదని 2017లో మానసిక రుగ్మతపై పార్లమెంటు ఆమోదించిన చట్టమే చెప్పినందున మన చట్టం ఇప్పటికే పురోగమించిందని జస్టిస్ నారీమన్ పేర్కొనగా, రోగమే కాని దానికి చికిత్స చేస్తూ వారికి కళంకం ఆపాదించటంలో భాగం కావటాన్ని వైద్య శాస్త్రం మానుకోవాలని జస్టిస్ చంద్రచూడ్ కోరారు.

వైద్యుల వద్దకు చికిత్సకు వెళితే తమను నేరస్థులుగా పరిగణిస్తారన్న భయంతో వారు హెచ్‌ఐవి/ ఎయిడ్స్ వ్యాధులు మురగబెట్టుకుంటున్నందున వారికి సమర్థంతమైన చికిత్స అందించటం అవసరమన్నారు. ఈ సముదాయం మానవ హక్కులన్నిటికీ అర్హులని, వారిపై వివక్షను అంతం చేద్దామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా పేర్కొన్నారు. ధర్మాసనంలో ఉన్న మహిళా జడ్జి ఇందు మల్హోత్రా, ఎల్‌జిబిటిక్యు సముదాయం ఎదుర్కొంటున్న అవమానాలను, వెలివేతను తొలగించటంలో జరిగిన జాప్యానికి ఆ సముదాయానికి, వారి కుటుంబాలకు చరిత్ర క్షమాపణ చెప్పాలని అభిప్రాయపడ్డారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వ తటస్థతవహించి, నిర్ణయాన్ని రాజ్యాంగ బెంచి విజ్ఞతకు విడిచిపెట్టటాన్ని జస్టిస్ చంద్రచూడ్ తప్పుపట్టారు.

ఎల్‌జిబిటిక్యు హక్కుల కార్యకర్తలకు ఇది తొలి విజయం. ఈ తీర్పు దత్తత, వారసత్వ చట్టాలు, ఆర్థిక హక్కులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. రాజ్యాంగం ప్రసాదించిన పౌర హక్కుల వర్తింపు కొరకు కూడా లీగల్ పోరాటం మున్ముందు వస్తుంది. సామాజిక నైతికతపై రాజ్యాంగ నైతికత గెలవడమొక్కటే సరిపోదు. స్వలింగ సంపర్కాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో హిందూ, ముస్లిం, క్రైస్తవ గ్రూపులున్నాయి. సనాతన ధర్మ ప్రతినిధి సభ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, రజా అకాడెమీ, ఉత్కళ్ క్రిస్టియన్ కౌన్సిల్, అపోస్టోలిక్ చర్చీల అలయెన్స్ వాటిలో ఉన్నాయి. కాబట్టి ప్రజాస్వామ్య సమాజం పరివర్తనా శీలమైందని, చట్టాలు ప్రగతివైపు ప్రయాణించాలని సుప్రీంకోర్టు భావించినప్పటికీ, అదే సమయంలో సమాజాన్ని చైతన్యవంతం చేసే రాజకీయ, సామాజిక వ్యవస్థలుండాలి. అందువల్ల సుప్రీంకోర్టు తీర్పు హక్కులకై పోరాడే వారి చేతిలో ఆయుధమవుతుంది కాని వెంటనే మార్పు తీసుకురాదు. రాజ్యాంగ నైతికత, సామాజిక నైతికత ఎప్పుడో ఇకప్పడు ఒకే బిందువుకు చేరాలి. అప్పటి వరకు సమాజం కల్లోలితంగానే ఉంటుంది. అందువల్ల సమాజ దృక్పథంలో మార్పు తీసుకురావటానికి విశేష కృషి జరగాలి. అందులో ప్రభుత్వ పాత్ర ప్రధానం.

సెక్షన్ 377 పై తమ తీర్పుకు టెలివిజన్, రేడియో, వార్తా పత్రికలు, ఆన్‌లైన్ మీడియా ద్వారా ప్రచారమివ్వాలని, స్వలింగ సంపర్కానికి వ్యతిరేకంగా ఉన్న కళంకాన్ని తగ్గించటానికి, అంతిమంగా రూపుమాపటానికి ప్రభుత్వం కార్యక్రమాలు ప్రారంభించాలని రాజ్యాంగ ధర్మాసనం తరఫున జస్టిస్ నారీమన్ ఇచ్చిన ఆదేశాన్ని ప్రభుత్వం పాటించాలి.