Home స్కోర్ కామన్వెల్త్ రెజ్లింగ్‌లో సుశీల్‌కు స్వర్ణం

కామన్వెల్త్ రెజ్లింగ్‌లో సుశీల్‌కు స్వర్ణం

shusl

జోహెన్నస్‌బర్గ్: ఇక్కడ జరుగుతున్న కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ సుశీల్ కుమార్ పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల 74 కిలోల ఫ్రిస్టయిల్ విభాగంలో సుశీల్ స్వర్ణం సాధించాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు జోహనెస్ పెట్రస్‌తో జరిగిన పోరులో సుశీల్ 80 తేడాతో జయకేతనం ఎగురవేసి పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు. ప్రారంభం నుంచే సుశీల్ చెలరేగాడు. తనకు మాత్రమే సాధ్యమయ్యే ప్రతిభతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. సుశీల్ ధాటికి పెట్రస్ కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయాడు. అద్భుత ఆటను కనబరిచిన సుశీల్ తన ఖాతాలో స్వర్ణం జమచేసుకున్నాడు. కామన్వెల్త్‌లో సుశీల్‌కు ఇది ఐదో పతకం కావడం విశేషం. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలుచుకున్న భారత క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించిన సుశీల్ మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ పోటీల్లో బరిలోకి దిగాడు. ఆడిన తొలి మెగా పోటీల్లోనే స్వర్ణం సాధించి తనలో సత్తా తగ్గలేదని చాటాడు. అంతేగాక తనపై పనిగట్టుకొని విమర్శలు చేస్తున్న వారికి గట్టి సమాధానమే చెప్పాడు.