Home లైఫ్ స్టైల్ సమిష్టి చైతన్యంతో స్వయంసమృద్ధి

సమిష్టి చైతన్యంతో స్వయంసమృద్ధి

 

“సమయానికి టైలర్స్ ఇవ్వక పోవడం వల్లనే, ఈసారి బడి పిల్లలకు యూనిఫామ్స్ ఇవ్వలేకపోతున్నాం” అన్న సింగిల్‌కాలమ్ వార్త మాడుగులపల్లి మహిళలను ఆలోచింపజేసింది. ఈసారి తమ ప్రాంతంలో ప్రతీ విద్యార్థికీ యూనిఫాం అందించాలంటే తామే టైలరింగ్‌లో నైపుణ్యం పెంచుకోవాలనుకున్నారు. వారి పట్టుదలకు నాబార్డు జిల్లా అధికారి దయామృత అండగా నిలిచారు. 90మంది స్వయం సహాయక బృంద మహిళలను ఎంపిక చేసి ‘స్వామి వివేకానంద రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ’ ద్వారా ఎల్‌ఇడిపి కార్యక్రమంలో నైపుణ్యాలను మెరుగుపరిచారు. ఇపుడు వారందరికీ కుట్టుమిషన్లకు లోన్ ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ఉత్పత్తి కంటే ముందే మార్కెట్‌ని సృష్టించుకున్న వీరి ఆత్మవిశ్వాసం నల్గొండ జిల్లా గ్రామీణ ఆర్థిక వ్యవస్థనే మార్చ బోతుంది…

గ్రామీణ పేద మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపరిచి, సుస్థిర జీవనోపాధులు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం పేదమహిళల జీవనోపాధుల మెరుగుదల కార్యక్రమం మొదలుపెట్టింది. ఆధునిక పద్ధతులు నేర్చుకోవడం, ఆదాయం సమకూర్చుకోవడం ద్వారా దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారిని పైకి తీసుకురావడం, వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. టెక్నాలజీ అధునీకరణ, నైపుణ్యం పెంపు, కొత్త డిజైన్ల రూపకల్పన, స్థిరమైన అభివృద్ధి కోసం వీటి మార్కెటింగ్ అవకాశాలు మెరుగు పర్చడం ఈ కార్యమ్రంలో ప్రధానాంశాలు.
టైలరింగ్‌లో శిక్షణ…
గ్రామీణ పేద మహిళలకు ఉపాధి లేక వలస పోవాల్సిన పరిస్థితుల నేపథ్యంలో నల్గొండ జిల్లాలో మాడుగుల పల్లి, ఇందుగుల, దాచారం గ్రామాలకు చెందిన మహిళల కోసం స్వామి వేకానంద రూరల్ డెవలప్ మెంట్ సొసైటీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. స్కూల్ యూనిఫాంలు కుట్టడంలో నైపుణ్యం పెంచారు. స్వయం సహాయక గ్రూపులకు చెందిన మహిళలకు టైలరింగ్‌లో నిష్ణాతులైన నిపుణులతో స్కూల్ యూనిఫామ్స్ రూపొందించడంలో శిక్షణ ఇచ్చారు. విద్యార్థుల యూనిఫాంలతోపాటు ఆధునిక దుస్తుల తయారీలో మహిళలు శిక్షణ పొందారు. ఇవన్నీ తమ ఇంట్లోనే కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకోవచ్చు. దీనివల్ల వారికి రోజుకు రూ.300 నుండి రూ.500 దాకా ఆదాయం సమకూరుతుంది. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లాలో 3 గ్రామాలకు చెందిన 90 మంది మహిళలు 3 బ్యాచ్‌లుగా 15 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్నారు.
ఫలితాలు ఇలా…
* ప్రతీ మహిళా సొంతంగా ఒక టైలరింగ్ యూనిట్ పెట్టుకునే సామర్థ్యం పెంచుకున్నారు.
* కేవలం నైపుణ్యాలు పెంచడమే కాకుండా రుణ సదుపాయం, మార్కెటింగ్ మొదలైన అంశాల్లో కూడా స్వామి వివేకానంద రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ కౌన్సిలింగ్ ఇచ్చింది.
* నైపుణ్యం పొందిన మహిళలు ఉత్పత్తి యూనిట్లు ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్నారు. బ్యాంకులు వారికి రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి.
* డిమాండ్‌కి తగిన డిజైన్ల రూపకల్పన, ఆధునిక పద్ధతులు నేర్చుకోవడం, ఆదాయం సమకూర్చుకోవడం ద్వారా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు పైకి వస్తున్నారు.
* మహిళలు బృందాలుగా ఏర్పడి యూనిట్లు ఏర్పాటు చేసుకోవడంవల్ల కుట్టుపనిలో నాణ్యత పెరిగి, సకాలంలో దుస్తులు మరింత మెరుగ్గా తయారు చెయ్యగలరు.
* మహిళల ఆదాయం స్థిరీకరణ అవుతుంది. గ్రామీణ ఉద్పాదకత పెరుగుతుంది. నైపుణ్యాలు మెరుగవ్వడం వల్ల గ్రామీణ మహిళలు ఉత్పత్తి మార్కెటింగ్ క్రమంలో భాగస్వాములవుతారు. ‘కూలీ పనులు కూడా లేక ఖాళీగా ఉన్న మాకు ఉచితంగా శిక్షణ ఇచ్చి టైలర్లగా మార్చారు. బ్యాంకులు కూడా మాకు లోన్‌లు ఇస్తామంటున్నాయి. స్కూల్ యూనిఫారాలకు మంచి డిమాండ్ ఉంది. వచ్చే సంవత్సరం చాలా ఆర్డర్లు వస్తాయనే నమ్మకంతో ఈ శిక్షణ పొందాను..’ అంటోంది మాడుగుల పల్లికి చెందిన జూకంటి లలిత.

శ్యాంమోహన్

 Tailoring is Employment to poor women