Home మహబూబ్‌నగర్ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం: పద్మజారెడ్డి

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం: పద్మజారెడ్డి

Take welfare schemes in public and campaign more widely

మహబూబ్‌నగర్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విరివిగా ప్రచారం చేస్తామని బిజెపి జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి అన్నారు. శనివారం ఆమె జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం కోట్లు వెచ్చించి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తాను చేస్తున్నట్టుగా గొప్పగా ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. ఫ్లెక్సీల్లో టిఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్ర పథకాలను కూడా ప్రచారం చేయడం హాస్యాస్పదం అని అన్నారు. బిజెపి నేతలను టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసి పార్టీలోకి చేర్చుకుంటారని ఆమె ఆరోపించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో పాటు రాజకీయాల మార్పు కోసం బస్సు యాత్ర చేపట్టారని చెప్పారు. పాలమూరు జిల్లాలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులలో అవినీతి పెద్ద ఎత్తున జరిగిందని ఆమె ఆరోపించారు. పాలమూరు నియోజకవర్గంలో జరిగిన పనుల్లో అవినీతిని బయటికి తీస్తామని ఆమె తెలిపారు. విలేకర్ల సమావేశంలో శ్రీనివాసరెడ్డి, అంజయ్య, పడాకుల సత్యం, కృష్ణవేణి, కరుణాకర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వర్డీయ స్వతంత్ర సమరయోధుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదివాన్ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు.