Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

బిసిల రథసారథి కెసిఆర్

Talasani Srinivas Yadav Praises CM KCR

సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు: ఇష్టాగోష్టిలో మంత్రి తలసాని

హైదరాబాద్: గతంలో బిసిలకు ఏదో ఒక పదవి ఇచ్చి ప్రచారం చేసుకునేవారని, ఎటువంటి ప్రచారం ఆశించకుండా గత నాలుగేళ్లుగా బిసి సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆగస్టు 15వ తేదీన బిసిలకు సబ్సిడీ రుణాలపై కెసిఆర్ గొప్ప పథకాన్ని ప్రకటించాబోతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ 100 సీట్లకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కొంతమంది ఎంఎల్‌ఎలపై స్థానికి స్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ కెసిఆర్ పేరు, ప్రభుత్వ సంక్షేమం పథకాలతోనే గెలుస్తారని వ్యాఖ్యానించారు. సచివాలయంలో సోమవారం మంత్రి మీడియాతో ఇష్టాగోష్టగా మాట్లాడుతూ, శాసనసభ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్ పదవులతో పాటు రాజ్యసభ రెండు ఎంపి స్థానాలను బిసిలకు ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌కు మాత్రమే దక్కుతుందని, బిసిల రథసారధి కెసిఆర్ అని స్పష్టం చేశారు.

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివ రకు అడ్వొకేట్ జనరల్‌గా ఒక్క బిసి వ్యక్తి కూడా పనిచేయలేదని, రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా బిసికి అవకాశం ఇచ్చిందన్నారు. బిసిలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఏమేమి చేయాలనేది ఉద్యమ సమయంలోనే గుర్తించిన కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత వాటన్నింటిని అమలులో పెడుతున్నారన్నారు. సొంతంగా తనకు తాను ఏమి ఆలోచించుకోరని, సమాజహితం కోసమే నిర్విఘ్నంగా పని చేస్తున్నారన్నారు. 64 లక్షల గొర్రెల పంపిణీ, ఉచితంగా చేప పిల్లల పంపిణీ, మత్సకారులకు సబ్సిడీపై వాహనాలు ఇస్తూ అనేక రకాలు వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. రజకులు,గీత, నేతలందరికీ వివిధ పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల్లో పోరాడేతత్వం లేదని, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేదానిపైనే నేతలంతా పోరాటం చేస్తున్నారన్నారు. ఇక్కడున్న వాళ్లే చేసిందేమి లేదని ఇంకా రాహుల్ గాంధీ వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తే ప్రభుత్వమే చేయిస్తుందంటూ వార్తల్లో ఉండాలనుకుంటున్నారని, అసలు వాళ్ల ఉనికే లేదన్నారు.

Comments

comments