Home జాతీయ వార్తలు నిలకడగా కరుణ ఆరోగ్యం

నిలకడగా కరుణ ఆరోగ్యం

ఇంకా అత్యవసర చికిత్సా విభాగంలోనే
శరద్ పవార్ తదితర ప్రముఖుల పరామర్శ

palani

కరుణానిధిని పరామర్శించిన తరువాత చెన్నై కావేరీ ఆసుపత్రి బయట మీడియాతో మాట్లాడుతున్న తమిళనాడు సిఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం

చెన్నై : డిఎంకె అధ్యక్షులు ఎం కరుణానిధి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. అయితే స్థానిక కావేరీ ఆసుపత్రిలో ఆయనకు అత్యవసర సేవల విభాగంలో (ఐసియు) వైద్య చికిత్సలు అందిస్తున్నారు. వరుసగా మూడు రోజుల నుంచి ఆయనకు ఐసియులోనే చికిత్స జరుగుతోంది. ఆదివారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని వార్తలు వెలువడటంతో ఆసుపత్రి వద్దకు అసంఖ్యాకంగా కార్యకర్తలు, ప్రముఖులు చేరా రు. అంతేకాకుండా ఆయన చికిత్సకు స్పందించడం లేదని కరుణానిధి కుమారుడు స్టాలిన్ ప్రకటన వెలువరించడం మరింత గందరగోళానికి దారితీసింది. అయితే సోమవారం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడైంది. తమిళనాడు ముఖ్యమంత్రి కె పళనిస్వామి , ఉప ముఖ్యమంత్రి పన్నీరుసెల్వంతో కలిసి ఆసుపత్రికి వచ్చారు. వృద్ధనేతను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి డాక్టర్ల బృందం నుంచి వివరాలు తెలుసుకున్నారు. కావేరీ ఆసుపత్రిలో కరుణానిధిని చూసిన తరువాత ముఖ్యమంత్రి పళనిస్వామి విలేకరులతో మాట్లాడారు. డిఎంకె అధినేత ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, నిలకడగా కొనసాగుతోందని వివరించారు. వైద్య బృందం ఎప్పటికప్పుడు చికిత్సలు నిర్వహిస్తోంది. పరిస్ధితి బాగానే ఉందని వెల్లడించారు. తన వెంట పన్నీరుసెల్వం కూడా వచ్చారని , స్టాలిన్, ఎంపి కనిమొళితో కలిసి కరుణానిధిని చూసి వచ్చామని సిఎం తెలిపారు. కొందరు రాష్ట్ర మంత్రులు కూడా సిఎం వెంట వెళ్లారు. కరుణానిధికి ఇప్పటికీ చురుకైన శక్తివంతమైన మందులతో చికిత్స జరుగుతోంది. గత రాత్రితో పోలిస్తే ఇప్పుడు ఆయన శరీరంలోని కీలక భాగాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని వైద్యులు చెప్పారు. పలువురు వైద్య నిపుణులతో కూడిన బృందాలు ఆయనకు చికిత్స నిర్వహిస్తున్నాయి. ఓ వైపు నేత ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆసుపత్రికి వద్దకు బారులుతీరుతూ రావద్దని స్టాలిన్ ఇతర నేతలు , ఆసుపత్రి వర్గాలు విజ్ఞప్తి చేశాయి. అయితే వీటిని పట్టించుకోకుండా తమ అభిమాన నేతను సందర్శించుకునేందుకు, ప్రత్యక్షంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు సోమవారం కూడా భారీ సంఖ్యలో వేలాది మంది డిఎంకె కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. నేత ఆరోగ్యం కోసం అక్కడనే ప్రార్థనలకు దిగారు. దీనితో స్థానిక ఆళ్వార్‌పేటలోని కావేరీ ఆసుపత్రి పరిసరాలలో జాతరవాతావరణ నెలకొంది. తమ నేతను నేరుగా చూడనివ్వడం లేదని వారు పోలీసులపై , స్థానిక అధికారులపై విరుచుకు పడుతున్నారు. దీనితో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసు బలగాలు విశేషంగా కృషి చేయాల్సి వస్తోంది. శాంతి భద్రతలు అదుపు తప్పకుండా కార్యకర్తలు సంయమనంతో ఉండాలని స్టాలిన్ పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు.
శరద్ పవార్ పరామర్శ
కరుణానిధి ఆరోగ్య పరిస్ధితిని స్వయంగా తెలుసుకునేందుకు ఎన్‌సిపి నేత శరద్ పవార్ సోమవారం ముంబై నుంచి చెన్నై వచ్చారు. కావేరీ ఆసుపత్రికి వెళ్లి కరుణానిధిని చూశారు. తరువాత పవార్ అక్కడే ఉన్న స్టాలిన్, కనిమొళి ఇతరులతో కొద్ది సేపు మాట్లాడారు. కరుణానిధి ఆరోగ్య స్థితి గురించి అందుతున్న వైద్య చికిత్సల గురించి తెలుసుకున్నారు. శ్రీలంక దేశాధ్యక్షులు మైత్రీపా సిరిసేన ప్రతినిధులు కూడా వచ్చి కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కరుణానిధి త్వరితగతిన కోలుకోవాలని దేశాధ్యక్షులు కోరుకుంటున్నట్లు ఈ మేరకు ఆయన లేఖ రాశారని పేర్కొన్నారు. ఈ లేఖను వారు స్టాలిన్‌కు అందించారు.
నెట్‌లో ఇళయరాజా పాట వైరల్
కరరుణ ఆరోగ్యం కోసం ప్రముఖ సంగీత దర్శకులు ప్రత్యేకంగా ఒక పాటను రూపొందించారు. కరుణానిధి త్వరగా కోలుకోవాలని కోరుతూ పాడిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో బహుళ ప్రచారం పొందుతోంది. దీనినే డిఎంకె కార్యకర్తలు, కరుణానిధి అభిమానులు ఆలపిస్తున్నారు. తమిళంలో ఉన్న ఈ పాటలో లేచిరా మమ్మల్ని చూసేందుకు అంటూ సాగే ఈ పాట అత్యంత లయబద్ధంగా గుండెలను పిండేదిగా ఉంది.
గుండెపోటుతో కార్యకర్త మృతి
కరుణానిధి ఆరోగ్యంపై ఆందోళనతో 65 సంవత్సరాల డిఎంకె సభ్యులు ఆర్ అమ్సకుమార్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ వ్యక్తి పొల్లచ్చికి సమీపంలోని కుల్లకపాళ్యంకు చెందిన వ్యక్తి అని గుర్తించారు.