Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ట్యాంక్‌బండ్ కలేనా

మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణంతో మణుగూరుకే అందమొస్తుందనే భావన ప్రజల్లో కలిగింది. ఆ ట్యాంక్‌బండ్ బొగ్గుక్షేత్రానికే మణిహారం మారుతుందనే సంతోషం వెల్లివిరిసింది. కానీ అధికారుల తీరు చూస్తుంటే అది కలగానే మిగులుతుందేమో అనే భయం కనిపిస్తోంది. స్వయానా మంత్రి గారు శంకుస్థాపన చేసి నెలల గడుస్తున్నా పనులు ప్రారంభం కాకపోవడం అధికారుల నిర్లక్షానికి తార్కాణంగా నిలుస్తోంది. అయినప్పటికీ ప్రజా ప్రతినిధులు చూసీచూడనట్టు ఉండడం చూస్తే ప్రజల్లో అసహనం కలుగుతోంది. ఆరు నెలల్లో పనులు పూర్తి కావలసి ఉన్నప్పటికీ నేటికీ అంకురార్పణ జరగకపోవడంతో అక్కడ శంకుస్థాపన చేసిన శిలాఫలకం యంత్రాంగం తీరును కళ్లకు కడుతోంది.

TankBund Not Constructed in Manuguru in BhadradriKothaGudemమణుగూరు టౌన్:మున్సిపాలిటీ ఎదురుగా ఉన్న నాయుడుకుంట చెరువు సుందరీకరణకు సర్కారు నడుం బిగించింది. ఆ చెరువును సుందరీకరణ చేయాలని తలంచింది. అనుకున్నదే తడవుగా “మన ఊరు – మన చెరువు” కార్యక్రమంలో భాగంగా
మిషన్ కాకతీయ-2లో చెరువుకు మోక్షం కలిగింది. అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు రూ. 2.23 కోట్లు మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ పూర్తికావడంతో 10 జూలై 2016న రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శంకుస్థాపన చేశారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులను దగ్గరుండి పర్యవేక్షించాలని మున్సిపల్ అధికారికి పలు సూచనలు చేశారు. అయినప్పటికీ ఆయన మాటలను అధికారులు పెడచెవిన పెట్టేశారు.

ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ…
మినీ ట్యాంక్ బండ్ నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. కానీ ప్రారంభించి ఆరు నెలలు దాటి పోతున్నప్పటికీ కనీసం పనులు ప్రారంభానికి కూడా నోచుకోలేదు. ఇదిలా ఉండగా పనులను వెంటనే ప్రారంభించాలనే ఉద్దేశంతో అప్పుడు చెరువులో ఉన్న నీటిని అధికారులు తోడేశారు. అప్పటి నుంచి చెరువు మోడు భారిపోయింది. తర్వాత పనుల్లో జాప్యం చేయడంతో నేటికీ చెరువు కళాహీనంగానే దర్శనమిస్తోంది. నీటిని తోడెయ్యడంతో పక్కనే ఉన్న చెరువు ఆయకట్టు అంతా బీడుగా మారిపోయింది. పంటలకు నీరందే పరిస్థితి లేక కొందరు సాగే చెయ్యలేదు. కొందరు కాస్త ధైర్యం చేసినప్పటికీ ఎండిపోయిన పరిస్థితి ఉంది.

చిత్తశుద్ధి లేకనే…
“దేవుడు కరుణించినా – పూజారి వరమివ్వనట్టు” తయారైంది మణుగూరులో మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణం పరిస్థితి. సర్కారు
స్పందించి రూ. 2.23 కోట్లు మంజూరు చేసినప్పటికీ అధికారుల్లో చిత్తశుద్ధి లేకపోవడంతోనే పనులు ప్రారంభానికి కూడా నోచకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కాలుష్యంతో నిండిపోతున్న మణుగూరుకు ట్యాంక్‌బండ్‌తో కాస్త ఉపశమనం లభిస్తుందని ఆశించిన ప్రజలకు అధికారుల తీరుతో నిరాశే ఎదురవుతోంది. ఎన్నికలప్పుడు హామీల వర్షం కురిపించే ప్రజా ప్రతినిధులు సైతం దీని గురించి ఆలోచించకపోవడం బాధాకరం. ఇకనైనా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన ట్యాంక్ బండ్ నిర్మించాలని మణుగూరు వాసులు కోరుతున్నారు.

Comments

comments