Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

భగీరథపై నిర్లక్ష్యం వద్దు

tasks must be completed by August 14 not to neglect the mission bhagiratha

ఎమ్మెల్యేలు, అధికారులతో మంత్రి పోచారం సమీక్ష  

మనతెలంగాణ/నిజామాబాద్ : మిషన్ భగీరథ పనులపై నిర్లక్షం చేయవద్దని ఆగస్టు 14లోపు పనులు పూర్తి చేయాలని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అధికారులను రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు.  శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా 9 నియోజక వర్గాల్లో పనుల తీరుపై వర్కింగ్ ఏజెన్సీలను మంత్రి ప్రశ్నించారు. ఆగస్టు 15న ప్రతి పల్లెకు తాగునీరు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇప్పటికే మెయిన్ లైన్ పనులు పూర్తయినందు వల్ల ఆగస్టు 14లోపు ప్రతి గ్రామానికి నీటి సరఫరా జరగాల్సిందేనని మంత్రి   ప్రశాంత్‌రెడ్డికి సూచించారు.

నాలుగు నియోజక వర్గాల్లో గ్రామాల్లోని ఉపరితల ట్యాంకుల నిర్మాణం నత్తనడకన సాగుతుందని ఏజెన్సీలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కలలు కంటున్న పథకం అని రాత్రింభవళ్లు పనుల వద్దే ఉండి వేగాన్ని పెంచాలని కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.  ఈ సందర్బంగా పలు సమస్యలను ఏజెన్సీలు మంత్రి దృష్టికి తీసుకురాగా అందుకు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సహకరించాలని మంత్రి పోచారం స్పష్టం చేశారు.  ఈ సందర్భంగా తమ నియోజక వర్గాల్లో పనులు వేగంగా జరగడం లేదంటూ ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకురాగా మిషన్ భగీరథ అధికారులపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. కామారెడ్డి, నిజామాబాద్‌రూరల్, బోధన్ నియోజక వర్గాల్లో గ్రామాలను కలిపే అంతర్గత పైప్‌లైన్ పనులు వెంటనే పూర్తి కావాలని మంత్రి ఆదేశించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1645 అవాస గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉండగా ఇప్పటికి 70శాతం గ్రామాల్లోకి నీరు చేరిందని సమీక్షలో తేల్చారు. వివిధ గ్రామాల్లో ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చేందుకు సామాగ్రిని వెంటనే తెప్పించాలని సూచించారు. సింగూరు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి నిర్వహిస్తున్న మెయిన్ లైన్ ట్రయల్ రన్‌తో పాటు గ్రామాలకు సరఫరా చేసే పైప్‌లైన్‌ల లీకేజిపై మంత్రి మండిపడినట్లు తెలిసింది. పలు గ్రామాలను భగీరథ నీరు ముంచెత్తిన విషయంలో మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు సైతం అధికారులతో సమన్వయం చేసుకొని వర్కింగ్ ఏజెన్సీలను పరుగెత్తించాలని లక్షంలోపు ప్రతి ఇంటికి తాగునీరు చేరాల్సిందేనని అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో  నిజామాబాద్ కలెక్టర్ రామ్మోహన్‌రావు, కామారెడ్డి కలెక్టర్ సత్యనారాయణతో పాటు ఎమ్మెల్యేలు   ఏనుగు రవీంధర్‌రెడ్డి,  హన్మంత్‌షిండే,  షకీల్,   బాజిరెడ్డి గోవర్ధన్,  బిగాలగణేష్‌గుప్త,   జీవన్‌రెడ్డి, మిషన్ భగీరథ అధికారులు, ఎజెన్సీల నిర్వహకులు పాల్గొన్నారు.

Comments

comments