Home ఎడిటోరియల్ టాటా వీడ్కోలు – గుడ్‌బై ఇంక సెలవు

టాటా వీడ్కోలు – గుడ్‌బై ఇంక సెలవు

ఐరాస సెక్రటరీ జనరల్‌గా ఒబామా ?
రెండుసార్లు అమెరికా అధ్యక్షపదవి, నోబెల్ శాంతి బహుమతి పొందిన బరాక్ ఒబామాను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌గా నియ మించాలని కొందరు ప్రయత్నాలు ముమ్మర చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ప్రస్తుత ఐరాస కార్యదర్శి బాన్‌కి మూన్ పదవీ కాలం ముగియనుండడం, ఒబామా పదవీ కాలం పూర్తికాబోవడం, అంతర్జాతీయ శాంతి, భద్రతలకు ఆయన దోహదపడడం తదితర కారణాలు అనుకూలించవచ్చని కథనం. ఈసారి ఐరాస కార్యదర్శి మహిళే కావాలని కొందరు లాబీయింగ్ చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

యూఎస్ కాంగ్రెస్‌లో ఒబామా ఆఖరి ప్రసంగం

obamaప్రపంచశాంతి, రాజకీయాలు, దౌత్య అంశా లపై తనదైన ముద్రవేసి, అమెరికాను ఆర్థిక సంక్షోభం నుంచి మెల్లగా గట్టెక్కించి, భారత్-అమెరికా సంబంధాలను నూతన ఒరవడిలోకి తీసు కెళ్ళిన అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా తన పదవీకాలాన్ని కొన్ని నెలల్లో పూర్తి చేయ బోతున్నారు. ఈ సందర్భంగా అమెరికా కాంగ్రెస్‌లో కొన్ని రోజులక్రితం చేసిన ప్రసంగం (అమెరికా కాంగ్రెస్ సభ్యులనుద్దేశించి) ఆయన పదవీకాలంలో చివరి ప్రసంగమవుతుందని తెలుస్తోంది. అమెరికా చరిత్రలో బరాక్ ఒబామా పదవీ కాలం చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతకుముందు రెండు సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన బుష్ (జూనియర్) పదవీకాలంలో చోటు చేసుకున్న పరిణామాలు అమెరికాను కొంత ఇబ్బందుల్లోకి నెట్టాయి. ముఖ్యం గా 2001లో ప్రపంచ వాణిజ్యకేంద్రంపై అల్‌ఖైదా చేసిన దాడి, ఆప్ఘనిస్థాన్, ఇరాక్‌లలో చోటు చేసుకున్న పరిణామాలు కొన్ని అమెరికాకు తీవ్ర ఇబ్బందులు కలిగించాయి. ఒబామా మొదటిసారి పదవీస్వీకారం చేసిన సంవత్సరమే అమెరికాకు అత్యంత గడ్డుకాలమని విశ్లేషకులు భావిస్తుంటారు. 2008లో ఆర్థిక సంక్షోభం అమెరికాకు ఊపిరిసలప కుండా చేసింది. అనేక భారీ ఆర్థిక సంస్థలు దివాళా తీసాయి. అప్పటికి బరాక్ ఒబామా పదవీ బాధ్యత లు చేపట్టి కొన్ని వారాలే అయింది. అలాంటి పరిస్థితుల్లో ఆయన అమెరికా ఆర్థిక సంక్షోభంనుంచి ఉపశమనం కలిగించేలా తీసుకున్న చర్యలు ఉద్దీపనం కలిగించాయి. మొదట్లో అమెరికన్లు ఒబామా సామర్థంపై కొన్ని సందేహాలు లేవనెత్తడం, దానికితోడు ఆఫ్రికా జాతీయ నేపథ్యం ఉండడం తదితర కారణాలు పదవి చేపట్టిన మొదట్లో ప్రతిబంధకాలుగా మారాయని కొన్ని పత్రికలు విశ్లేషించాయి. కానీ కొద్దికాలంలోనే ఒబామా అధిగమించి మొదటిసారి తన పదవీ కాలం పూర్తయ్యేలోగా కొన్ని విప్లవాత్మక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా అమెరికాలో ఉన్న మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల పౌరుల కోసం చేపట్టిన సామాజిక భద్రత, సంక్షేమ కార్యక్రమాలు చాలామందిని ఆకట్టుకున్నాయి. అంతేకాదు వలస విధానం మీద కొన్ని విప్లవాత్మక చర్యలు చేపట్టారు. అమెరికా అధ్యక్షుడి హోదాలో ఉండి అమెరికా వలస చట్టాల విధానాలు ఘోరంగా వైఫల్యం చెందాయని బరాక్ ఒబామా బహిరంగం గా ప్రకటించి, వలస విధానాన్ని సంస్కరించి, కొంత మానవీయతను జోడించి నూతన విధానాలకు అంకురార్పణ చేశారు. అనేక దేశాలలో అమెరికా దౌత్య, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను కొత్త శకంలోకి తీసుకెళ్లారు.
అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఎనిమిదేళ్ల కాలం లో స్థూలంగా బరాక్ ఒబామా సాధించిన విజయాలు, విప్లవాత్మక చర్యలు ఒకసారి పరిశీలిద్దాం. అవి
అమెరికా వలస విధానం:
అమెరికా అధ్యక్షుడిగా తనకున్న విచక్షణాధి కారాలను ఉపయోగించి “కార్యనిర్వాహక ఆదేశా లు” జారీ చేశారు. అనేక దశాబ్దాలు, సంవత్స రాలుగా అక్రమంగా నివాసముంటున్న వలసదారు లను గుర్తించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి వారందరికీ అమెరికా పౌరులతో సమానంగా హక్కులు లభిస్తాయి. అక్రమంగా వలస దారులు అమెరికాలో దశాబ్దాలుగా నివాసముండి పన్నుల ద్వారా వారు చెల్లిస్తున్న మొత్తం, వారి భాగస్వామ్యం ముఖ్యమని, వారిని అమెరికానుంచి వెళ్లగొడితే అది అమెరికా విలువలకు వ్యతిరేకమని ప్రకటించారు.
సామాజిక, ఆర్థిక, ఆరోగ్య పథకం;
పేద, మధ్యతరగతి అమెరికా పౌరులకు బరాక్ ఒబామా ఎన్నో సంక్షేమ చర్యలు చేపట్టారు. అవి వారిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సామాజిక భద్రతా పథకం, ఒబామా కేర్ ద్వారా ఆరోగ్య బీమా పథకాలు ఎంతో ఉపయోగపడ్డాయి. మొదట్లో అమెరికా ధనికవర్గం నుంచి విమర్శలు వెల్లువెత్తినా వారు కూడా అర్థం చేసుకున్నారు. అధ్యక్షుడిపేర ప్రారంభించిన హౌసింగ్ కార్యక్రమం ద్వారా అమెరికాలో ఎందరో నిలువనీడ పొందారు.
అంతర్జాతీయ సంబంధాలు:
ఇజ్రాయెల్‌ః ఈ దేశంతో తాడోపేడో తేల్చుకోవ డానికి అమెరికా సిద్ధంగాఉందనేలా సంకేతాలు పంపి ఇజ్రాయిల్ ఆధిపత్య పోకడలను తగ్గించారు. పాలస్తీనా అంశం విషయంలో మానవీయత పాటిం చాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు కరాఖండి గా చెప్పారు. ఇరాన్‌తో చేసుకున్న ఒప్పందం విషయంలో అమెరికాకు వ్యతిరేకంగా లాబీయింగ్ చేసిన ఇజ్రాయెల్‌కు చుక్కలు చూపించారు.
ఇరాన్ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను ఒబామా కొంత తగ్గించారనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఇరాన్‌తో చేసుకున్న అణుఒప్పందం ఉభయులకు మేలు చేకూరేలా ఉండడం, కొన్ని విషయాల్లో అమెరికా కిందికి దిగి వస్తుందని ఒబామా ఈ ఒప్పందం ద్వారా నిరూపించారు.
ఇరాక్ : బుష్ హయాంలో ప్రారంభమైన ఘర్షణ తీవ్ర స్థాయికి చేరి ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది.
ఐసిస్ ఐసిస్‌కు వ్యరేకంగా అమెరికా చేపట్టిన వ్యూహలు కొంత ఫలిస్తున్నాయి. ఒబామా దిగిపోయే లోపు ఐసిస్‌ను నియంత్రిస్తే అది గొప్ప విజయమే అవుతుంది.
ఇండియా : రెండుసార్లు అధ్యక్షుడిగా పదవిలోఉన్న బరాక్ ఒబామా తన కాలంలో ఇద్దరు భారతప్రధాన మంత్రులను చూశారు. నిజంగా ఇది గొప్ప అంశమే. మన్మోహన్‌సింగ్, నరేంద్రమోడీ ఇరువురితోనూ భారత్-అమెరికా సంబంధాలను చాకచక్యంగా నెరిపిన ఘనత ఒబామాదే. అప్పటి అణు ఒప్పందం నుంచి ఇప్పటివరకూ రెండు దేశాలూ అనేక వ్యూహాత్మక అంశాలపై సామీప్యతను పాటించాయి. ముఖ్యంగా తీవ్రవాదం అంశంలో రెండు దేశలూ కలసి పనిచేస్తున్నాయి. గత పాతికేళ్లలో అమెరికా అధ్యక్షులు ఒకటికంటే ఎక్కువసార్లు భారత్‌ను పర్యటించడం గొప్ప అంశమే మరి.
పాకిస్థాన్:
పాక్-అమెరికా దౌత్య సంబంధాలు కూడా గతంలో కంటే ఎక్కువగా బలపడ్డాయి. ముఖ్యంగా ఎన్నికలు జరిగి పాక్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడి నవాజ్ షరీఫ్ ప్రధాని అయ్యాక అమెరికా పాక్‌కు ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. ఒకవైపు భారత్, మరోవైపు పాక్, ఇంకోవైపు ఆప్ఘనిస్థాన్‌లతో త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు గమనించవచ్చు.
అమెరికా- ఆఫ్రికాః
గతంలో లాగానే అమెరికా తన సంబంధాలను ఆఫ్రికా దేశాలతో ఒబామా పదవీకాలంలో కూడా కొనసాగించింది. కాకపోతే కెన్యాను తన వ్యూహాత్మ క భాగస్వామిగా చేసుకున్నట్లు తెలుస్తోంది. దాని పక్కనే ఉన్న సోమాలియా పాతికేళ్లుగా అంతర్యుద్ధం, తీవ్రవాదంతో సతమతమవుతోంది. అల్‌షబాబ్ ద్వారా ఎదురవుతున్న తీవ్రవాదానికి కెన్యా బాధితు రాలిగా ఉంది. దీంతో దానిని అక్కున చేర్చుకుని అమెరికా కొన్ని చర్యలు చేపట్టింది. అవి కెన్యాకు ఆసరానిచ్చాయి. ఎప్పుడో 20ఏళ్ల కింద సోమాలియా రాజధాని మొగదిషులో మూసేసిన అమెరికా ఎంబసీని ఒబామా తిరిగి ప్రారంభించి ఆ దేశంతో సత్సంబంధాలకు తెరతీశారు. ఆఫ్రికన్ యూనియన్ సేనలకు అమెరికా తోడ్పాటునందిస్తూ తీవ్రవాదాన్ని అణిచేస్తుండడంతో సోమాలియా దారిలోకి వస్తోంది. దీంతో కెన్యా కొంత ఉపశమ నకు గురైంది. అదే అమెరికాకు లాభించింది.
ఉత్తర కొరియాః
అమెరికాకు, దాని అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కొరుకుడు పడని దేశం ఏదైనాఉందీ అంటే అది ఉత్తరకొరియానే. ముఖ్యంగా ఒబామా తన పదవీకాలం పూర్తయ్యేలా ఆ దేశాన్ని సమీపించి, అక్కడిరాజకీయ నాయకత్వంతో చర్చలు చేసి రాజీకి రావాలని ప్రయత్నించారు. ఆ ప్రయ త్నాలు ఇప్పటి వరకైతే సఫలం కాలేదు. ఈ మధ్య ఆ దేశం చేసిన హైడ్రోజన్ బాంబు ప్రయోగం సఫలం కావడంతో అమెరికా మిత్రదేశం, ఉత్తర కొరియా శత్రుదేశమైన దక్షిణ కొరియానుంచి అమెరికాకు తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. ఉత్తరకొరియాను కట్టడి చేయాలని దక్షిణ కొరియా అమెరికాను కోరు తోంది. కాని ఉత్తరకొరియా రాజకీయ నాయకత్వం ఇంతవరకూ దిగిరాలేదు సరికదా సై అంటే సై అన్నట్లు ప్రవర్తిస్తోంది. ఒబామా దానితో చర్చలకు యూఎన్‌ను ప్రయోగించినా సఫలం కాలేదు.
అమెరికా-యూఎన్:
అమెరికా-ఐక్యరాజ్యసమితి సంబంధాలు మరింత బలపడ్డాయి. ముఖ్యంగా రష్యా ఆధిపత్యా న్ని భద్రతామండలిలో ఎదుర్కోవడానికి అనేక వ్యూహాలు చేసింది. కానీ సిరియా విషయంలో రష్యావేసిన వ్యూహాత్మక ఎత్తుగడ అమెరికాను కొంత కలవరపెట్టింది. కానీ యథావిధిగానే అమెరికా యూఎన్‌లో తన చాతుర్యాన్ని ప్రదర్శించింది. అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్న కాలం యూఎన్‌కు కొంత ఆసరా అయింది. ముఖ్యంగా సుస్థిర అభివృద్ది లక్షాలు (ఎస్‌డిజీ) ప్రణాళిక గత ఏడాది ఐరాస సర్వసభ్య సమావేశం ఆమోదించడం, దానికి అమెరికా చేసిన కృషి మరువలేనిది.
భారత్ శాశ్వత సభ్యత్వం:
ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కోసం అమెరికా తన మద్దతు ప్రకటిం చింది. ఆ మద్దతు ఎలా ఉంటుంది అనేది ఇంకా ఒక కొలిక్కి రాలేదు.
రచయిత : అంతర్జాతీయ నిపుణుడు
(డెవలప్‌మెంట్, డెమొక్రసీ, జియోపాలిటిక్స్ అంశాల్లో)
94401 36718