Home తాజా వార్తలు టిసిఎస్, ఇన్ఫీ అదుర్స్

టిసిఎస్, ఇన్ఫీ అదుర్స్

TCS and Infosysక్యూ4 ఫలితాల్లో అంచనాలను అందుకున్న ఐటి దిగ్గజాలు

దేశంలో సాఫ్ట్‌వేర్ సేవల్లో తొలి రెండు స్థానాల్లో ఉన్న దిగ్గజాలు టిసిఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్), ఇన్ఫోసిస్‌లు ఒకే రోజు క్యూ4 ఫలితాలను ప్రకటించాయి. శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో ఇరు సంస్థలు విశ్లేషకుల అంచనాలను అందుకున్నాయి. రెండు కంపెనీలకు మార్చి త్రైమాసిక ఆదాయం, లాభాలు అంచనాలకు తగ్గట్టుగానే ఉన్నాయి. అయితే మార్జిన్ వంటి కొన్ని అంశాల్లో నిరాశపర్చాయి. మొత్తంగా చూస్తే రెండు ఐటి దిగ్గజాలు నాలుగో త్రైమాసిక ఫలితాలకు శుభారంభాన్ని ఇచ్చాయి.

క్యూ4లో రూ.21,539 కోట్ల ఆదాయం
నికర లాభం రూ.4,078 కోట్లు
వార్షిక ప్రాతిపదికన 10.5 శాతం వృద్ధి
షేరుకు రూ.10.5 తుది డివిడెండ్
ఇన్ఫోసిస్ సిఇఒ సలీల్ పరేఖ్

ఆదాయంలో 19% వృద్ధి:-

న్యూఢిల్లీ: మార్చి ముగింపు నాటి క్యూ4 ఫలితాల్లో దేశీయ రెండో అతిపెద్ద ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ అద్భుతంగా రాణించింది. నికర లాభం రూ.4,078 కోట్లతో 10.5 శాతం వృద్ధిని సాధించగా, గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.3,690 కోట్లుగా ఉంది. అయితే గైడెన్స్‌లో అంశంలో కంపెనీ నిరాశపర్చింది. కంపెనీ ఆదాయం కూడా 19.1 శాతం పెరిగింది. గతేడాదిలో ఇన్ఫోసిస్ ఆదాయం రూ. 18,083 కోట్లు ఉండగా, ఇది క్యూ4లో రూ. 21,539 కోట్లకు చేరింది. ఈమేరకు బిఎస్‌ఇ ఫైలింగ్‌లో కంపెనీ వివరాలను వెల్లడించింది. అస్థిర కరెన్సీ విలువ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో (201920) సంస్థ 7.5 నుంచి- 9.5 శాతం మధ్య వృద్ధిని అంచనా వేస్తుంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి(201819) ఇన్ఫీ నికర లాభం 3.9 శాతం పెరిగి రూ.15,410 కోట్లు నమోదు చేయగా, అలాగే ఆదాయంలోనూ రూ.82,675 కోట్లతో 17.2 శాతం వృద్ధిని చూపింది. ఇన్ఫోసిస్ సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ, సంస్థ ప్రణాళితో చేసిన పెట్టుబడులు లాభాలను ఇస్తున్నాయని అన్నారు. 2020 ఆర్థిక సంవత్సరం వైపు దృష్టి పెట్టామని, వ్యాపారంలో సామర్థం పెంపునకు అనేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

డాలర్ లాభంలో 1.7 శాతం వృద్ధి
క్యూ4లో డాలర్ మారకంలో ఇన్ఫోసిస్ నికర లాభం 581 మిలియన్ డాలర్లతో 1.7 శాతం వృద్ధిని సాధించింది. గతేడాదిలో ఇదే సమయంలో లాభం 571 మిలియన్ డాలర్లుగా ఉంది. అలాగే ఆదాయంలోనూ 3.06 బిలియన్ డాలర్లతో 9.1 శాతం వృద్ధిని సాధించగా, అంతకుముందు ఆదాయం 2.8 బిలియన్ డాలర్లుగా ఉంది. 201819 సంవత్సరానికి లాభం 2.2 బిలియన్ డాలర్లతో 11.5 శాతం క్షీణించగా, ఆదాయం 11.7 బిలియన్ డాలర్లతో 7.9 శాతం పెరిగింది.

రూ.10.50 తుది డివిడెండ్
2019కి షేరుకు రూ.10.50 చొప్పున తుది డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ప్రకటించింది. మధ్యంతర డివిడెండ్ షేరుకు రూ.7 కలిపిన తర్వాత షేరు మొత్తం డివిడెండ్ రూ. 17.50 అవుతుందని కంపెనీ వెల్లడించింది. మార్కెట్లో ఇన్ఫోసిస్ షేరు విలువ 0.71 శాతం పెరిగి రూ.748 వద్ద ముగిసింది.

నికర లాభం రూ.8,126 కోట్లు
ఆదాయం 18.5 శాతం జంప్.. రూ.38,010 కోట్లుగా నమోదు
గత 15 త్రైమాసికాల్లో కెల్లా పటిష్టమైన ఆదాయ వృద్ధి
రూ.18 తుది డివిడెండ్
టిసిఎస్ సిఇఒ రాజేష్ గోపీనాథన్

లాభం 18% జంప్:-

ముంబయి: దేశీయ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ టిసిఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) నాలుగో త్రైమాసిక(జనవరిమార్చి) ఫలితాల్లో దుమ్మురేపింది. 2019 మార్చి ముగింపు నాటి క్యూ4 ఫలితాల్లో కంపెనీ నికర లాభం రూ.8,126 కోట్లతో 17.7 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.6,904 కోట్లుగా ఉంది. ఈమేరకు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఇక ఆదాయంలోనూ టిసిఎస్ 18.5 శాతం వృద్ధిని చూపింది. గతేడాదిలో సంస్థ ఆదాయం రూ.32,075 కోట్లు ఉండగా, ఈసారి ఇది రూ.38,010 కోట్లకు పెరిగింది. 201819 ఆర్థిక సంవత్సరం మొత్తం నికర లాభంలోనూ రూ.31,472 కోట్లతో 21.9 శాతం వృద్ధిని సాధించగా, అదే సమయంలో ఆదాయం కూడా రూ.1,46,463 కోట్లతో 19 శాతం వృద్ధిని నమోదు చేసింది. టిసిఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సిఇఒ), మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపీనాథన్ మాట్లాడుతూ, గత 15 త్రైమాసికాల్లో ఇవే అత్యంత పటిష్టమైన ఆదాయం వృద్ధి అని అన్నారు. గత త్రైమాసికాలతో పోలిస్తే తమ ఆర్డర్ బుక్ చాలా మెరుగ్గా ఉందని, డీల్స్ కూడా వేగవంతమయ్యాయని అన్నారు. ఆర్థిక గణాంకాలు అస్థిరంగా ఉన్నప్పటికీ కొత్త ఆర్థిక సంవత్సరంలో పటిష్టమైన ఎగ్జిట్ పోజిషన్స్ ఉన్నాయని తెలిపారు. తుది డివిడెండ్‌గా ఈక్విటీ షేరుకు రూ.18 చొప్పున టిసిఎస్ బోర్డు ప్రకటించింది. అయితే మార్కెట్ అవర్స్ అనంతరం కంపెనీ ఫలితాలను ప్రకటించింది. శుక్రవారం నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో టిసిఎస్ షేరు 0.32 శాతం నష్టపోయి రూ.2013 వద్ద ముగిసింది.

TCS, Infosys trade flat ahead of Q4 results announcement