Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఉపాధ్యాయుల కన్నెర్ర

 Teachers are deeply dissatisfied with the transfer counseling

వెబ్ కౌన్సెలింగ్ గందరగోళంగా మారడంతో ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. ఈ విధానాన్ని రద్దు చేయాల్సిందేనని, లేకుంటే తమకు తీవ్ర నష్టం జరుగుతుందని, తక్షణమే ప్రభుత్వం స్పందించాల్సిందేనంటూ సంగారెడ్డిలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనేక సమస్యలు, తప్పుడు సర్టిఫికెట్లు, వెరిఫికేషన్ల అనంతరం ప్రారంభమైన బదిలీ కౌన్సెలింగ్ పట్ల ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. తొలి రోజున అనేక అవాంతరాలు తలెత్తడంతో వారంతా నిరాశకు గురయ్యారు. దీంతో పీఆర్‌టియు, ఎస్టీయూ, పీఆర్‌టిఎఫ్, టీపిటీఎఫ్, పిటీఎఫ్, టిటియూ, ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుల సంఘం, టీఎస్‌టీఎఫ్, టీఎస్‌పీఈటీ అసోసియేషన్‌లు కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం సాయంత్రం సమావేశమైన సంగతి తెలిసిందే. తీవ్రంగా చర్చించిన అనంతరం ఉద్యమానికి సిద్ధం కాగా, సంగారెడ్డిలో ఈ సంఘాలన్ని భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. వెబ్ కౌన్సెలింగ్‌లో తలెత్తుతున్న సమస్యలను విద్యాశాఖకు పరిష్కరించే సత్తాలేదని, అందువల్ల వెబ్ కౌన్సెలింగ్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాతపద్ధతినే కొనసాగించాలని వారు పేర్కొన్నారు. సంగారెడ్డిలోని ఐబి నుంచి న్యూ బస్టాండ్, రైతు బజార్ మీదుగా డిఇఓ కార్యాలయంల వరకు ఈ ర్యాలీ  సాగింది. దారి పొడవునా నినాదాలు చేశారు. గందరగోళంగా మారిన ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పాత పద్ధతిలో కౌన్సెలింగ్‌ను ప్రవేశపెట్టాలని ఐక్య కార్యాచరణ సమితి నేతలు మాణయ్య, రాములు, సాబేర్ తదితరులు పేర్కొన్నారు. తొలిరోజున ఉపాధ్యాయులు నానా గందరగోళానికి గురయ్యారని వారు అన్నారు. వెబ్‌లో లోటు పాట్ల సవరణకు సాయంత్రం 5 గంటల వరకే ఉన్న గడువును రాత్రి 12 గంటల వరకు పొడగించాల్సి వచ్చిందన్నారు. అయినప్పటికీ ఇంకా వెబ్ ఆప్షన్లలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జిటి వెబ్ కౌన్సిలింగ్ ఇంకెంత గందరగోళానికి దారితీస్తుందోనని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించకపోతే ఉపాధ్యాయుల ఆగ్రహానికి ప్రభుత్వం గురి కాక తప్పదని వారు హెచ్చరించారు.

Comments

comments