Home ఆఫ్ బీట్ నవభారత నిర్మాతలు ఉపాధ్యాయులు

నవభారత నిర్మాతలు ఉపాధ్యాయులు

Dr.-Sarvepalli-Radhakrishna

“గురుబ్రహ్మ గురుర్విష్ణు.
గురుదేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మైశ్రీ గురవేనమః”

అనే శ్లోకం అందరికి తెలిసిందే. తల్లీ తండ్రీ గురువు అన్నారు. ప్రతి విద్యార్థికి జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత అన్నీ గురువే. ఏ దేశాభివృద్ధి అయినా ఆ దేశ విద్యా వ్యవస్థపైనే ఆధారపడి ఉంటుంది. విద్యా వ్యవస్థ సక్రమంగా ఉన్న నాడు అందులోంచి ఉత్పత్తి అయ్యే మానవ వనరులు కూడా ఆశించిన ప్రమాణాలకు అనుగుణంగా వుంటాయన్నది అక్షర సత్యం. అలాంటి వ్యవస్థకు మూలస్తంభమైన ఉపాధ్యాయులు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో వారి పాత్ర అనిర్వచనీయమైంది. పాఠశాలలోని తరగతిగదిలో ఉన్న విభిన్నరకాల మనస్తత్వం కలిగిన విద్యార్థులను తమవైపు తిప్పుకుని వారందరికీ పాఠ్యాంశాలు అర్థమయ్యేలా బోధించగల సామర్థం గురువులోనే ఉన్నది. ఒకటో తరగతిలో ఓనమాలు దిద్దించిన ఉపాధ్యాయుడు విద్యాబీజానికి మూలపురుషుడైతే ఆ తర్వాత పైచదువులలో కూడా ఉపాధ్యాయులు తమవంతు పాత్ర నెరవేరుస్తున్నందున అందరిలోను గురువు ఒక్కరే మార్గదర్శకులుగా నిలిచి మంచి మార్గాన్ని చూపిస్తారు. పవిత్రమైన ఉపాధ్యాయవృత్తికే వన్నె తెచ్చిన మహనీయుడు, తాత్వికుడు, పరిపాలనాధ్యక్షుడు, మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తి నుంచి పరిపాలనాధ్యక్షుడుగా మారినప్పటికీ ఆయనలో గురువు స్థానం అలాగే నిలిచిపోవడం.

ఆయన జయంతి రోజైన సెప్టెంబర్ 5వ తేదీన ప్రతి ఏడాది గురుపూజోత్సవం జరుపుకోవడం సంతోషకరం. అందుకే ఉపాధ్యాయుడిని మార్గదర్శకుడిగా పేర్కొనవచ్చు. తమిళనాడులోని తిరుత్తణిలో 1885 సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మించారు. ఉన్నత విద్యాభాస్యం తర్వాత 1918 వరకు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో, రాజమండ్రి కళాశాలలో అధ్యాపకుడిగా ఆయన పనిచేశారు. అనంతరం 1921లో కోల్‌కత్తా యూనివర్సిటీలో ఆచార్యునిగా పనిచేశారు. ఆంధ్రా, బెనారస్ విశ్వవిద్యాలయాల ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. విశ్వవిద్యాలయాల ఎడ్యుకేషన్ కమిటి చైర్మన్‌గా, రాయబారిగా, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా అత్యున్నత పదవులు నిర్వహించిన ఆయన అన్ని పదవులకు వన్నె తెచ్చారు. ఎన్నో పుస్తకాలను రచించారు. దేశంలో అత్యంత ప్రతిష్టాకరమైన భారతరత్న బిరుదుతో పాటు వంద అవార్డులు అందుకున్న ఘనత ఆయనకే దక్కింది. అందువల్లన ఆయనను ఒక వ్యక్తిగా కాకుండా మహోన్నతమైన శక్తిగా అభివర్ణించడం అతిశయోక్తికాదు. గురువులకే గురువు రాధాకృష్ణన్. జాతి పునర్నిర్మాణానికి విద్యార్థులను దేశపౌరులుగా తీర్చిదిద్దడంలో వారికి వారే సాటి.

ముందుగా విద్యార్థుల మనోభావాలను తెలుసుకోవడానికి ప్రయత్నించడంతో పాటు వారి పట్ల ప్రేమానురాగాలను పంచుకుని పాఠ్యాంశాలను బోధించడానికి ప్రయత్నిస్తారో అలాంటి ఉపాధ్యాయులు ఎన్నడూ చిన్నారుల మనసును వీడి వెళ్లలేరు. యంత్రాలు పనిచేయగలవేమోగాని పాఠ్యాంశాలను బోధించలేవు. పరిస్థితులు మారినా సమాజంలో ఎప్పటికీ గౌరవస్థానాన్ని పొందగతలిగినవారు ఉపాధ్యాయులే. సహనశీలత నైతిక విలువల పట్ల నిబద్ధత, స్వీయ క్రమశిక్షణ, విద్యార్థుల తెలివితేటలు గుర్తెరిగి పదును పెట్టగల సామర్థం ఇవన్నీ ఉపాధ్యాయ వృత్తికే సాధ్యమని చెప్పవచ్చు. అవివేకిని వివేకిగా మార్చగలడం, నిష్ప్రయోజకుని ప్రయోజకుడుగా తీర్చిదిద్దేవారు ఉపాధ్యాయులే. ప్రభుత్వ పాఠశాలలో నిరుపేద వర్గాలని విద్యార్థులే అధికంగా చదువుకుంటున్నారని వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తే ఎందరో మేధావులను వెలుగులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయని భావించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం గర్వకారణం. విద్యార్థి భావప్రకటనా, సామర్థాన్ని ప్రతిభాపాటవాలను వెలితీయాల్సిన బాధ్యత గురువుపైనే ఉంది. కులం, మత, వర్గ, లింగ భేదాలు లేకుండా అందరూ ఒకటిగా మెలిగేది గురువు దగ్గర మాత్రమే. (సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం) -డా॥ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా…

-కె.మానస, 83419 28103