Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

విద్యాశాఖలో లొల్లి

 Teachers handed manual certificates to disabled

మన తెలంగాణ/ వరంగల్ అర్బన్ జిల్లా ప్రతినిధి : జిల్లా విద్యాశాఖలో లొల్లి కొనసాగుతోంది. ఉపాధ్యాయుల బదిలీలలో అసలైన వారికి అన్యాయం జరుగుతుందనే వాదన వినిపిస్తోంది. మాన్యూవల్ సర్టిఫికేట్లను చూపి సకలాంగులు వికలాంగులుగా చలామణి అవుతూ ప్రయోజనం పొందుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇట్టి విషయంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు గుప్పుమనటం చర్చానీయాంశంగా మారుతోంది. పలు శాఖలలో చేపట్టిన బదిలీలలో బాగంగా విద్యాశాఖలో జరుగుతున్న బదిలీలలో కొంత మం ది ఉపాధ్యాయులు వికలాంగులుగా మాన్యూవల్ సర్టిఫికేట్లు చూపించి ప్రయోజనం పొందుతున్నారని దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆరోపిస్తోంది. సంబంధిత ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. దీంతో కొంత మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి జరుగుతున్న తప్పిదాన్ని సరి చేసుకున్న ఉపాధ్యాయులు కూడా ఉండటం గమనార్హం. అయితే మరి కొంత మంది మొండికేసి తమకెవరూ ఎదురులేన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవటం గమనార్హం.

సకాలంగులైన ఉపాధ్యాయులు వికలాంగుల సర్టిఫికేట్లతో చలామణి అయిన సంఘటనలు ఖమ్మం, కరీంనగర్ లాంటి జిల్లాలలో చోటుచేసుకున్న విషయం విధితమే. దిలీల ప్రక్రియలో చోటు చేసుకున్న సంఘటనల పట్ల అక్కడి అధికారులు దృష్టి సారించి చర్యలు కూడా చేపట్టారని, ఆయా జిల్లాలలో ఇలాంటి మార్గంలో చలామణి అయినటువంటి ఉపాధ్యాయులను సస్పెండ్ కూడా చేసినట్లు పలువురు తెలుపుతున్నారు. అయితే ఇదే తతంగం ఓరుగల్లు జిల్లాలో చోటు చేసుకోవడం గమనార్హం. ఈ తతంగం పట్ల ఉన్నతాధికారులు సైతం చూసిచూడనట్లు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు పేర్కొంటున్నారు. ఒక దశలో నకిలీ వికలాంగుల సర్టిఫికేట్లు పెట్టి, మాన్యూవల్ సర్టిఫికేట్లతో చలామణి అవుతున్న మడిపల్లి పాఠశాలలో విధులు నిర్వహించే ఉపాధ్యాయుడు దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులపై ఎదురుదాడికి దిగారని, భయభ్రాంతకు గురి చేయడం జరుగుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి ఫిజికల్ వెరిఫికేషన్ చేయించాల్సిన అవసరముందని కోరుతున్నారు. సకలాంగులైన ఉపాధ్యాయులు వికలాంగుల సర్టిఫికేట్లు పెట్టిన వ్యవహారం చర్చానీయాంశంగా మారడంతో ఇప్పటి వరకు ఐదుగురు ఉపాధ్యాయులు వెన్నక్కిపోయారని, సుమారు మరో 15 మంది వరకు ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవడం గమనార్హం. కనీసం సదరం సర్టిఫికేట్లు కూడా లేకుండా పాత మాన్యూవల్ సర్టిఫికేట్లతో చలామణి అవుతూ ప్రయోజనం పొందుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీంతో దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆందోళనకు సిద్దమైంది. నేడు జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఆందోళనలకు పిలుపునిచ్చింది.
బేషరతుగా ఫిజికల్ వెరిఫికేషన్ చేయించాలి
నల్లెల రాజయ్య, కన్వీనర్: దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి)
విద్యాశాఖ ఉన్నతాధికారుల తీరు పలు అనుమానాలకు తవిస్తోంది. సకలాంగులైన వారు యదేచ్ఛగా మాన్యూవల్ సర్టిఫికేట్లతో వికలాంగులుగా చలామని అవుతూ ప్రయోజనం పొందుతున్నారు. దీంతో నిజమైన దివ్యాంగులకు అన్యాయం జరుగుతుంది. దీనిపై ఉన్నతాస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. పైగా అక్రమంగా వికలాంగుల సర్టిఫికేట్లతో ప్రయోజనం పొందుతున్న ఉపాధ్యాయులు ఎదురుదాడికి దిగుతున్నారు. దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీకి ప్రతినిధ్యం వహిస్తున్న నాపై మడిపల్లిలో పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు దాడికి దిగటం జరిగింది. విద్యాశాఖలో చోటుచేసుకున్న సంఘలనలపై తక్షణమే సమగ్రమైన విచారణ జరుపాలి. జిల్లా కలెక్టర్, ఉన్నతవిద్యాశాఖ అధికారుల సమక్షంలో డాక్టర్లతో ఫిజికల్ వెరిఫికేషన్ జరిపించాల్సిన అవసరముంది. ఈ నేసథ్యంలోనే నేడు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యలయం ఎదుట ఆందోళనకు సిద్దమయ్యాం. నేడు జరిగే ఆందోళనను జయప్రదం చేయాలని కోరుతున్నాం.

Comments

comments