Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

బదిలీల టెన్షన్..

Teachers transfer Tenction In Rangareddy District

మన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పంతుళ్లలో బదిలీల టెన్షన్ కొనసాగుతుంది. బదిలీలను సకాలంలో పూర్తి చేయాలన్న లక్షంతో ఆన్‌లైన్‌లో వెబ్ అప్షన్ ద్వారా బదిలీల ప్రక్రియ చేపట్టిన ఎదురుచూపులు మాత్రం తప్పడం లేదు. బదిలీల ప్రక్రియ జూన్ 6న జిఒ 16 విడుదల చేసి ప్రారంభించగా ఇతర శాఖలలో బదిలీల తంతు ముగిసి కొత్త స్థానాల్లో ఉద్యోగులు తమ విధులు నిర్వహిస్తున్నా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగియడానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉందని తెలిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయ బదిలీల కోసం ఆన్‌లైన్‌లో ఎడు వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న ఇప్పటివరకు కేవలం గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు 206 మందికి బదిలీ అదేశాలు అందడంతో వారు కొత్త స్థానాల్లో విధుల్లో చేరారు. బదిలీల అనంతరం పరిస్థితులను పరిశీలిస్తే మెజార్టీ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు నగర శివారుల్లోని అధికంగా హెచ్‌ఆర్‌ఎ వచ్చే స్థానాలకు వచ్చి చేరిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీలు మిగిలాయి.

తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాల పరిధిలో ఇప్పటికే స్కూల్ అసిస్టెంట్ బదిలీల ఆదేశాలు రావడంతో పాటు ఆన్‌లైన్‌లో సైతం పొందు పరిచిన రంగారెడ్డి జిల్లాలో మాత్రం కసరత్తు ఇంకా కొనసాగుతుంది. ఇదిగో బదిలీ ఆదేశాలు వస్తున్నాయ్…అదిగో నువ్వు ఫలానా పాఠశాలకు బదిలీ అయ్యావు అంటు ఉపాధ్యాయులు ఒకరికి ఒకరు సోషల్ మీడియాలో సమాచారం ఇచ్చుకోవడం తప్ప ఆదేశాలు రాకపోవడంతో పంతుళ్లు టెన్షన్ పడుతు తమకు ఎక్కడికి బదిలీ చేస్తారో…ఎలా విధులు నిర్వహించాలో అన్న పరేషాన్‌లో కనిపిస్తున్నారు. కొంత మంది ఉపాధ్యాయులు గత రెండు రోజులుగా అధికంగా బిపి వచ్చి ఆసుపత్రులలో సైతం చేరినట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు మూడు వేల మంది స్కూల్ అసిస్టెంట్‌లు బదిలీల కోసం వెబ్ అప్షన్ ఇవ్వడంతో వారి దరఖాస్తులను పూర్తిగా పరిశీలించి త్రిసభ్య కమిటి అనుమతి వచ్చిన అనంతరం ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. శనివారం నాడు ఆదేశాలు వస్తే సోమవారం నాడు కొత్త పాఠశాలలో చేరవలసి ఉంటుందని బావించిన ఉపాధ్యాయులకు ఎప్పుడు బదిలీ ఆదేశాలు వస్తాయో స్పష్టమైన సమాచారం ఇచ్చే వారు సైతం కరువయ్యారని పలువురు ఉపాధ్యాయులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. సోమవారం మద్యాహ్నంకు స్కూల్ అసిస్టెంట్‌ల బదిలీల ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని సమాచారం. నాలుగు వేల మందికి పైగా ఆన్‌లైన్‌లో వెబ్ అప్షన్ ఇచ్చిన ఎస్‌జిటి తత్సమాన కేటాగిరికి సంబందించిన ఉపాధ్యాయుల బదిలీలకు మరో మూడు నాలుగు రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది.
పల్లె బడులకు పంతుళ్లు దూరం…
ఉపాధ్యాయ బదిలీలతో పల్లె బడులకు పంతుళ్లు దూరం అవుతున్నారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల బదిలీ ఆదేశాలు ఇప్పటికే రాగా వికారాబాద్ జిల్లాలోని చాలా స్థానాలు ఖాళీ అయ్యాయి. నగర శివారులోని హెచ్‌ఆర్‌ఎ స్థానాలు నిండిపోయాయి. స్కూల్ అసిస్టెంట్‌లలో సైతం వికారాబాద్ జిల్లా నుంచి రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు బదిలీలపై రానున్నారు. నగర శివారులో దీర్ఘకాలీకంగా విధులు నిర్వహిస్తు తప్పనిసరి పరిస్థీతులలో బదిలీ అవుతున్న ఉపాధ్యాయులు వికారాబాద్ జిల్లాలోని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాలకు బదిలీ అవుతున్నారని గ్రామీణ ప్రాంతాల్లోని బడులు ఖాళీగానే ఉండే అవకాశం ఉందని ఒక ఉపాధ్యాయుడు తెలిపారు. విద్యాసంవత్సరం ప్రారంబమై నెల రోజులు గడుస్తున్న బదిలీల పర్వం పుణ్యమా మెజారీటి బడులలో విద్యాభోదన ముందుకు సాగడం లేదు. బదిలీల పర్వం త్వరగా ముగించి ఖాళీ స్థానాలలో విద్యావాలంటీర్‌లను నియమించి గాడి తప్పిన విద్యాభోదనను దారిలోకి తీసుకురావలసిన అవసరం చాలా వరకు ఉంది.

Comments

comments