Home వరంగల్ రూరల్ పేట్రేగిపోతున్న ప్రైవేటు పాఠశాలలు

పేట్రేగిపోతున్న ప్రైవేటు పాఠశాలలు

 Teaching with unwanted teachers

మన తెలంగాణ/ ఎల్కతుర్తి : ఉచితంగా ఉన్నత చదువులు చదువుకునే రోజులు పోయాయి. వేలు, లక్షలు పోసి చదువును కొనుక్కునే రోజులు వచ్చిపడ్డాయి. పిల్లలను ఉన్నత చదువులు చదివించి పెద్ద ఉద్యోగంలో నిలబెట్టాలనుకున్న తల్లిదండ్రుల ఆశలను సొమ్ము చేసుకుంటూ ప్రైవేటు పాఠశాలల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇంగ్లీషు చదువులంటూ తెలుగు భాషను, తెలుగు మీడియాన్ని తెరమరుగు చేయడంతో పాటు ఇంగ్లీషు మీడియం పేరుతో అధిక వసూళ్లకు పాల్పడుతూ విద్యార్థుల తల్లిదండ్రుల జేబులకు చిల్లలు పెడుతూ చదువును వ్యాపార రంగంగా మార్చి కేవలం ధనార్జనకే ప్రాధాన్యమిస్తూ నివులునా దోచుకుంటున్నారు. ఇలాంటి కార్పోరేట్ పాఠశాలల ఆగడాలను అరికట్టి విద్యారంగాన్ని వ్యాపార రంగంగా మారకుండా చేస్తూ విద్యార్థులకు స్వచ్ఛమైన విద్యను అందించే విధంగా చేయాల్సిన శాఖాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో ప్రైవేటు పాఠశాలల నిర్వహణ మూడు పువులు ఆరు కాయల్లా అలరారుతోంది. దీనికి తోడు ప్రభుత్వ పాఠశాలల్లో సైతం పోటీ తత్వాన్ని ప్రవేశపెట్టడంతో విద్యార్థులు ఎటుగా వెళ్లాలో తెలియక తికమకపడుతున్నారు. దీంతో ఒకే రకమైన పాఠశాలకు ప్రాధాన్యమివ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీని కారణంగా మిగతా తెలుగు, ఇంగ్లీషు మీడియం ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల లేమితో ఖాళాగా మారుతున్నాయి.
ధనార్జనే ధ్యేయంగా పాఠశాలల నిర్వహణ :
మండలంలో ప్రభుత్వ తెలుగు, ఇంగ్లీషు మీడియాలకు చెందిన పాఠశాలలతో పాటు ఆదర్శ (మోడల్) పాఠశాల ఉన్నప్పటికీ ప్రైవేటు పాఠశాలల జోరు ఏమాత్రం తగ్గకపోగా ఏడాదికేడాది పెరుగుతూనే ఉంది. పాఠశాలల నిర్వహణల్లో అతి తక్కువ కాలంలోనే అధిక సంపాదన ఉంటుండడంతో ప్రైవేటు పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులను మాయమాటలతో, వసతులు, సౌకర్యాల పేరుతో తమ వైపుకు తిప్పుకుని వారి జేబులకు చిల్లులు పెడుతున్నారు. కేవలం ధనార్జనే లక్షంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం జూలు విదిల్చింది. ఒక్కో విద్యార్థి ఇంటికి పదుల సార్లు తిరుగుతున్నారు. విద్యార్థి స్నేహితులు తమ పాఠశాలలోనే చేరారంటూ సెంటిమెంటుతో వల వేస్తున్నారు.
తోక పేర్లతో దోపిడి :
ప్రైవేటు పాఠశాలలు నిర్వహించాలంటే ప్రభుత్వం విధించిన నియమ నిబంధనల మేరకు మాత్రమే నడుచుకోవాలి. కానీ నిబంధనలను తుంగలో తొక్కుతూ తలా ఒక అడుగు ముందుకేసి డిజి, టెక్నో, ఇన్నోవేటివ్, కాన్సెప్ట్, కర్రీకులం పేర్లతో ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నామంటూ కరపత్రాలు ముద్రించి పంచుతున్నారు. అయితే ప్రభుత్వం ఈ తోక పేర్లకు ఎలాంటి అనుమతులు జారీ చేయదన్న విషయం తెలిసిందే. కానీ ప్రభుత్వం తమకు అనుమతులు ఇచ్చిందంటూ చెప్పుకుంటూ ప్రత్యేక ఫీజులు వసూలు చేసేందుకు ఆయా పాఠశాలల యాజమాన్యాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఫ్లెక్సీలు, కరప్రతాలు ముద్రించి విద్యార్థుల తల్లిదండ్రులను ఏమార్చి తమ పాఠశాల వైపు లాక్కున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు చెబితే వింటారో అలాంటి వారికి తాయిలాలు ప్రకటిస్తూ సెంటిమెంటుతో మాటల గారడీని ప్రదర్శిస్తూ తమ విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటున్నారు.
తెలుగు మీడియం కనుమరుగేనా :
రోజురోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు విద్యా సంస్థల మూలంగా ప్రస్తుతం గ్రామాల్లో తెలుగు మీడియం పాఠశాలలు కనుమరుగు కానున్నాయి. ఇప్పటికే విద్యార్థులు ఇంగ్లీషును చదివినంత ఈజీగా తెలుగును చదువలేకపోవగం గమనార్హం. ఇదిలా ఉండగా ప్రభుత్వ పాఠశాలల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నప్పటికీ విద్యార్థులను ఆటుగా వెళ్లకుండా చేసేందుకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. విద్యార్థులను చేర్పించడమే ధ్యేయంగా మధ్య దళారులను పురమాయించి వారి ద్వారా విద్యార్థుల సంఖ్యను రోజురోజుకు పెంచుకుంటున్నారు. విద్యార్థులు చేరమే ఆలస్యం తల్లిదండ్రులను ఈ ఫీజులు, ఆ ఫీజులంటూ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇంతకు ముందు గ్రామాల్లోని ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు మీడియాలు కొద్దో గొప్పో నడుస్తూ ఉండేవి. ప్రస్తుతం అవి పూర్తిగా కనుమరుగయ్యాయి. వాటి స్థానాల్లో ఇంగ్లీషు మీడియాలకు సంబంధించిన డీజీ, టెక్నో, ఇన్వోవేటివ్, కర్రికులమ్ లాంటి తోక పేర్లతో పాఠశాలలు వెలుస్తున్నాయి.
అర్హత లేని ఉపాధ్యాయులతో బోధన :
లేనిపోని పేర్లు పెట్టుకుంటూ విద్యార్థులకు ప్రొజెక్టర్ల ద్వా రా, డిజిటలైజేషన్ పేరుతో అసమాన్య విద్యను అందించి వారి తెలివితేటల్ని అమాంతం పెంచుతామని నమ్మబల్కుతున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యా సంవత్సరం ప్రారంభించి తల్లిదండ్రులకు ఇచ్చిన హామీలను పక్కనపెట్టి విద్యను బోధించేందుకు అతి తక్కువ వేతనాలకు ఎలాంటి అర్హత లేని ఉపాధ్యాయులను నియమించి వారి ద్వారా విద్యాబోధన చేస్తున్నారు. ఇంటర్ ఆపై చదువుకున్న వారిని, ఏ మాత్రం అర్హత, అనుభవం లేని వారిని ఉపాధ్యాయులుగా నియమించుకుంటున్నారు. అటు అధిక ఫీజుల వసూళ్లు కావడం, ఇటు తక్కువ వేతనాలకు ఉపాధ్యాయులు దొరుకుతుండడంతో ప్రైవేటు నిర్వాహకులకు రాబడి అమాంతం పెరిగిపోతోంది. దీంతో తమ ఖజానాను నింపుకుంటూ నాణ్యత పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల మధ్య పోటీ :
ప్రైవేటు బాగోతం ఇలా ఉండగా ఇక ప్రభుత్వ పాఠశాలల విషయానికొస్తే మరోలా ఉంటోంది. ప్రభుత్వ పాఠశాలల మధ్య పోటీ తత్వాన్ని ప్రభుత్వాలు పెంచాయి. దీంతో విద్యార్థులు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేందుకు ససేమిరా అనడంతో మోడల్, కస్తూర్బా, గురుకులాలు లాంటి రెసిడెన్షియల్ పాఠశాలలకు తల్లిదండ్రులు ఆకర్షితులవుతున్నారు. దీని మూలంగా ఆయా పాఠశాలల్లో సీట్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తుండడంతో పాటు రెసిడెన్షియల్ సౌకర్యం లేని పాఠశాలలు మూతపడే స్థితికి చేరుకున్నాయి. కాగా సీట్లు దొరకని విద్యార్థులు మరో మారు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లకుండా ప్రైవేటును ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో వ్యత్యాసాలు ప్రదర్శించకుండా అన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకొస్తే ప్రభుత్వ పాఠశాలలు బతికే అవకాశాలు ఉన్నాయని విద్యా పండితులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పాటు పాలకవర్గాలు చిన్న చూపు ప్రదర్శించడంతో నిరాదరణకు గురవుతున్నాయి. మొత్తానికి ఈ విద్యా సంవత్సరానికి మరో మారు ప్రైవేటు పాఠశాలల దోపిడీ ప్రారంభమైందనే చెప్పాలి.
అధిక ఫీజులపై చర్యలేవి :
విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు వారి తల్లిదండ్రులను ఏమార్చి అధిక వసూళ్లకు పాల్పడుతున్నా పట్టించుకోవాల్సిన అధికారులు చర్యలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. దీంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు జూలు విదిల్చి అడ్డూ అదుపు లేకుండా ఫీజులను వసూలు చేస్తున్నాయి. పాఠశాలకు ఒక విధమైన ఫీజుల నిబంధనలను నిర్ణయించుకుంటూ అడ్డగోలుగా దోచుకుంటున్నారు.
ప్రస్తుతం 7వ తరగతి చదువుతున్న విద్యార్థికి ఏడాదికి రూ. 12వేల నుంచి రూ. 15 వేల వరకు తీసుకుంటున్నారు. ఇక హాస్టల్ అయితే మరో రూ. 20వేల నుంచి రూ. 30వేలు అధికంగా గుంజుతున్నారు. ఇలా ఒక్కో విద్యార్థి పదోతరగతికి వచ్చే సరికే తల్లిదండ్రులకు తడిసి మోపెడవుతోంది. ఇక ఇంటిర్ సంగతి సరేసరి. ఒక్సో సంవత్సరానికి రూ. 80వేల నుంచి రూ. 1.40లక్షల వరకు ఫీజులుంటున్నాయి. విద్యారంగాన్ని వ్యాపార రంగంగా మారకుండా చూస్తూ అధిక ఫీజులను అదుపు చేసి విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థికంగా కాపాడాలని విద్యావంతులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.