Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

షమి, శార్దూల్‌కు చోటు

ktr

రోహిత్‌కు మొండిచెయ్యి, ఇంగ్లండ్ సిరీస్‌కు టెస్టు జట్టు ఎంపిక

ముంబయి: ఇంగ్లండ్‌తో జరిగే తొలి మూడు టెస్టుల కోసం టీమిండియాను ప్రకటించారు. ఆగస్టు ఒకటి నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో భారత్ ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లో తొలుత జరిగే మూడు టెస్టుల కోసం టీమిండియాను భారత క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్లు అజింక్య రహానె, మురళీ విజయ్, చటేశ్వర్ పుజారాలకు జట్టులో చోటు లభించింది. అయితే స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు మాత్రం టెస్టు జట్టులో చోటు దక్కలేదు. యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా జట్టుకు ఎంపికయ్యాడు. గాయంతో వన్డే సిరీస్‌కు దూరమైన స్పీడ్‌స్టర్ జస్‌ప్రిత్ బుమ్రాకు తిరగి జట్టులో చోటు లభించింది. యోయో టెస్టులో విఫలమై అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టుకు దూరమైన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి కూడా ఇంగ్లండ్‌తో జరిగే తొలి మూడు మ్యాచ్‌లకు ఎంపికయ్యాడు. వికెట్ కీపర్లుగా దినేష్ కార్తీక్, రిషబ్ పంత్‌లకు చోటు కల్పించారు. వృద్ధిమాన్ సాహా పూర్తి ఫిట్‌నెస్ సాధించక పోవడంతో జట్టు ఎంపికలో అతని పేరును పరిగణలోకి తీసుకోలేదు. ఇక, సీనియర్ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు ఊహించినట్టే జట్టులో స్థానం లభించింది. ఇక, గాయంతో సతమతమవుతున్న సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కు తొలి మూడు టెస్టుల్లో స్థానం లభించలేదు. ఉమేశ్ యాదవ్, వెటరన్ బౌలర్ ఇషాంత్ శర్మలు జట్టులో చోటు సాధించారు. యువ స్పీడ్‌స్టర్ శార్దూల్ ఠాకూర్‌కు కూడా జట్టులో స్థానం దక్కింది. ఇంగ్లండ్‌తో జరిగే సుదీర్ఘ సిరీస్‌లో భారత్ ఐదు టెస్టులు ఆడనుంది. ఇప్పటికే ట్వంటీ20, వన్డే సిరీస్‌లు ముగిసాయి. టి20 సిరీస్‌ను భారత్, వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ గెల్చుకున్న విషయం తెలిసిందే. కాగా, కిందటి సిరీస్‌లలో ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన భారత్ ఈసారి ఎలా ఆడుతుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ పరిస్థితుల్లో జట్టు ఎంపికపై అందరి దృష్టి నెలకొంది. ఊహించినట్టుగానే సీనియర్లకే సెలెక్టర్లు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ నంబర్‌వన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా, కిందటిసారి ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఘోర పరాజయానికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో భారత్ ఉంది. దీని కోసం పటిష్టమైన ప్రణాళికతో బరిలోకి దిగనుంది.

Comments

comments