Home తాజా వార్తలు ఇద్దరికీ కష్టకాలమే..!

ఇద్దరికీ కష్టకాలమే..!

Team Indias worst ODI defeats

మన తెలంగాణ/హైదరాబాద్: లార్డ్ టెస్టులో ఓటమి టీమిండియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. వరుసగా రెండు మ్యాచుల్లో పరాజయం పాలు కావడంతో ఇటు కెప్టెన్ విరాట్ కోహ్లి అటు ప్రధాన కోచ్ రవిశాస్త్రిపై విమర్శల వాన కురుస్తోంది. ముఖ్యంగా జట్టులో ఆత్మస్థైర్యాన్ని నింపడంలో ఘోరంగా విఫ లమైన రవిశాస్త్రిపై మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రెగ్ చాపెల్ కంటే రవిశాస్త్రి ప్రమాదకరంగా తయారయ్యాడని, జట్టులో గ్రూపులకు ఆజ్యం పోస్తున్నాడని విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. భారత జట్టు ఘోర పరాజయాలు చవిచూస్తున్న కోచ్‌గా రవిశాస్త్రి నష్ట నివారణ చర్యలకు పూనుకోవడం లేదని మాజీలు విమర్శిస్తున్నారు. రవిశాస్త్రిని ఇలాగే కొనసాగిస్తే రానున్న రోజుల్లో టీమిం డియా మరింత బలహీనంగా మారుతుందనడంలో సందేహం లేదని వారు అభిప్రాయపడుతున్నారు.

గ్రూపులకు ఆజ్యం…

రవిశాస్త్రి కోచ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియాలో గ్రూపు రాజకీయాలు పెరిగి పోయాయి. విరాట్ కోహ్లి తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలకు తలుపడమే రవిశాస్త్రి లక్షంగా పెట్టుకున్నాడు. ఇతర క్రికెటర్లపై కోహ్లి చిన్న చూపు చూస్తున్న వాటిని కోచ్‌గా రవిశాస్త్రి అడ్డుకోవడం లేదు. అంతేగాక తాను కూడా వివాదాస్పద నిర్ణయాల్లో పాలుపంచుకుంటున్నాడు. టి20 సిరీస్‌లో గెలిచి జోరు మీద కనిపించిన టీమిండియా తర్వాత వరుస పరాజయాలతో సతమతమవుతోంది. దీనికి ప్రధాన కారణాలు కోచ్, కెప్టెన్‌లు తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని విమర్శలు వస్తున్నాయి. తరచు జట్టులో మార్పులు చేయడం, సీనియర్లపై వివక్ష చూపించడం తదితర కారణాలతో టీమిండియా వరుస పరాజయాలు చవిచూస్తోంది. కెప్టెన్‌గా ఆటగాళ్లకు అండగా ఉండాల్సిన ప్రధాన కోచ్ కేవలం కెప్టెన్ తీసుకుంటున్న నిర్ణయాలకు అండగా నిలుస్తున్నాడు. అంతేగాని జట్టు పరాజయాలకు గల కారణాలను అన్వేషించడం లేదు. అనిల్ కుంబ్లే ప్రధాన కోచ్‌గా ఉన్నప్పుడూ జట్టులో క్రమశిక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవాడు. జట్టు క్రమం తప్పకుండా సాధనలో పాల్గొనేలా చూసేవాడు. అంతేగాక గ్రూపులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకునే వాడు. అంతేగాక కెప్టెన్ తీసుకునే తప్పుడు నిర్ణయాలకు తలుపేవాడు కాదు. కోచ్‌గా జట్టుపై తనదైన ముద్ర వేశాడు.

కుంబ్లే పర్యవేక్షణలో టీమిండియా విదేశాల్లో కూడా నిలకడైన విజయాలు సాధించిన విషయం తెలిసిందే. కానీ, రవిశాస్త్రి కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టులో క్రమశిక్షణ గాడి తప్పింది. ఆటగాళ్లు ఆటకంటే విందులు, వినోదాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వరుస ఓటములు ఎదురవుతున్నా దాని గురించి పట్టించుకోవడం లేదు. ఏమీ పట్టనట్టుగా తమ కుటుంబ సభ్యులతో షికార్లు, షాపింగ్‌లలో తలమునకలవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆటగాళ్లపై కఠినంగా వ్యవహరించాల్సిన కోచ్ వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం, తాను కూడా విందు, వినోదాల్లో మునగడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో టీమిండియా క్రికెటర్లు ఆటకంటే షికార్లు, షాపింగ్‌లు, విందులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం స్పష్టమవుతోంది. ఈ విషయంలో స్వయంగా కెప్టెనే అందరికంటే ముందుంటున్నాడు. అయినా కోచ్ వీటిని అడ్డుకట్ట వేయలేక పోతున్నాడు. కోచ్‌గా కంటే కెప్టెన్‌కు విధేయుడిగానే రవిశాస్త్రి పని చేస్తున్నాడనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. వన్డే సిరీస్‌లో ఓటమి, తర్వాత రెండు టెస్టుల్లో ఘోర పరాజయం చవిచూసినా కోచ్‌లో చలనం రావడం లేదు. నష్ట నివారణ చర్యలు తీసుకోవడం లేదు. ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం, సాధన చేయకున్నా పట్టించుకోక పోవడం, కొందరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం తదితర చర్యలతో రవిశాస్త్రి ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. ఇప్పటికైనా అతను తీరును మార్చుకోకుంటే రానున్న రోజుల్లో ఎక్కువ కాలం ప్రధాన కోచ్‌గా కొనసాగడం కష్టమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
కోహ్లిపైనా కూడా..
మరోవైపు టీమిండియా విరాట్ కోహ్లిపై కూడా అభిమానులు, మాజీ ఆటగాళ్లు ఆగ్రహంతో ఉన్నారు. కోహ్లి తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు జట్టుకు ప్రతికూలంగా మారుతున్నాయని వారు విమర్శిస్తున్నారు. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత కెప్టెన్‌పై ఉంటుందని, అయితే కోహ్లి మాత్రం నిరంకుశంగా వ్యవహరిస్తూ ఆటగాళ్ల ఆత్మ విశ్వసాన్ని దెబ్బతీస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. కెప్టెన్‌గా కోహ్లి తీసుకుంటున్న నిర్ణయాలు చాలా వరకు జట్టుకు ప్రతికూలంగా మారుతున్నాయి. అయినా అతను తరచు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అతని చర్యలు జట్టుపై తీవ్ర ప్రభావాన్నే చూపుతున్నాయి. తొలి టెస్టులో కీలక సమయంలో అశ్విన్‌ను బౌలింగ్
నుంచి తప్పించి పెద్ద పొరపాటే చేశాడు. అసాధారణ రీతిలో బౌలింగ్ చేస్తున్న అశ్విన్‌ను పక్కనబెట్టి పాండ్యను రంగంలోకి దించాడు. అంతే అప్పటి వరకు భారత బౌలర్లు సాధించిన పట్టు సడలింది. ఫాస్ట్ బౌలర్లపై ఎదురుదాడి చేసిన శామ్ కరన్ భారత్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. అంతేగాక చటేశ్వర్ పుజారాను తొలి టెస్టుకు దూరంగా ఉంచడం కూడా పెద్ద పొరపాటే. ఒకవేళ పుజారాను మొదటి టెస్టులో ఆడించి ఉన్నట్లయితే మ్యాచ్ ఫలితం కచ్చితంగా భారత్‌కు అనుకూలంగా ఉండేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇక, రెండో టెస్టులో ధావన్‌ను తప్పించడం, ఉమేశ్‌కు బదులు కుల్దీప్ యాదవ్‌కు చోటు కల్పించడం కూడా కోహ్లి చేసిన పెద్ద పొరపాటుగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఈ విషయంలో కెప్టెన్‌కు సరైన సలహాలు ఇవ్వాల్సిన కోచ్ అదేమి పట్టనట్టుగా ఉంటున్నాడు. కోచ్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే కెప్టెన్ కూడా సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ రవిశాస్త్రి మాత్రం తన పదవిని కాపాడుకోవడమే ఏకైక లక్షంగా పెట్టుకున్నట్టు స్పష్టమవుతోంది. కెప్టెన్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నా దానికి అడ్డు చెప్పలేక పోతున్నాడు. అదే కుంబ్లే మాత్రం కోహ్లి నిర్ణయాలను చాలా వరకు తప్పు పట్టేవాడు. అంతేగాక తాను అనుకున్న ఆటగాళ్లను తుది జట్టులో ఎంపిక చేసేలా చూసేవాడు. ఈ క్రమంలో కెప్టెన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా కుంబ్లే పట్టించుకునే వాడు. ధైర్యంతో ముందుకు సాగావాడు. కుంబ్లే తీసుకున్న నిర్ణయాల వల్లే విండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్ గడ్డలపై జరిగిన సిరీస్‌లలో భారత్ జయకేతనం ఎగుర వేసింది.
ఇలాగైతే కష్టమే…
ఇక, రానున్న రోజుల్లో ప్రధాన కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లిలు తమ పద్ధతిని మార్చుకోవల్సిన సమయం అసన్నమైంది. వీరి తీరుపై ఇప్పటికే భారత క్రికెట్ బోర్డు ఆగ్రహంతో ఉంది. తమ వైఖరిని మార్చుకోక పోతే కోచ్‌తో పాటు కెప్టెన్‌పై కూడా చర్యలు తీసుకునేందుకు వెనుకాడ బోమని బోర్డు అధికారులు స్పష్టం చేశారు. తమకు జట్టు ప్రయోజనాలే ముఖ్యమని, జట్టుకు వ్యతిరేకంగా ఎవరూ వ్యవహరించిన ఉపేక్షించే ప్రసక్తే లేదని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల ఇటు కోచ్‌కు, అటు కెప్టెన్‌కు కీలకంగా మారాయి. ఇద్దరు కూడా తమ తీరును మార్చుకోవాల్సిన స్థితి నెలకొంది. ఏమాత్రం నిర్లక్షంగా వ్యవహరించిన భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.