Home తాజా వార్తలు గజ్వేల్ కు ఉజ్జ్వల భవిష్యత్

గజ్వేల్ కు ఉజ్జ్వల భవిష్యత్

నా గెలుపు ప్రజలకు, పార్టీ శ్రేణులకే అప్పచెబుతున్నా, నియోజకవర్గం ప్రజలతో కెసిఆర్
లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని కెసిఆర్‌కు గజ్వేల్‌వాసుల హామీ

kcr

మన తెలంగాణ/ హైదరాబాద్ : గజ్వేల్ నియోజకవర్గానికి మంచి ఉజ్వల భవిష్యత్ ఉందని, గత ప్రభుత్వాల హయాంలో జరగనంత అభివృద్ధి టిఆర్‌ఎస్ హయాంలో జరిగిందని కెసిఆర్ వ్యాఖ్యానించారు. గత పాలకులు గజ్వేల్‌ను పొరంబోకు భూమిగా మార్చి అవసరం కోసం వాడుకున్నారని, గందగగోళంగా మారిన నియోజకవర్గాన్ని ఓ తొవ్వకు తెచ్చేందుకు ఇంత సమయం పట్టిందని అన్నారు. గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం ఉదయం ఎర్రవల్లిలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, గజ్వేల్‌లో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి కేవలం చారానా (పావలా) వంతేనని, ఇంకా బారాణా (ముప్పావు) వంతు జరగాల్సి ఉందని అన్నారు. ప్రజల అభీష్టంతోనే మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానన్నారు. ‘నాకు పదూర్ల మాదిగతనం ఉంది.

అందరితో కలిసి నామినేషన్ వేసి వెళ్తాను. నా గెలుపు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ వర్గాలకే అప్పజెప్తున్నా’ అని అన్నారు. కొండ పొచమ్మ రిజర్వాయర్ గజ్వేల్ ప్రజలకు అన్నం పెడుతోందని జూన్‌లోగా నిర్మాణం పూర్తి చేసుకుని అన్ని చెరువుల్లో గోదావరి నీళ్ళను నింపుకుని ఏడాదికి మూడు పంటలు పండించుకుందామన్నారు. డివిజనల్ రింగురోడ్డుతో పట్టణ శివారులో పారిశ్రామిక కారిడార్‌తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు త్వరలో ఏర్పడతాయన్నారు. నాలుగు రాష్ట్రాలతోనే ఎన్నికలు జరుగుతాయని, తిరిగి అధికారంలోకి టిఆర్‌ఎస్ పార్టీ మంచి మెజార్టీతో వస్తుందని కెసిఆర్ స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేస్తున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు.

రెండేళ్లలో ఊహించని రీతిలో పరిశ్రమలు

గజ్వేల్ రెండేళ్లలో ఊహించని విధంగా భారీ పరిశ్రమలు వస్తాయని, పారిశ్రామికవేత్తలతో తాను మాట్లాడుతూ ఉన్నానని, వ్యవసాయంలో కూడా సాధించాల్సిన అభివృద్ధి చాలా వుందన్నారు. సాగునీటి గోస తీరితే సగం దరిద్రం పోతుందన్నారు. గజ్వేల్‌కు హర్టికల్చర్ యూనివర్సిటీతో పాటు అటవీ శాఖ కళాశాల వచ్చిందని, అందరి కన్నా ముందే గోదావరి మంచినీళ్లు తెచ్చుకొని ఇంటింటికీ నల్లా కనెక్షన్‌లు ఇచ్చుకున్నామన్నారు. రైలుమార్గం త్వరలో పూర్తవుతుందని, మనోహరాబాద్ నుంచి పొన్నాల వరకు ఈ నియోజకవర్గం గుండా రైలు వెళ్తుందని తెలిపారు. “నేనూ రైతునే. మక్కజొన్న పంట వేశాను. వర్షాలు లేక రెండో పంట వేయడానికి వీల్లేకుండా పోయింది. పెద్ద బాయి తోడినా లాభం లేదు. కొండపోచమ్మ పూర్తయితే యేడాదికి మొత్తం చెరువులల్లో నిండా నీళ్లుంటాయి. వర్షం పడ్డప్పుడల్లా అలుగులు పారుతాయి. శాశ్వతంగా భూర్భజలాలు పెరిగి బావులు పొంగిపొర్లుతాయి” అని కెసిఆర్ స్పష్టంచేశారు.

స్వల్పకాలిక రకాల సాగుతో మంచి దిగుబడులు పొందవచ్చని సూచించారు. సమైక్య రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాలు కాగితాలకే పరిమితం చేసిండ్రని సిఎం ఆరోపించారు. ప్రాజెక్టులన్నీ పూర్తయితే తెలంగాణ రాష్ట్రం పచ్చని పంటలతో ‘లక్ష్మీదేవత’లా కనిపిస్తుందన్నారు. సాగునీటితో పాటు మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపర్చుకోవడంతో పాటు పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఎక్కువగా ఏర్పాటు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 50 శాతం మంది కంటి సమస్యతో బాధపడుతున్నారని వృద్ధులతో పాటు చిన్న పిల్లలు, యువకులు కూడా ఉన్నారని కెసిఆర్ పేర్కొన్నారు. ఎర్రవెల్లి, నర్సన్నపేటల్లో ఉచిత కంటి శిక్షణ శిబిరం నిర్వహిస్తే 227 మందికి కళ్ళద్దాలు, చికిత్స అవసరమైందన్నారు. దీనిని గుర్తించి తాను స్వయంగా మూడు నెలలు దృష్టి పెడితే కంటి వెలుగు కార్యక్రమం రూపుదిద్దుకుందన్నారు.

కంటి వెలుగు పరీక్షలు ప్రజల్లో మంచిగా ఉపయోగపడుతుందని వారు దీవిస్తున్నారన్నారు. కంటి వైద్యానికి పెద్దగా ఖర్చు కాకపోయినా నిర్లక్ష్యం వల్లే గ్రామీణ ప్రాంతాల్లో సకాలంలో వైద్యం చేయించుకోలేక పోతున్నారన్నారు. ప్రజలు అడగకుండానే అనేక అంశాలు ప్రజలకు అందించామని కళ్యాణలక్ష్మీతో పాటు పలు పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. గజ్వేల్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. పట్టణంలో సిమెంటు కాంక్రీటు రోడ్ల నిర్మాణం కోసం రూ. 100 కోట్లు మంజూరు చేశానని, ఇంకా పలు అభివృద్ధి పనులు త్వరలో పూర్తవుతాయని స్పష్టం చేశారు. గజ్వేల్ పట్టణం హైదరాబాద్‌కు ‘కౌంటర్ మాగ్నెట్’ గా మారుతుందని ‘శాటిలైట్ టౌన్’గా మార్చాలన్నది అందరి లక్ష్యం కావాలన్నారు.

నల్గొండలో నిలబడమన్నారు…

నల్గొండ ప్రజలు అక్కడి నుంచి నిలబడాలంటూ ఒత్తిడి చేశారని, గజ్వేల్ ప్రజల అభీష్టం మేరకు మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ‘గెలుపును మీకే అప్పజెప్తున్నా. ఎన్నికల్లో మీరే పోరాటం చేసి నన్ను గెలిపించాలి. ఆ బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలి’ అన్నారు. గజ్వేల్ ప్రజలు ధర్మం వైపు నిలుస్తారని వారి దీవెనలు మనకు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో ఎంపి ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి, భూంరెడ్డి, భాస్కర్, చిట్టి దేవేందర్ రెడ్డి, జహంగీర్, అరుణ భూపాల్ రెడ్డి, జడ్పీటీసిలు, ఎంపీపిలు కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.