Home తాజా వార్తలు 25 నుంచి బడ్జెట్ సమావేశాలు?

25 నుంచి బడ్జెట్ సమావేశాలు?

 

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఓటాన్ అకౌంట బడ్జెట్ సమావేశాలు ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నాలుగు రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. తొలుత ఈ సమావేశాలను ఈ నెల 18 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ పదిహేనవ ఆర్థిక సంఘం సమావేశాలు మూడు రోజుల పాటు రాష్ట్రంలో కొనసాగనున్నందున అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడినట్లు సమాచారం. ఈ నెల 20వ తేదీతో ఆర్థిక సంఘం సమావేశాలు ముగిసిపోయిన తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దడం, దానిని అధ్యయనం చేసిన తర్వాత ముఖ్యమంత్రి ఆమోదం తెలపడం లేదా కొన్ని మార్పులు చేర్పులు చేయడం పూర్తయిన తర్వాత ఫైనల్ బడ్జెట్ సిద్ధమవుతుంది.

ఈ నెల 25న ఔటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించి 28కల్లా ముగించే విధంగా ఆలోచనలు జరుగుతున్నట్లు సచివాలయ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రూపొందించడం కోసం ఇప్పటికే వివిధ శాఖల ఉన్నతాధికారులకు లేఖలు రాసిన ఆర్థిక శాఖ తాత్కాలికంగా ఏయే శాఖకు ఎంత మేరకు నిధులు అవసరమవుతాయో నిర్దిష్ట ఫార్మాట్‌లో అందజేయాల్సిందిగా స్పష్టం చేసింది. దాదాపు అన్ని శాఖల నుంచీ వివరాలు వచ్చినట్లు ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అయితే వాటిని పరిశీలించి క్రోడీకరించిన తర్వాత బడ్జెట్ సైజు ఎంత ఉంటుందనేదానిపై కొంత స్పష్టత వస్తుంది. రైతుబంధు సాయాన్ని వెయ్యి రూపాయలు పెంచే నిర్ణయంతో పాటు ఆసరా పింఛన్లను రెట్టింపు చేసే అంశాన్ని కూడా ఓటాన్ అకౌంట్‌లో ప్రభుత్వం పేర్కొనే అవకాశం ఉంది. ఈ నెల మూడవ వారం తర్వాత ఏ రోజైనా కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంటు ఎన్నికల షెడ్యూలును విడుదల చేసే అవకాశం ఉన్నందున అప్పటికల్లా బడ్జెట్ సమావేశాలను ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది.

 Telangana budget meetings start from Feb 25th