Home తాజా వార్తలు 19న మంత్రివర్గ విస్తరణ

19న మంత్రివర్గ విస్తరణ

 

రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం, గవర్నర్‌తో సిఎం భేటీ తర్వాత ప్రకటన

మాఘశుద్ధ పౌర్ణమి మంగళవారం ఉదయం 11: 30 గం.కు
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర మంత్రివర్గాన్ని ఈ నెల 19న విస్తరించనున్నారు. గవర్నర్ నరసింహన్‌తో రాజ్‌భవన్‌లో శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయిన తర్వాత మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 19న (మంగళవారం) తెలుగు పంచాంగం ప్రకారం మాఘమాసం శుద్ధ పౌర్ణమి కావడంతో కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడానికి అవసరమైన ఏర్పాట్లను చేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాజ్‌భవన్‌లో ఆ రోజు ఉదయం 11.30 గంటలకు కొత్త మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారని ప్రభుత్వం ఆ ప్రకటనలో తెలిపింది. డిసెంబరు 11వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తయిన రెండు రోజులకు ముఖ్యమంత్రిగా కెసిఆర్, మంత్రిగా మహమూద్ ఆలీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మహమూద్ ఆలీకి హోం మంత్రిత్వశాఖ బాధ్యతలను అప్పగించారు. అప్పటి నుంచి మంత్రివర్గాన్ని విస్తరించలేదు. ఈ మధ్యకాలంలో మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చంటూ ప్రసార మాధ్యమాల్లో రకరకాల వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ ఊహాగానాలేనని తేలిపోయాయి. ఈ నెల 22 నుంచి నాలుగు రోజుల పాటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మంత్రివర్గాన్ని విస్తరించడంపై కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ సుదీర్ఘంగా ఆలోచన చేశారు.

గవర్నర్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో శుక్రవారం మధ్యాహ్నం కలిసి పలు విషయాలను చర్చించడంతో పాటు మంత్రివర్గ విస్తరణపై కూడా వివరించారు. దీంతో ఈ నెల 19వ తేదీన ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో మంత్రివర్గ విస్తరణ ఉండనున్నట్లు ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించింది. అయితే ఎంత మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఎవరెవరికి అవకాశం లభిస్తుందనే అంశాన్ని ప్రభుత్వం వివరించకపోయినప్పటికీ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పూర్తిగా కొత్త ముఖాలకే ఈసారి మంత్రివర్గంలో స్థానం ఉంటుందనీ, పాత కొత్తల కలయికగా ఉంటుందని, సీనియర్‌లకు కీలక మంత్రిత్వశాఖ శాఖలు అప్పగిస్తారని& ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. గత హయాంలో మంత్రులుగా పనిచేసినవారి పనితీరుపై ముఖ్యంమంత్రికి స్పష్టమైన అవగాహన ఉన్నందున రానున్న ఐదేళ్ళపాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పకడ్బందీగా అమలుకావాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని సమర్ధులైనవారికి, నిబద్ధతతో పనిచేసేవారికి అవకాశం కల్పించవచ్చని పార్టీ వర్గాలు ఇప్పటికే పేర్కొన్నాయి. పనితీరుకే ఈసారి ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తారని పేర్కొన్నాయి. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన పట్నం మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, చందూలాల్, జూపల్లి కృష్ణారావు ఈసారి ఓడిపోవడంతో మిగిలిన 13 మంది పాత మంత్రుల్లో ఎంత మందికి అవకాశం లభిస్తుందనేదానిపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. కెటిఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నందున మంత్రివర్గంలో స్థానం ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పూర్తిస్థాయి మంత్రివర్గం ఉంటుందా లేక కొద్దిమంది మంత్రులతోనే ప్రమాణ స్వీకారం చేయించి లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారా అనే అంశంపైనా రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

Telangana Cabinet expansion on Feb 19th