Search
Sunday 18 November 2018
  • :
  • :

నేడో, రేపో జోనల్ గెజిట్

Telangana Cabinet gives nod to new zonal system for govt jobs

రాష్ట్రపతి వద్ద దస్త్రం 

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన జోనల్ వ్యవస్థ దస్త్రంమీద రాష్ట్రపతి ఒకటి రెండు రోజుల్లో సంతకం చేయనున్నారు. ఆ వెంటనే గెజిట్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంతకం చేసిన తర్వాత హోం మంత్రిత్వశాఖకు చేరుకున్న ఈ దస్త్రం రాష్ట్రపతి భవన్‌కు చేరుకుందని, సంతకం చేయడమే తరువాయి అని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ జోనల్ ఫైల్ ప్రతీ కదలికను పరిశీలిస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్ళింది, ఏం జరుగుతోంది తదితర వివరాలన్నింటినీ ఢిల్లీలోనే మకాం వేసి పర్యవేక్షిస్తూ ఉన్నా రు. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన సమాచారాన్ని ముఖ్యమంత్రికి తెలియజేస్తూ ఉన్నారు. మంగళవారం సాయంత్రం సైతం జోనల్ ఫైల్‌పై రాష్ట్రపతి సంతకం చేశారో లేదో కనుక్కున్న రాజీవ్‌శర్మ రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని, గెజిట్ కూడా విడుదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో రెండు జోన్లు మాత్రమే ఉంటే తెలంగాణ ప్రభుత్వం దాన్ని ఏడు జోన్లకు పెంచి, రెండు మల్టీ జోన్లను కూడా సృష్టించింది. గతంలో జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి పోస్టుల్లో వేర్వేరు లోకల్, నాన్‌లోకల్ రిజర్వేషన్లు ఉండగా ఇప్పుడు నూతన జోనల్ విధానంలో 95% స్థానికులకే ఉద్యోగావకాశాలను కల్పించి కేవలం ఐదు శాతం మాత్రమే స్థానికేతరులకు ఇవ్వడంతో ‘మన ఉద్యోగాలు మనకే’ అనే భరోసా నిరుద్యోగ యువతలో ఏర్పడింది. త్వరలో భారీ స్థాయిలో ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నూతన జోనల్ వ్యవస్థ ద్వారా స్థానికులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయన్న ఉద్దేశంతో వీలైనంత త్వరగా రాష్ట్రపతి ఆమోదం పొందేందుకు చొరవ తీసుకుంటోంది. ప్రత్యేకంగా రాజీవ్‌శర్మ ఈ పనిమీదనే ఢిల్లీలో ఉంటూ దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. రెండు రోజుల్లోనే గెజిట్ విడుదలవుతుందన్న నమ్మకం ఉందని సచివాలయ అధికారి ఒకరు ధీమా వ్యక్తం చేశారు.

Comments

comments