Home జయశంకర్ భూపాలపల్లి సాగునీటి ప్రాజెక్టులకు ఆటంకం కలగొద్దు : కెసిఆర్

సాగునీటి ప్రాజెక్టులకు ఆటంకం కలగొద్దు : కెసిఆర్

CM-KCRజయశంకర్ భూపాలపల్లి : తెలంగాణలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులకు ఎటువంటి ఆటంకాలు కలుగొద్దని సమ్మక్క – సారలమ్మ అమ్మవార్లను తాను కోరుకున్నట్టు తెలంగాణ సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కుటుంబ సమేతంగా మేడారం జాతరను సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ పోరాట పటిమకు సమ్మక్క – సారలమ్మలు ప్రతీకలని ఆయన పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి కావాలని అమ్మవార్లకు మొక్కుకున్నట్లు ఆయన చెప్పారు. మేడారం జాతర కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ఆయన తెలిపారు. మేడారంలో 200 ఎకరాల స్థలంలో శాశ్వత ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మేడారం భూసేకరణపై పదిహేను రోజుల్లో మళ్లీ చర్చిస్తామని ఆయన చెప్పారు. మేడారంలో శాశ్వత ఏర్పాట్ల కోసం రెండు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తామని ఆయన వెల్లడించారు. సమైక్య రాష్ట్రంలో మేడారం జాతర కూడా నిర్లక్షానికి గురైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతామని ఆయన చెప్పారు. సమ్మక్క- సారలమ్మల దీవెనలతో తెలుగు ప్రజలు సుఖ శాంతులతో వర్థిల్లాలని కెసిఆర్ ఆకాంక్షించారు.

Telangana CM KCR Comments on Irrigation Projects