Home ఎడిటోరియల్ ప్రతాపవంతుడికే ప్రజల వీరతాళ్ళు

ప్రతాపవంతుడికే ప్రజల వీరతాళ్ళు

Telangana CM KCR is going to the early elections

నిజమే…ఇంకా ఎన్నికలకు తొమ్మిదిమాసాల సమయం ఉన్నది. హాయిగా, దర్జాగా అధికారాన్ని అనుభవించవచ్చు. రాజభోగాలను పొందవచ్చు. అయినప్పటికీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు. అంతే కాదు…శాసనసభను రద్దు చేసిన రోజునే చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా నూట అయిదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే సాహసం చేశారు. దీని వెనుక ఆయన రాజకీయ వ్యూహాలు ఆయనకు ఉండవచ్చు. ఆయన లెక్కలు ఆయనకు ఉండవచ్చు.

కానీ, కేసీయార్‌ను లక్ష్యంగా చేసుకుంటూ ప్రతిపక్షపార్టీలు దూస్తున్న కత్తులు మరీ విడ్డూరంగా, వితండంగా ఉన్నాయి. తెలంగాణాలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీదే అధికారం అని, కాంగ్రెస్‌కు తొంభై సీట్లు వస్తాయని గత రెండేళ్లుగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మీసం, గడ్డం మెలేస్తున్నారు. జానారెడ్డి, జీవన్ రెడ్డి, డీకే అరుణ, రేవంత్ రెడ్డి లాంటి ‘యోధానుయోధులు‘ గాలిలో అట్ట కత్తులు ఊపుతూ కేసీయార్ ను గద్దె దించుతామని భీషణ భీష్మప్రతిజ్ఞలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో బాహుబలులు చేరారని, కేసీయార్ ను బలి ఇస్తామని గర్జిస్తున్నారు. ఎప్పుడో తొమ్మిది నెలల తరువాత రావలసిన అవకాశం వారికి ముందుగానే వస్తే సంతోషించాల్సింది పోయి ముందస్తు ఎన్నికలను విమర్శించడం దేనికి? నిజానికి అధికార యావ నిలువెల్లా కలిగిన వాడు చివరిరోజు వరకు అధికారాన్ని అనుభవిస్తాడు. తనశక్తి మీద తనకున్న నమ్మకంతో మళ్ళీ ప్రజాతీర్పు కోసమై వెళ్లడం ప్రజాస్వామ్యంలో ఒక సాహసోపేతమైన చర్యగా భావించి కేసీయార్ ను ప్రశంసించాలి.

కేసీయార్ ఎన్నికల ప్రకటన చెయ్యగానే, ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రా, ధర్మబద్ధ ముఖ్యమంత్రా అనే పండిత చర్చలు లేవదీశారు. అసెంబ్లీని ఎందుకు రద్దు చెయ్యాలని ఎత్తిపొడుస్తున్నారు. ఆదరాబాదరాగా గవర్నర్‌ను కలిసి కేసీయార్‌ను తొలగించి రాష్ట్రపతిపాలనను విధించాలని విన్నవించారు. గతంలో కొన్నిసార్లు ముందస్తు ఎన్నికలు వచ్చినపుడు కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో రాష్ట్రపతి పాలనను విధించారా? అంతెందుకు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసినపుడు ఆయన తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగలేదా? ఆయనను తక్షణమే తొలగించి రాష్ట్రపతి పాలన విధించారా?
అంతటితో ఆగకుండా అసెంబ్లీ రద్దు రాజ్యాంగ విరుద్ధం అని ఉన్నత న్యాయస్థానానికి వెళ్లారు కాంగ్రెస్ నాయకులు. అక్కడేమయింది? అసెంబ్లీ రద్దు రాజ్యాంగ ఉల్లంఘన కాదు అని హైకోర్టు స్పష్టం చేసి కేసీయార్ నైతికతకు మరో కిరీటం తొడిగింది. శాసనసభాకాలంలో ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లి ప్రజాతీర్పును కోరవచ్చు అని అరవై ఏళ్ళు అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీకి తెలియకపోవడం శోచనీయం.

ఎన్నికలను నిర్వహించేది ఎన్నికల సంఘం. ఎన్నికల నిర్వహణ కేసీయార్ చేతిలో లేదు. శాసనసభ రద్దు అయిన వెంటనే ఆయనను కొనసాగమని గవర్నర్ కోరి ఉండకపోతే కేసీయార్ తక్షణమే తొలిగి పోరా? రాజీనామాలు, పదవీత్యాగాలు కేసీయార్ కు ఇవాళ కొత్తగా నేర్పాల్సిన విషయమా? తాత్కాలిక ఏర్పాటు అనేది రాజ్యాంగబద్ధం అనే విషయం తెలియదా? మళ్ళీ ఎన్నికలు జరిగేవరకూ ప్రభుత్వం అనేది కొనసాగటం మనం గతంలో చూడలేదా? ఒక్క కేసీయార్ మీద మాత్రమే ఎందుకు ఉక్రోషం?

ఇక కేసీయార్ దుష్పరిపాలన వలన తాము భీమబలులం అయ్యామని ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ పార్టీ – తెలంగాణలో భూస్థాపితం అయిన తెలుగుదేశం పార్టీతో నిశ్చయతాంబూలం ఎందుకు పుచ్చుకున్నట్లు? తమమీద తాము ఎందుకు విశ్వాసాన్ని కోల్పోయినట్లు? కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఉరి వేసుకుంటానని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పేలిన సందర్భాన్ని అంత తేలికగా ఎలా జీర్ణించుకోగలిగారు? కాంగ్రెస్ అధ్యక్షురాలిని ఇటాలియన్ గాంధీ అని విమర్శించిన చంద్రబాబుతో పెళ్లికోసం ఎందుకు తహతహలాడుతున్నారు? తెలుగుదేశం పార్టీ సహకారంతో తెలంగాణాలో అధికారంలోకి రాగలమని ఎలా భావిస్తున్నారు? చంద్రబాబు సహకారంతో అధికారంలోకి వచ్చి ఆయనకు బానిసలుగా బ్రతుకదలచుకున్నారు కాబోలు!

ఇప్పటికే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలమధ్య పొత్తుకుదిరిందని, ఆంధ్రప్రదేశ్‌లో పారించిన అవినీతివరద కారణంగా పేరుకుపోయిన కోట్లాది రూపాయల అక్రమార్జనను చంద్రబాబు తెలంగాణాలో ఎన్నికలలో పెట్టుబడి పెట్టబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, కమ్యూనిస్ట్, ప్రొఫెసర్ కోదండరాం గారి తెలంగాణ జన సమితితో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేసి కేసీయార్ ను ఇంటికి పంపించాలని పధకాలు వేస్తున్నారు. ఉద్యమ సమయంలో ‘ఆంధ్రోళ్లు‘ అని హేళనగా మాట్లాడి, వారిని బండబూతులు తిట్టిన కోదండరాములవారు మళ్ళీ అదే ఆంధ్రావారి పార్టీతో ఎలా కలిసి పనిచేస్తారో అంతుబట్టని రహస్యం. ఇక్కడ ఆంధ్రా లేదు, తెలంగాణ లేదు.. లేనిదల్లా నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి. ఉన్నదల్లా అధికారకాంక్ష, దొడ్డిదోవన గద్దెలెక్కే కుత్సిత స్వభావం, కుటిల యత్నాలు! సాటివాడికి వెన్నుపోటు పొడిచే మానసిక దౌర్బల్యం!

                                                                                                                           – ఇలపావులూరి మురళీమోహన రావు