Home తాజా వార్తలు బడ్జెట్ పై ఉత్కంఠ

బడ్జెట్ పై ఉత్కంఠ

Introduce Budget in Assembly

 

నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ముఖ్యమంత్రి
సంక్షేమం, అభివృద్ధి కోసం ఉమ్మడి జిల్లా ప్రజల ఆశలు
పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు దక్కే అవకాశం
విద్య, వైద్యరంగాలకు నిధులు దక్కే అవకాశం
మౌలిక వసతులకు భారీగా ప్రతిపాదనలు

మన తెలంగాణ/నిజామాబాద్: తెలంగాణలో రెండవసారి అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టే బడ్జెట్ పై ఉత్కంఠత నెలకొంది. ఈ మేరకు కొత్త మంత్రివర్గం కొలు అనంతరం తొలిసారిగా 2019-20 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుండి సై ఆయా రంగాల అవసరాలు, ప్రాధాన్యతల పై ముఖ్యమంత్రి నివేదికలు తెప్పించుకున్నట్లు తెలిసింది. కేబినేట్‌లో ఉమ్మడి జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సైతం ముఖ్యమంత్రికి పలు అభ్యర్థనలు చేసినట్లు సమాచారం. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలతో పాటు ఆయా వర్గాలకు దక్కాల్సి సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రే స్వయంగా కసరత్తు చేసి ట్లు ప్రభుత్వ ద్వారా తెలిసింది. దీంతో జిల్లాలో ప్రస్తుతం పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులన్నింటికి నిధుల కేటాయింపు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో కొత్తగా నిర్మాణం జరుగుతున్న కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాలకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించే అవకాశం ఉంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న ఐటి హబ్‌కు నిధుల కేటాయింపు జరుగుతున్నట్లు సమాచారం. నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా చొరవతో ఐటి గబ్‌తో పాటూ నగర సుందరీకరణకు, భూగర్భ మురికినీటి పనుల పూర్తికి నిధులు దక్కే అవకాశం ఉంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో జక్రాన్‌పల్లి వద్ద ఏరోడ్రమ్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి హామీ ఇవ్వగా నిధుల కేటాయింపు పై స్థానిక ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి హామీ మేరకు కొత్తగా నల్లవాగు సాగునీటి ప్రాజెక్టు నిధుల కేటాయింపు దక్కే అవకాశం ఉండగా లెండీ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సైతం నిధుల కోసం స్థానిక ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. బాన్సువాడ డివిజన్ కేంద్రంతో పాటూ ఎల్లారెడ్డి, బోధన్, మరికొన్ని చోట్ల ఆసుపత్రుల స్థాయి పెంపుకోసం ప్రతిపాదనలు పంపబడ్డాయి.

కొత్తగా ఏర్పడిన భీమ్‌గల్ మున్సిపాలిటీకి స్థానిక మంత్రి భారీ నిధులను సాధిస్తారన్న చర్చ జరుగుతుంది. వీటితో పాటు మోడల్ స్కూళ్ళకు పెరిగిన డిమాండ్‌తో మరిన్ని స్కూళ్ళ ఏర్పాటుకు సైతం నిధులు కేటాయింపు జరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు. మిషన్ భగీరథ పనులు దాదాపు 85 శాతం పూర్తయినట్లు అధికారులు వెల్లడిస్తుండగా ప్రతీ ఇంటికి నీరు చేరేలా పనుల పూర్తికి నిధులు కేటాయిస్తారని భావిస్తున్నారు. సంక్షేమంలో ముఖ్యమైన డబుల్ బెడ్‌రూమ్‌ల ఇండ్ల నిర్మాణంతో పాటు పెన్షన్‌లకు నిధుల వరద పారే అవకాశం ఉంది. తెలంగాణ యునివర్సిటీలో మరిన్ని కోర్సుల పెంపుదలతో పాటు మౌళిక వసతుల కల్పనకు నిధులు దక్కుతాయని ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి జిల్లాకు ఎన్నో వరాలు ఇస్తారోనన్న ఆశతో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ప్రజలు ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.

Telangana CM KCR To Introduce Budget in Assembly Today