Search
Wednesday 26 September 2018
  • :
  • :

జోనల్ కు సై

Telangana CM KCR To Visit Delhi For Approval On State Zonal System

కొత్త జోనల్ వ్యవస్థకు రెండు, మూడు రోజుల్లో రాష్ట్రపతి ఆమోదం

స్థానిక యువతకే 95% ఉద్యోగాలు 

ఎఫ్‌ఆర్‌బిఎం రుణపరిమితి పెంపు, వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధులపై ప్రధాని సానుకూల స్పందన
నేడు ఆర్థికమంత్రి జైట్లీతో, రేపు నితిన్ గడ్కరీతో భేటీ                                                                                                హైకోర్టు విభజనపైనా చర్చ
దాదాపు అరగంట పాటు సాగిన భేటీ                                                                                                                        తొలిరోజే ఫలప్రదమైన సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన

మన తెలంగాణ / న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన విజయవంతమైందని, రాష్ట్రానికి సంబంధించి ప్రస్తావించి న అంశాలపై ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారని టిఆర్‌ఎస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సుమారు అరగంటపాటు భేటీ అయిన సిఎం కెసిఆర్ కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం, వెనకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధులు, ఎఫ్‌ఆర్‌బిఎం రుణపరిమితి పెంపు తదితర అంశాలపై చర్చించారని, ప్రధాని కూడా సానుకూలంగా స్పందించారని పేర్కొన్నాయి. వీటితో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగులో వున్న అంశాలను కూడా ప్రస్తావించారని తెలిపారని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్థికపరమైన అంశాలపై కేంద్ర ఆర్థికమం త్రి అరుణ్ జైట్లీతో సమావేశం కావాల్సిందిగా ప్రధాని సూచించారని, ఆదివారం ఉదయం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చిస్తారని ఎంపి వినోద్‌కుమార్ తెలిపారు. రీజినల్ రింగురోడ్డు విషయంలో కేంద్ర రవాణామంత్రి నితిన్ గడ్కరీతో సోమవారం సమావేశమవుతారన్నారు. ఇంతకాలం పెండింగ్‌లో ఉన్న అంశాలు తాజా పర్యటనలో మోడీతో భేటీ అయిన తర్వాత సత్వరం పరిష్కారమవుతాయన్న ధీమా ఏర్పడిందని తెలిపారు.

రెండు, మూడు రోజుల్లో జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం : కొత్త జోనల్ వ్యవస్థను ప్రధానితో ప్రస్తావించిన కెసిఆర్, ఈ అంశంలో జాప్యం జరుగుతూ ఉందని, ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో కొత్తగా నియామకాలు చేపట్టడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ప్రధానికి వివరించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాష్ట్రపతి 371 డి పేరుతో ఉత్తర్వులను జారీ చేశారని, ఇప్పటికీ అవే అమలవుతున్నాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో పాటు కొత్త జోనల్ వ్యవస్థకు కూడా శ్రీకారం చుట్టి స్థానికులకు 95% మేర ఉద్యోగ అవకాశాలు ఇచ్చేలా చొరవ తీసుకున్నదని, ఇది అమల్లోకి రావాలంటే 371 డి ఉత్తర్వులకు సవరణ చేయాల్సి ఉంటుందని వివరించారు. ఆ ప్రక్రియ పూర్తయితేనే తెలంగాణలో కొత్తగా నియామకాలకు వీలు కలుగుతుందని, తెలంగాణ ఉద్యమం రావడానికి ప్రధాన కారణాల్లో ఉద్యోగ నియామకాల్లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కూడా ఒకటని వివరించారు. రెండు. మూడు రోజుల్లోనే రాష్ట్రపతి సవరణ ఉత్తర్వులు వెలువడేలా చొరవ తీసుకుంటానని ప్రధాని స్పష్టమైన హామీ ఇచ్చారని ఎంపి వినోద్‌కుమార్ తెలిపారు.

వెనకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధులు : వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా ఇవ్వాల్సిన నిధుల్లో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.450 కోట్లను వెంటనే విడుదల చేయాలని ప్రధానికి సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా 2016లో ఒక్కో జిల్లాకు రూ. 50 కోట్ల చొప్పున మొత్తం తొమ్మిది జిల్లాలకు రూ. 450 కోట్లు విడుదలైందని, ఆ తర్వాత వరుసగా రెండు విడతల్లో మరో రూ. 900 కోట్లు విడుదలయ్యాయని ప్రధానికి వివరించారు. ఈ నిధుల వినియోగానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సైతం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని గుర్తుచేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్న తర్వాత నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగాయని వివరించిన కెసిఆర్ రాష్ట్ర ఆర్థిక వనరులపై భారం పడిందని, ఈ సమయంలో రాష్ట్రానికి రావాల్సిన రూ. 450 కోట్లు ఉపయుక్తంగా ఉంటుందని, వీలైనంత తొందరగా విడుదల చేసేలా చొరవ తీసుకోవాలని కోరారు.

ఎఫ్‌ఆర్‌బిఎం రుణ పరిమితి పెంపు : పద్నాల్గవ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఎఫ్‌ఆర్‌బిఎం కింద తెలంగాణ ప్రభుత్వం తన రాష్ట్ర జిడిపి (జిఎస్‌డిపి)లో 3.5% మేరకు రుణాలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రధానికి సిఎంకెసిఆర్ విజ్ఞప్తి చేశారు. అన్ని రాష్ట్రాలకూ ఎలాగూ 3% మేర రుణాలు తీసుకునే వెసులుబాటు ఉందని, కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి మూడు త్రైమాసికాలకు సరిపోయే రుణాలను ఒకేసారి తీసుకునేందుకు అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు. ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం మిగులు బడ్జెట్ కలిగి ఉన్న రాష్ట్రాలకు 3%కి అదనంగా మరో 0.50% మేర రుణాలను పొందే వెసులుబాటు ఉన్నందును ఆ అర్హతలను సాధించిన తెలంగాణ మొత్తం 3.5% రుణాలను పొందేందుకు త్వరితగతిన అనుమతి మంజూరు చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం అనేక వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టి ప్రతీ పొలానికి సాగునీటిని ఇవ్వాలనుకుని ప్రాజెక్టులను నిర్మిస్తోందని, ప్రతీ ఇంటికీ రక్షిత త్రాగునీటి కోసం మరో ప్రాజెక్టును చేపట్టిందని, వీటికి రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఆర్థిక వనరులను వెచ్చించాల్సి వస్తోందని వివరించారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర జిడిపిలో 3.5% మేర రుణాలను పొందేలా వీలైనంత త్వరగా అనుమతి ఇవ్వాలని కోరారు. మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన వడ్డీ సబ్సిడీలో, రైతులకు ఇవ్వాల్సిన వడ్డీ సబ్సిడీలొ కేంద్రం వాటాను విడుదల చేయాలని కోరారు.

ప్రధానికి విజ్ఞాపన పత్రాలు : హైకోర్టును సత్వరం విభజించాలని, హైదరాబాద్ నగరం చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డుకు నిధులను కేటాయించాలని, జాతీయ రహదారుల విస్తరణ, కొత్త సచివాలయం నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములను కేటాయించాలని ముఖ్యమంత్రి కోరారు. వీటిపై ఇప్పటికే అనేకసార్లు తమ పార్టీ ఎంపిలు అటు పార్లమెంటులో ప్రస్తావించారని మరోవైపు ఆయా శాఖల మంత్రులకు విజ్ఞప్తి చేశారని సిఎం గుర్తుచేశారు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలకు వీలైనంత త్వరగా పరిష్కారం, ఆమోదం లభించేలా చొరవ చూపాలని, ఇందులో భాగంగా ఆయా మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీచేయాలని ప్రధానిని ముఖ్యమంత్రి కోరారు.

Comments

comments