Home తాజా వార్తలు త్వరలో సిఎం ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ పథకం

త్వరలో సిఎం ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ పథకం

CM-Overseas-Scholarship

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ సిఎం ఓవర్‌సీస్ స్కాలర్ షిఫ్ పథకం 2019 దరఖాస్తుల స్వీకరణకు త్వరలో నోటిఫికేషన్‌జారీ చేయాలని భావిస్తున్నారు. ఎన్నిక కోడ్ నేపథ్యంలో నిల్చిన ప్రక్రియను ప్రారంభించే దిశగా రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కమీనరేట్ ప్రణాళిక రూపొందిస్తుంది. మైనార్టీ సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ బాలసుబ్రమణ్యం రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన మైనార్టీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యభాస్యం అందించే లక్షంగా 2015-2016 ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు. విదేశాలోని గుర్తింపుపొందిన విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యాభాస్యం కోసం ప్రత్యేకంగా సిఎం కెసిఆర్ ఓవర్‌సిస్ స్కాలర్‌షిఫ్ పథకం ప్రవేశపెట్టాలని జారీ చేసిన అదేశాల మేరకు మార్గదర్శకాలను రూపొందించి, ఐదేళ్లుగా దిగ్విజయంగా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రారంభంలో ఈ పథకం క్రింద ఒక్కొక్క విద్యార్థికి రూ.10లక్షలను , రూ.60వేల విమాన ఛార్జీలను మంజూరు చేయగా నేడు రూ.20లక్షలతో పాటు ఒక విడుత విమాన ఛార్జీ క్రింద రూ 60వేలను కూడా మంజూరు చేస్తున్నామన్నారు. 2018-2019 ఆర్ధిక సంవత్సరానికి గాను రూ.100కోట్ల నిధులను కేటాయించారని తెలిపారు. అయితే ఇందులో రూ.75కోట్ల విడుదల కాగా, ఈ పథకానికి రూ.74.77 కోట్లను కేటాయించాలని ఇటివల ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వివరించామని తెలిపారు. ఇదిలా ఉండగా 2019-2020 ఆర్ధిక సంవత్సరానికి రూ.18.75 కోట్ల నిధులు మంజూరు చేశారు.
ఎంపికైన విద్యార్థుల సంఖ్య ఇదే..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సిఎం ఓవర్‌సిస్ స్కాలర్ షిప్ పథకంలో 2015 జూలై/ఆగస్టు మాసంలో తోలి విడుత 237 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా 226 మందికి మంజూరు చేశారు. 2016 జనవరి/ఫిబ్రవరి రెండో విడుతలో 241 మంది దరఖాస్తులను సమర్పించగా, 221 మంది విద్యార్థులకు అమో దం లభించింది. అయితే 2016 మూడవ విడుత సందర్భంగా సిఎం ఓవర్‌సిస్ పథకం ఆర్ధిక సహాయం రూ.10లక్షల నుంచి రూ.20లక్షలకు పెంచారు. ఈ మేరకు 2016 జూలై/ఆగస్టు మూడవ విడుతలో 141 మంది విద్యార్థులు దరఖాస్తులు ఇవ్వగా 140 మంది విద్యార్థులకు మంజూరు చేశారు. 2017 నాలుగవ విడుతలో 355 మంది విద్యార్థులకు గాను 351 మంది విద్యార్థుల దరఖాస్తుల ప్రాసెస్ పూర్తి చేశారు. 2018 జూలై/ఆగస్టు 5వ విడుతలో 252 విద్యార్థుల దరఖాస్తులను, 2018 ఆగస్టు/సెప్టెంబర్ 6వ విడుతలోని 248 మంది విద్యార్థుల దరఖాస్తులను అమోదించారు.

Telangana CM Overseas Scholarship Scheme 2019