Home కలం తెలంగాణ సాంస్కృతిక జాగృతి

తెలంగాణ సాంస్కృతిక జాగృతి

బాన్సువాడలోని ఎస్‌ఆర్‌ఎస్‌కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం పక్షాన చరిత్రను పదిలపరుచుకొనే ఆశయంగా ‘తెలంగాణలో సాంస్కృతిక జాగృతి (1901-1956)’ పేరిట జాతీయ సదస్సు నిర్వహించారు. అందులో నిష్ణాతులైన వారిచే వివిధ కోణాల్లో ప్రసంగింప చేశారు. సదస్సు కనీనర్ డా.హెచ్. వామనమూర్తి అందిస్తున్న నివేదిక –

National-Conference

చరిత్రను జాగ్రత్తగా పదిలపరుచుకోవడం మన బాధ్యత. చరిత్ర పునాదులపై భవిష్యత్తు నిర్మితమవుతుంది. చరిత్రను పదిల పర్చుకోలేకపోతే వర్తమానం, భవిష్యత్తు కాలగర్భంలో కలిసి పోతారు. గతంలో జరిగిన విషయాలను వర్తమానంలో అవగతం చేసుకుంటూ భవిష్యత్తుకు పునాదులను నిర్మించవలసిన బాధ్యత నేటితరంపై ఉంది. ఈ కృషి ఫలితం సాంస్కృతిక పునరుజ్జీవనం లో విజ్ఞాన భాండాగారంగా భవిష్యత్తు తరాలకు ఉపయుక్తమవుతుంది.

తెలంగాణలో జరిగిన పోరాటాలు భూమి కోసం, భుక్తి కోసం, మనుగడ కోసం జరిగాయి. ఈ విషయాలన్నీ విశ్లేషిస్తూ గతంలో జరిగిన కృషిని భద్రప ర్చడం కోసం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సౌజన్యంతో బాన్సువాడలోని ఎస్.ఆర్.ఎన్.కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలం గాణ సాంస్కృతిక జాగృతి జాతీయ సదస్సు మార్చి 14,15 తేదీల్లో ఘనంగా జరిగింది. తెలంగాణలో 1901 నుండి 1956 వరకు జరిగిన సాహిత్య, సాంస్కృతిక చైతన్యంపై పలువురు పరి శోధకులు, పరిశోధక విద్యార్థులు ఈ సదస్సులో పత్ర సమర్పణ చేశారు. ఈ సదస్సు భావితరాల పరిశోధకులకు, చరిత్రకారులకు, విద్యార్థులకు వెలుగు చూపేదిగా నిలవాలని మా ఆశయం.

ఈ సదస్సు అంశం ‘తెలంగాణలో సాంస్కృతిక జాగృతి (1901 -1956)’. తెలంగాణ చరిత్రలో 1901 కీలకమైన సంవత్సరం. అదే ఏడాది హైదరాబాద్ నగరంలోని రెసిడెన్సీ ప్రాంతంలో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయ స్థాపన జరిగిం ది. అప్పటి నుండి తెలంగాణలో ఆధునిక చైతన్యదశ ఆరంభ మైంది. క్రమేపీ తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర జనసంఘం, ఆంధ్ర మహాసభ, ఆంధ్ర సారస్వత పరిషత్తు వంటి సంస్థలు ప్రారంభమై తెలంగాణ సాంస్కృతిక జాగృతిలో కీలకపాత్ర పోషించాయి. 1956వ సంవ త్సరంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగింది. అందువల్ల 1901 నుండి 1956 వరకు కాలవ్యవధిని ఈసదస్సు కోసం ఎంపిక చేసుకోవడం జరిగింది.

ఈ జాతీయ సదస్సు మార్చి 14వ తేదీ ఉదయం ప్రారంభమైంది. ఈ సదస్సు మొదటి రోజు సమావేశాలకు కళాశాల ప్రధానాచార్యులు రామసుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు. తెలంగాణ విశ్వవిద్యాలయ తెలుగు విభాగాధిపతి ఆచార్య కనకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు విభాగాధిపతి ఆచార్య వెలుదండ నిత్యానందరావు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ చరిత్ర విభాగ సహాయ ఆచార్యులు డా. అంజయ్య, ప్రముఖ కవి గోశిక్ నరహరి ఆత్మీయ అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ విశ్వవిద్యాలయానికి చెందిన డా.కె. లావణ్య, డా.వి.త్రివేణి, ఉస్మానియా విశ్వ విద్యాలయానికి చెందిన డా. రఘు, అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి చెందిన డా.ఎన్.రజని, ప్రముఖ రచయిత్రి డా.కొండపల్లి నీహారిణి అతిథులుగా పాల్గొన్నారు.

తెలుగులో శాస్త్ర, సాంకేతిక పరిభాషను విరివిగా ఉపయోగించాలని సదస్సు ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ విశ్వవిదాలయ తెలుగు విభాగాధిపతి ఆచార్య కనకయ్య అన్నారు. నిజాం పరిపాలన నుండి విముక్తమైన అనంతరం కూడా చాలా కాలం ఉర్దూ పరిపాలనభాషగా కొనసాగిందని ఆయన చెప్పారు.

తెలంగాణకు, కోస్తా ప్రాంతానికి విద్యాపరమైన తేడాలు ఉన్నాయని విశిష్ట అతిథి, ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు విభాగాధిపతి ఆచార్య వెలుదండ నిత్యానందరావు వివరించారు. కోస్తా ప్రాంతంలో 1870లో పానుగంటి లక్ష్మీనరసింహారావు మొట్టమొదటిసారిగా ఉన్నత విద్య అభ్యసిస్తే, తెలంగాణలో 1942లో పల్లా దుర్గయ్య మొట్టమొదటి ఎం.ఎ. పూర్తి చేశారని ఆయన చెప్పారు. ఈ విధంగా చూస్తే తెలంగాణ 72 సంవత్సరాలు వెనుకబడి ఉందని, ఆ విధంగా తెలంగాణ కనీసం మూడు తరాల వెనుకంజలో ఉందని ఆయన వివరించారు. దీనికి కారణం ఆంధ్ర ప్రాంతంతో పోలిస్తే తెలంగాణలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశాలు తక్కువగా ఉండడం అని ఆయన విశ్లేషణాత్మకంగా పేర్కొన్నారు.

ఈ ప్రభావం సాహిత్యంపై కూడా పడిందని ఆయన చెప్పారు. చదువులో భాగంగా ఆలివర్ గోల్డ్‌స్మిత్ రచన ‘వికార్ ఆఫ్ వేక్‌ఫీల్డ్’ను చదువుకున్న కందుకూరి వీరేశలింగం ‘రాజశేఖర చరిత్ర’ నవల రాశాడని ఆయన అన్నారు. తెలంగాణలో ఆంగ్ల విద్యావకాశాలు లేకపోవడం ఆ కాలంలో సాహిత్య సృజన ఆంధ్రతో పోలిస్తే విస్తృతంగా జరగకపోవడానికి ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో సాహిత్య, సాంస్కృతిక చైతన్యానికి కొందరు ఆంధ్రులు కూడా ఇతోధికంగా కృషి చేశారని, అంబడిపూడి వెంకటరత్నం మొదలైన వారిని ఇందుకు ఉదాహరణగా నిత్యానందరావు పేర్కొన్నారు.

ఒక సభలో జరిగిన అవమానం నుండి ఆవిర్భవించిన ఆంధ్ర మహాసభ తెలంగాణ సాహిత్య వికాసానికి ఎంతో కృషి చేసిందని అంబేద్కర్ విశ్వ విద్యాలయానికి చెందిన డా.ఎన్.రజని చెప్పారు. తెలంగాణలో ఆర్య సమాజానికి చెందిన నాయకులు ప్రజలను చైతన్యవంతులను చేశారని ప్రముఖ రచయిత్రి డా.కొండవల్లి నీహారిణి అన్నారు. ఆరసమాజం నుండి ఆంధ్ర మహాసభ, ఆంధ్ర జనసంఘం ఏర్పడ్డాయని తెలంగాణ విశ్వ విద్యాల యానికి చెందిన డా. లావణ్య వివరించారు. 1934-35 మధ్య నిజామాబాద్‌లో ఆర్యసమాజం ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేయడంలో గ్రంథాలయాల పాత్ర ఎంతో ఉందని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన డా.రఘు చెప్పారు. తెలంగాణలో గ్రంథాలయాల వ్యాప్తి కోసం వట్టికోట ఆళ్వారుస్వామి మొదలైనవారు కృషి చేశారని ఆయన వివరించారు.

తెలంగాణలో రచయిత్రులు, కవయిత్రులు సాహిత్య వికాసానికి చేసిన కృషిని తెలంగాణ విశ్వ విద్యాలయానికి చెందిన డా.వి.త్రివేణి విశ్లేషించారు. నన్నయ్య భారత రచనకు సహాయం చేసిన నారాయణ భట్టు జన్మించిన ప్రాంతం బాన్సువాడ అని బాన్సువాడకు చెందిన ప్రముఖ కవి గోశిక్ నరహరి చెప్పారు.
సదస్సులో భాగంగా రెండో రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ విశ్వ విద్యాలయ సహాయ ఆచార్యులు డా.గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి హాజరయ్యారు.

ఆత్మీయ అతిథిగా ప్రముఖ కవి. డా.నాళేశ్వరం శంకరం పాల్గొన్నారు. వివిధ సెషన్లను డా.ప్రభాకర్, డా. గంగా ధర్ నిర్వహించారు. సదస్సు కన్వీనర్ డా.హెచ్.వామనమూర్తి, కో కన్వీనర్ డా.యాదయ్య సమన్వయం చేశారు.

తెలంగాణ సాహిత్య చైతన్యంలో పత్రికల పాత్ర ప్రశంసనీ యమని రెండో రోజు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ విశ్వవిద్యాలయ సహాయ ఆచార్యులు డా.గుమ్మన్న గారి బాలశ్రీనివాసమూర్తి అన్నారు. తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక చైతన్యంలో నీలగిరి, సుజాత, శోభ, మొదలైన పత్రి కల కృషిని ఆయన సోదాహరణంగా విశ్లేషించారు. మారుమూల గ్రామం నుండి ప్రచురణలు నిర్వహించిన ఘనత ఒద్దిరాజు సోదరులదని ఆయన వివరించారు. వలసాధిపత్య అణచివేతలతో దీర్ఘకాలం తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని ఆత్మీయ అతిథిగా హాజరైన ప్రముఖ కవి. డా.నాళేశ్వరం శంకరం అన్నారు.

మానవ సాంస్కృతిక పరిణామంలోని వివిధ దశలను ఆయన వివరించారు. విభిన్న ప్రక్రియల్లో రచనలు చేయడంతోపాటు వివిధ కళల్లో ఒద్దిరాజు సోదరులు అద్వితీయ ప్రతిభ కనబరిచారని ప్రముఖ విశ్లేషకులు డా.రాయా రావు సూర్యప్రకాశ్ రావు అన్నారు. తెలంగాణ సాంస్కృతిక చైతన్యంలో ఒద్దిరాజు సోదరుల కృషిని ఆయన వివరించారు. తెలంగాణలో 1901 నుండి 1956 వరకు జరిగిన సాహిత్య, సాంస్కృతిక కృషిని ప్రముఖ కవి డా.బెల్లం కొండ సంపత్ కుమార్ విశ్లేషించారు.ఈ సదస్సులో డా.జయప్రకాశ్, డా. యాదయ్య, డా.సుధా లక్ష్మణ్ కుమార్, గంజి శశిధర్, చంద్రశేఖర్, లక్ష్మ య్య, వెంకటరెడ్డి, ధరూరి శారద, మహేందర్ రెడ్డి మొదలైనవారు పత్ర సమ ర్పణ చేశారు. వివిధ విశ్వ విదాలయాల ఆచార్యులు, అధ్యాపకులు, పరిశో ధకులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సదస్సులో 1901 నుండి 1956 మధ్య కాలంలో తెలంగాణలో సాంస్కృతిక వికాసంపై పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. ఈ సాధికారక సమీక్ష ఫలితంగా తెలంగాణ సాంస్కృతిక వికాసంపై విశ్లేషణతో కూడిన రచనలతో ఒక ప్రత్యేక సంచిక వెలువడనుండి భవిష్యత్తులో తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక చైతన్యంపై పరిశోధనలు నిర్వర్తించే పరిశోధకులకు, చరిత్రకారులకు, విద్యార్థులకు ఈ సదస్సు దిక్సూచిగా నిలుస్తుంది.