Home తీర్పు-2018 ఆసక్తిగా ఎన్నికల.. రణరంగం

ఆసక్తిగా ఎన్నికల.. రణరంగం

హామీలు, అభివృద్ధే ఎజెండాగా టిఆర్‌ఎస్ ప్రచారం
అయోమయం, గందరగోళంలో కాంగ్రెస్, టిడిపి అభ్యర్థులు

మన తెలంగాణ /హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల రణరంగం ఆసక్తిగా మారింది. పలు పార్టీల ప్రచార హోరు పెరిగింది. హామీలు, వాటి అమలు, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం తదితరాలే ఎజెండాగా టిఆర్‌ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంటే విపక్షంగా ఉన్న ప్రజా కూటమి మాత్రం అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామనే హామీలకు పరిమితం కావాల్సి వచ్చింది. ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే కాంక్ష తో కుప్పలు తెప్పలుగా హామీలు గుప్పిస్తున్నాయని విపక్షాలపై అధికార టిఆర్‌ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. ఓటర్ల విశ్వాసం పొందడం కష్టం కావడంతో కాంగ్రెస్ తమ అధినాయకులతో అసత్య ఆరోపణలు చేయిస్తూ ప్రజలను బుట్టలో పడేయడానికి చూస్తున్నారని, వీటిని ప్రజలు నమ్మే స్థితిలో లేరని టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు. అన్ని పార్టీల నేతలు చెప్పే మాటల్లో నిజాయితీ ఎంత ఉంది, వారు ఇచ్చే హామీలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని ప్రజలు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటున్నారని వారు పేర్కొంటున్నారు.

కెసిఆర్ సభల్లో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారని, ఏ రాజకీయ నాయకుడు వచ్చి చెప్పినా వినాలని, ఆ తరువాత దానిపై వారిలో వారే చర్చించుకుని నిజమెంతో తెలుసుకోవాలని, ఆగమాగం కావద్దని ప్రతి సభలోనూ ఓటర్లకు ఆయన అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు షెడ్యూల్ రాకముందే రెండునెలల పాటు ప్రచారం నిర్వహించి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారని షెడ్యూల్ వరకు అభ్యర్థులను ప్రకటించలేని మహాకూటమి ప్రస్తుతం ప్రచారంలో ప్రజలను నమ్మించడంలో వెనుకబడిపోయిందని టిఆర్‌ఎస్ అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు జరిగిన సభలకు భిన్నంగా ప్రస్తుతం జరుగుతున్న సభల్లో కెసిఆర్ వ్యూహాలను రూపొందించారని, అందుకే ప్రజలను ఆకట్టుకోవడంలో కెసిఆర్ సఫలీకృతులయ్యారని టిఆర్‌ఎస్ వర్గాలు ధీమాతో ఉన్నాయి. ప్రతిపక్షాలను గుక్కతిప్పుకోకుండా ఎత్తులు, వ్యూహాలను రచించడంలో కెసిఆర్ విజయవంతమయ్యారని, అందుకే సభలకు ప్రజలు భారీగా తరలివస్తున్నారని గుర్తుచేశారు.

మొదట జరిగిన సభల్లో టిఆర్‌ఎస్ చేసిన అభివృద్ధితో పాటు చేయాల్సిన పనులను, ఎన్నికలకు ఎందుకు వెళ్లాల్సిందో ప్రజలకు తెలియచెప్పడంలో కెసిఆర్ సక్సెస్ సాధించారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మహాకూటమికి చెందిన టికాంగ్రెస్, టిటిడిపి, బిజేపి నాయకులు జాతీయ నేతలను రాష్ట్రానికి తీసుకొచ్చి టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై అబద్ధాలు మాట్లాడించడం ఓటర్లు గమనిస్తున్నారని, అందుకే వారికి గట్టి కౌంటర్ ఇవ్వడంలో కెసిఆర్‌తో పాటు టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ముందున్నారని దీంతో కూటమి మాటలు అబద్ధాలని ప్రజలకు అర్థమవుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఉద్యమ ప్రస్థానం నుంచి నాలుగున్నర ఏళ్ల పాలనను టిఆర్‌ఎస్ పార్టీతో పాటు కెసిఆర్ సభల్లో వివరించడం కలిసొచ్చే అంశంగా పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. అసెంబ్లీ రద్దు చేసినప్పటి నుంచి కూటమి నేతలంతా గందరగోళ పరిస్థితి అని అభ్యర్థుల ఎంపిక దగ్గరి నుంచి కూటమి జతకట్టే వరకు వారికి సరైన అవగాహన లేదని వారు ఆరోపిస్తున్నారు. అందుకే ప్రచారంలో తమ అభ్యర్థులే ముందంజలో ఉన్నారని ప్రతి నియోజకవర్గంలో జరిగే ఆశీర్వాద సభలు విజయవంతం అవుతున్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Telangana Elections 2018