Home తాజా వార్తలు మావి స్కీములు వారివి శ్కాములు

మావి స్కీములు వారివి శ్కాములు

These elections are test of Telangana self-esteem

 

ఈ ఎన్నికలు తెలంగాణ ఆత్మగౌరవానికి పరీక్ష : కెటిఆర్

మన తెలంగాణ /సిరిసిల్ల: ప్రస్తుత ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కాదని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని, భవిష్యత్తులో ఢిల్లీ గద్దెపై ఎవరు కూర్చోవాలో నిర్ణయించే ఎన్నికలు జరుగుతున్నాయని మంత్రి కెటిఆర్ అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి రోడ్‌షో ప్రారంభించిన ఆయన అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు. ప్రస్తుతం తాను సిరిసిల్ల ఎమ్మెల్యేగా ప్రపంచ గుర్తింపు పొందుతున్నానని సిరిసిల్లలో చేసిన అభివృద్ధ్ది చారాణ మాత్రమేనని, ఇంకా బారాణ అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం చూసింది ట్రైలర్ మాత్రమేనని చూడాల్సిన సినిమా ముందుందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల పట్టణాన్ని, నియోజకవర్గాన్ని నెంబర్ వన్‌గా ఉంచాలన్నదే తన లక్షమన్నారు. ప్రస్తుత ఎన్నికలు ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి పదవుల కోసం కాదని తెలంగాణ ఆత్మగౌరవానికి ఒక పరీక్ష అని అందులో ప్రజలు నెగ్గాలన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే చీకటవుతుందని, హిందూ ముస్లిం ఘర్షణలు పెరుగుతాయని, తెలంగాణ-ఆంధ్రా ప్రజల మధ్య విభేధాలు పెరుగుతాయని, పరిపాలన సాధ్యం కాదని అనేక రకాలుగా విమర్శించారన్నారు. సీఎం కెసిఆర్ దేశం మొత్తం తెలంగాణ దిక్కే చూసేలా పరిపాలన సాగిస్తున్నారన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి ఆలోచించని పథకాలన్నింటిని కెసిఆర్ ఆచరణలో చేసి చూపించారన్నారు.

71ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో కాంగ్రెస్, బిజెపిలే పాలించాయని ఇప్పటికీ వేల గ్రామాల్లో కరెంట్, త్రాగునీరు, రోడ్లు, ఎందుకు లభించడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో వంద సీట్లు గెలిచి ఢిల్లీ గద్దెపై ఎవరు కూర్చోవాలో నిర్ణయాధికారం టిఆర్‌ఎస్‌కే ఉంటుందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశానికే తెలంగాణ పాఠాలు నేర్పుతుందని అన్నారు. బడ్జెట్‌లో 43 శాతం పేదలకే అందిస్తున్నామన్నారు. ఆదాయం పెంచడం, పేదలకు పంచడం తమ ధ్యేయం అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 43 లక్షల మందికి రకరకాల పెన్షన్లు అందిస్తున్నామని మళ్లీ అధికారంలోకి వస్తే వయోపరిమితిని 57 సంవత్సరాలకు తగ్గించి మరో 8 లక్షల మందికి పెన్షన్లు అందేలా చూస్తామన్నారు. లక్ష ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి లక్ష తొమ్మిది వేల ఉద్యోగాలకు పచ్చజండా ఊపామన్నారు. 87 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి 38 వేలు భర్తీ చేశామన్నారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో పదివేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నారు.

ఒక్క బక్క కెసిఆర్‌ను ఓడించడానికి అనేక మంది పహిల్వాన్‌లు జట్టు కట్టారన్నారు. నరేంద్రమోడీ నిజామాబాద్‌లో కరెంట్ కొరత ఉందంటే తాను తీగలు పట్టుకుని పరీక్షించమని అన్నానన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందంటున్నాడని, దేశంలో ఎమర్జెన్సీని విధించిన ఇందిరాగాంధీ మనవనిగా అతనికి మాట్లాడే అర్హత లేదన్నారు. సోనియాను మాట వరుసగా అమ్మ బొమ్మ తెలంగాణ ఇవ్వలేదనందుకు అనేక మంది తనపై ధ్వజమెత్తారని దేశానికి శని, అనకొండ, ఇటలీ మాఫియా వంటి పదాలతో తిట్టిన చంద్రబాబుతో రాహుల్ గాంధీ ఎలా జతకట్టాడన్నారు. గ్రామాల్లో ఏడు కండువాలు వేసుకుని తిరిగే మహాకూటమి నేతలను గంగిరెద్దుల వాళ్లలా చూస్తున్నారన్నారు.

9 గంటల కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ హయాంలో 6 గంటలకు కూడా ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ అందుతుందన్నారు. సిరిసిల్లలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్న కాలంలో కెసిఆర్ 50 లక్షల రూపాయల చందాలు పోగుచేసి ఇచ్చిన విషయాన్ని జ్ఞాపకం చేశారు. నేతన్నల ఆత్మహత్యలు ఆగిపోవడానికి బతుకమ్మ, ఆర్వీఎం ఆర్డర్లు ఇచ్చి నేతన్నల జీవితాల్లో మార్పు తెచ్చానన్నారు. ఏడు, ఎనిమిది వేల నెలసరి వేతనం పొందే నేతన్నలు 15 నుండి 20 వేల రూపాయల ఆదాయం పొందుతున్నారన్నారు. రాబోయే ఆరు నెలల్లో నర్మాల చెరువును గోదావరి జలాలతో నింపి లక్ష ఎకరాలకు నీరందిస్తామన్నారు. రెండేళ్లలో సిరిసిల్లకు రైలు కూత వినిపించేలా చేస్తానన్నారు. సిరిసిల్లలో రింగ్ రోడ్డు , ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల నిర్మిస్తామన్నారు.

సర్వేల పేరిట ఆగమాగం కావద్దని 70 నియోజకవర్గాలు తిరిగానని సెంచరీ కొట్టేది, వంద సీట్లు దాటేది తెరాసయేనన్నారు. లగడపాటి , చంద్రబాబు, రాహుల్‌గాంధీలు తట్టా బుట్టా సర్దుకుని ఎవరి జాగలకు వాళ్లే పోతారన్నారు. పేపర్లలో పాచిపోయే రాతలు రాసేవారిని నమ్మవద్దన్నారు. ఉత్తుత్తి కుమార్‌రెడ్డి గడ్డం గీసుకోనని, గబ్బర్‌సింగ్‌ను అంటే ప్రజలు నమ్మడం లేదన్నారు. బీరాలు పలికిన కాంగ్రెస్ నేతలు పరిస్థితులు చుక్కెదురు కావడంతో దిక్కుతోచక నియోజకవర్గాలు దాటడం లేదన్నారు. రాహుల్ గాంధీ సీట్లిస్తే , చంద్రబాబు నోట్లిస్తే తెలంగాణలో ఓట్లు వేసేది ఎవరని కెటిఆర్ నిలదీశారు. ప్రజలందరూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఈవిఎంలలో కుయ్యిమనేలా శబ్దం చేస్తే, కాంగ్రెస్ నేతల గూబ గుయ్యిమనాలని అన్నారు.

ఈ గట్టున కారుంటే ఆ గట్టున బేకార్‌గాళ్లు ఉన్నారని, ఈ పక్కన కరెంట్ ఇచ్చిన వాళ్లుంటే ఆ పక్కన కాల్చి చంపిన వాళ్లున్నారని, ఈ పక్కన నేతన్నలను కాపాడుకున్న వారుంటే ఆ పక్కన ఆత్మహత్యలు జరిగితే కళ్లప్పగించి చూసినవారున్నారని అన్నారు. వ్యవసాయం పండుగన్న వారు ఈ పక్కనుంటే దండుగన్న వారు ఆ పక్కనున్నారన్నారు. ఈ పక్కన గులాబీలు ఉంటే ఆ పక్కన ఢిల్లీకి గులాములు ఉన్నారన్నారు. ఈ పక్కన స్కీములుంటే ఆ పక్కన స్కాములున్నాయన్నారు. ప్రజలు ఎవరిపక్షానుంటారో నిర్ణయించుకోవాలన్నారు. కెటిఆర్ రోడ్‌షోలో పెద్ద సంఖ్యలో జనం పాల్గొన్నారు.

Telangana elections: Congress Scams-TRS-Schemes

Telangana Latest News