Home తాజా వార్తలు ‘ఇక్కడ ఎపికి హామీలివ్వడం ఏంటి’

‘ఇక్కడ ఎపికి హామీలివ్వడం ఏంటి’

Harish Rao

మహబూబ్ నగర్: కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్‌పై సానుభూతి చూపారని మంత్రి హరీష్ రావు విమర్శించారు.  మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకులలో ఎన్నికల ప్రచారంలో హరీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సభ పెట్టి ఎపికి హామీలు ఇస్తారా అని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందని, గతంలో ఆంధ్రప్రదేశ్‌తో సమానంగా తెలంగాణకు కూడా పారిశ్రామిక రాయితీలు ఇస్తామన్నారని, తెలంగాణకు ఇస్తామన్న పారిశ్రామిక రాయితీలపై సోనియా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సోనియా గాంధీ వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఎంతమంది పొత్తు పెట్టుకున్నా తమకు వచ్చే నష్టమేమీ లేదని , ఎంత మందికలిసొచ్చినా ఎదుర్కొనే సత్తా తమకు ఉందని హరీష్ ధీమా వ్యక్తం చేశారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని ఎనిమిది నెలల్లోనే పూర్తి చేశామని పొగిడారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంపై కూడా ఎపి సిఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఫిర్యాదు చేయడమే కాకుండా కుట్రలు పన్నారని మండిపడ్డారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం వద్దంటూ చంద్రబాబు రాసిన లేఖను వెనక్కి తీసుకుంటారా అని నిలదీశారు. వెయ్యి మంది చంద్రబాబులు అడ్డుకున్నా… పాలమూరును కోనసీమగా చేస్తామని హరీష్ స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లలో పాలమూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.

Telangana Elections: Harish Rao Fire on Chandra Babu

Telangana news