Home తాజా వార్తలు ఎన్‌టిఆర్‌ను బాబు మళ్లీ చంపేశాడు: కెటిఆర్

ఎన్‌టిఆర్‌ను బాబు మళ్లీ చంపేశాడు: కెటిఆర్

KTR Roadshow in Kukatpally

హైదరాబాద్: సిఎం కెసిఆర్ నాలుగు సంవత్సరాల పాలనలో హైదరాబాద్‌లో ఎక్కడైనా పొరపాట్లు జరిగాయా అని మంత్రి కెటిఆర్ కూకట్ పల్లి వాసులను అడిగారు. కూకట్ పల్లిలో ఎన్నిక ప్రచారంలో కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ అఖండ విజయం సాధించిందని ప్రశంసించారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తరువాతనే 24 గంటల విద్యుత్ సాధ్యమైందని తెలిపారు. ఎపి ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డిపై దాడి ఘటనను స్పందించిన వారిని ఎపి సిఎం చంద్రబాబునాయుడు తప్పు పట్టడం సరికాదన్నారు. జగన్‌పై దాడిని మంత్రి లోకేశ్ కూడా ఖండించారని, అయితే జగన్, మోడీ, టిఆర్‌ఎస్‌తో నారా లోకేశ్ కూడా కలిసి పోయారా అని బాబును ప్రశ్నించారు. ఒక రాజకీయ నేతపై దాడి జరిగితే అందరూ స్పందిస్తారన్నారు. మాజీ ఎంపి, నటుడు హరికృష్ణ చనిపోతే ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మనషులకు సంస్కారం అవసరమని మనిషిని మనిషిగా చూడాలి.. కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా చూసి.. విబేధాలు సృష్టించొద్దన్నారు. తమ ప్రభుత్వంలో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పరిపాలన అందించామని చెప్పారు.

పేద, మధ్యతరగతి ప్రజలను ప్రజలుగానే చూశామని, అందుకే వాళ్లకు హైదరాబాద్ లో అన్నీ సదుపాయాలు కల్పించామని వివరించారు. కూటమి పార్టీలకు కెసిఆర్‌ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ములేదన్నారు. సింహం ఎప్పుడూ సింగిల్‌గానే వస్తుందని, దమ్ములేని వారే గుంపులు కట్టి వస్తారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌తో టిడిపి పొత్తుపెట్టుకొని చనిపోయిన ఎన్‌టిఆర్‌ను మళ్లీ బాబు చంపేశాడని, కాంగ్రెస్‌ను బంగాళఖాతంలో కలపాలని ఎన్‌టిఆర్ తెలుగుదేశాన్ని స్థాపిస్తే…. చంద్రబాబు అదే టిడిపిని కాంగ్రెస్‌కు తోకపార్టీగా మార్చారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ నాలుగు సంవత్సరాలు తాను చేసిందే గొప్ప అని….  చేయని పనిని ప్రధాని నరేంద్ర మోడీపై నెట్టి, నిందలు వేశాడని బాబుకు చురకలంటించారు. హైదరాబాద్‌కు తానే ముగ్గుపోసినట్టు ఎప్పుడూ బాబు చెప్పుకుంటాడని, భాగ్యనగరానికి 400 సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఉందని పేర్కొన్నారు.

తొమ్మిదేళ్లలో హైదరాబాద్ వంటి మహానగరాన్ని నిర్మించిన బాబుకు, నాలుగేళ్లలో అమరావతిని ఎందుకు కట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. తెలంగాణలో నివసించే ఆంధ్రా పౌరుల మధ్య చిచ్చుపెట్టాలని బాబు తాపత్రయం పడుతున్నాడని కెటిఆర్ దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో సగం జిఎస్‌డిపి హైదరాబాద్ నుంచే వస్తుందని, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవర్ హాలీడేలు ఉండేవని 24 గంటల కరెంటు వల్ల పారిశ్రామిక వాడలు బాగా పని చేస్తున్నాయని, వ్యాపారం బాగుందని, పెట్టుబడులు వస్తున్నాయని కొనియాడారు. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న టాప్-5 కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయని స్పష్టం చేశారు. ఇండియాలో కేవలం హైదరాబాద్‌కే కంపెనీలు వస్తున్నాయంటే భాగ్యనగరం గొప్పతనమని చెప్పారు. బాబులాగా మైక్రోసాఫ్ట్ తాను తెచ్చానని చెప్పడంలేదని, గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు హైదరాబాద్‌లో తాగు నీటి సమస్య ఉండేదని, ఇప్పుడు తాగునీరు సమస్యలేకుండా చేశామని, శివారు మున్సిపాలిటీల్లో మంచినీటి సమస్యను అధిగమించామని కెటిఆర్ గొప్పగా చెప్పారు.

Telangana Elections: KTR Roadshow in Kukatpally
Telangana news