Home రాష్ట్ర వార్తలు పోలింగ్‌కు రెడీ

పోలింగ్‌కు రెడీ

సమస్యాత్మక కేంద్రాలు 10,280

Polling

మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఈసారి ఆసక్తికరంగా మారింది. కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం మొదలు దేశంలోనే తొలిసారిగా వివిపాట్‌లను నిర్వహించేంత వరకు అనేక వినూత్న ప్రయోగాలతో రాష్ట్ర ఎన్నికల నిర్వహణా యంత్రాంగం సిద్ధమైంది. ఇంతకాలం మాన్యువల్‌గా ఉన్న సాఫ్ట్‌వేర్ స్థానంలో ఇప్పుడు ‘ఇఆర్‌ఓ నెట్’ అనే ఆన్‌లైన్ విధానం ద్వారా ఓటర్ల జాబితా తయారైంది. ఇది కూడా ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ఒక ప్రత్యేకత. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 32,815 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఇందులో 10,280 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు. వీటిలో కొత్తగూడెం, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని 418 పోలింగ్ కేంద్రాలను మావోయిస్టు ప్రభావితమైనవిగా గుర్తించారు. డిసెంబర్ 7వ తేదీన రాష్ట్ర శాసనసభకు జరగనున్న ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు, పోలీసులు అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.

120 మహిళా పోలింగ్ స్టేషన్లు

మహిళల కోసం ప్రత్యేకంగా రాష్ట్రవ్యాప్తంగా 120 మోడల్ ‘పింక్’ (పేరు మాత్రమే. రంగు కాదు) పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మహిళ ఓటర్లను మాత్రమే అనుమతిస్తారు. మొత్తం మహిళ పోలింగ్ సిబ్బంది మాత్రమే విధులు నిర్వర్తిసారు. పోలింగ్ కేంద్రాల వారీగా పురుషులు, మహిళల ఓటర్ల జాబితా తెప్పించుకున్న సిఇఒ వాటిలో మహిళ ఓటర్లు అధికంగా ఉన్న చోట ఎంపిక చేసిన వాటిని మోడల్ పింక్ పోలింగ్ స్టేషన్‌లుగా గుర్తించారు. రాష్ట్రంలో మొత్తం 1,39,05,811 మహిళ ఓటర్లు ఉన్నారు.
దివ్యాంగులకు 31 పోలింగ్ కేంద్రాలు
ఈసారి యాక్సెసబుల్ (అందరికీ అందుబాటులో) ఎన్నికల నినాదాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా దివ్యాంగులు, ప్రత్యేక అవసరాలు కలిగిన ఓటర్ల కోసం కూడా పిడబ్లుడి మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ర్యాంప్‌లను కూడా సిద్దం చేశారు. ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున మొత్తం 31 పిడబ్లుడి మోడల్ పోలింగ్ స్టేషన్‌ల ఏర్పాటు చేశారు. మొత్తం 6,39,276 మంది దివ్యాంగ ఓటర్లను సదరాం ధ్రువీరణ పత్రం ద్వారా గుర్తించారు.

అంధులకు బ్రెయిలీ లిపి ఇవిఎం బ్యాలెట్

రాష్ట్రంలో 82,727 మంది అంధ ఓటర్లున్నారు. వీరికోసం ప్రతీ ఇవిఎంపై బ్రెయిలీ లిపిలో అంకెలను ఏర్పాటు చేశారు. ఓటరు గుర్తింపు కార్డు, బ్యాలెట్ కాగితం, ప్రచార కరపత్రాలు సైతం బ్రెయిలీలో ఉన్నాయి. బ్యాలెట్ కాగితంపై అంధులు అభ్యర్థుల వివరాలు చూసుకున్నాక..ఇవిఎంలపై బ్రెయిలీలో ఇచ్చిన అంకె ఆధారంగా ఓటు వేస్తారు. ఇవిఎంను తడిమి చూసి ఎవరి సాయం లేకుండానే ఓటు వేయొచ్చు.

బధిర ఓటర్లకు సైన్ లాంగ్వేజ్

బధిర ఓటర్లకు పోలింగ్ ప్రక్రియలోని వివిధ అంశాల గురించి సంజ్ఞల భాష (సైన్ లాంగ్వేజ్)లో తెలియజేయడం ఎలాగో తెలిపే ఓ కరపత్రాన్ని రూపొందించారు. దీన్ని ఎన్నికల అధికారులకు అందిస్తారు. మొత్తం 12 అంశాలు ఇందులో ఉంటాయి. తాజాగా 29,541 వేల మంది ఎన్‌ఎస్‌ఎస్ కార్యకర్తలకు దీనిపై శిక్షణ కూడా ఇచ్చారు. పోలింగ్ రోజున వీరంతా సేవలందిస్తారు.
నల్గొండలో అత్యధికం
అత్యధికంగా నల్గొండ జిల్లాల్లో 38,958 మంది, రంగారెడ్డిలో 37,147, ఖమ్మంలో 34,110, హైదరాబాద్‌లో 33,362, కరీంనగర్‌లో 30,643, మహబూబ్‌నగర్‌లో 30,169 మంది దివ్యాంగులున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా 7,565 మంది ఉన్నారు.

పోలింగ్ సిబ్బంది @1,50,023

డిసెంబర్ 7వ తేదీన జరిగే పోలింగ్ విధుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,50,023 మంది సిబ్బంది పోలింగ్ స్టేషన్‌లో విధులు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం స్పష్టం చేసింది. ఇందులో ప్రీసైడింగ్ అధికారులు 37,594, అసిస్టెంట్ ప్రీసైడింగ్ అధికారులు 37,556, పోలింగ్ అధికారులు 74,873 మంది ఉన్నారు. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో కాంట్రాక్టు ఉద్యోగులను కూడా ఉపయోగించుకోవాలని సిఇఒ కార్యాలయం నిర్ణయించింది. పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది గురువారం సాయంత్రమే చేరుకుంటారు.

119 రిటర్నింగ్ అధికారులు

649 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు
ఇవిఎంలు సిద్ధం..కొత్తగా వివిప్యాట్‌లు
రాష్ట్రం మొత్తం 55,329 బ్యాలెట్ యూనిట్లు అవసరం
39,763 కంట్రోల్ యూనిట్లు
మొదటిసారిగా తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో 42,751 వివిప్యాట్‌లను వినియోగిస్తున్నారు.

మొత్తం పోలింగ్ కేంద్రాలు 32,815
ఇందులో అనుబంధ కేంద్రాలు 241
(అనుబంధ కేంద్రాలు మినహా)
అర్బన్‌లో ఉన్నవి 12,514
రూరల్‌లో ఉన్నవి 20,060
అత్యధికంగా హైదరాబాద్‌లో 3873 పోలింగ్ కేంద్రాలు
అత్యల్పంగా వనపర్తి జిల్లాలో 280 పోలింగ్ కేంద్రాలు
ప్రైవేట్ బిల్డింగ్స్‌లో 4857 కేంద్రాలు ఏర్పాటు

మావోయిస్టుల ప్రభావిత పోలింగ్ కేంద్రాల సంఖ్య
కొత్తగూడెం 164
భూపాలపల్లి 150
మంచిర్యాల 41
ఆసిఫాబాద్ 63

మొత్తం ఓటర్లు 2,80,74,722
పురుషులు 1,41,56,182
మహిళలు 1,39,05,811
థర్డ్ జెండర్ 2691
సర్వీసు ఓటర్లు 10,038
అత్యధికం ఓటర్లు శేరిలింగంపల్లి నియోజకవర్గం 5,75,541
అత్యల్పంగా ఓటర్లు భద్రాచలం నియోజకవర్గం 1,37,371

భారీగా బందోబస్తు..

అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రం నుంచి 279 కంపెనీల పోలీసు బలగాలను బందోబస్తు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రానికి అన్ని కంపెనీలు చేరుకున్నట్లు అధికారులు ధ్రువీకరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 69 వేల మంది పోలీసు సిబ్బంది సేవలను ఎన్నికల్లో వినియోగించుకున్నారు.
ఈసారి రాష్ట్ర పోలీసులు 30 వేల మంది, పక్క రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి 18 వేల మంది పోలీసులు వచ్చారు. గ్రేహౌండ్స్ కూడా రంగంలోకి దిగాయి. ముఖ్యంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, మావోయిస్టు ప్రభావితమైన 13 నియోజకవర్గాల్లో వీరిని భారీగా మోహరింపజేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రం దగ్గర నుంచి గ్రామ, మండల, అసెంబ్లీ, జిల్లా స్థాయిల వారీగా పోలీసు యంత్రాంగం భద్రత సమకూర్చింది. ఇవిఎంలు, వివిప్యాట్‌ల భద్రత కల్పిస్తున్నారు.
రాష్ట్ర పోలీసులు 30 వేలు
కేంద్ర బలగాలు 279
6 పక్క రాష్ట్రాల నుంచి 18,860 మంది పోలీసులు

నిరంతర నిఘా

రాష్ట్రంలో మొత్తం 446 ఫ్లయింగ్ స్వాడ్స్
స్టాటిక్స్ సర్వేలెన్స్‌టీమ్స్ 448
సహాయ వ్యయ పరిశీలకులు 126
వీడియో నిఘా బృందాలు 224
వీడియో పరిశీలక బృందాలు 133
అకౌంటిగ్స్ టీమ్స్ 123