Home తాజా వార్తలు సీట్ల సర్దుబాటు కొలిక్కి

సీట్ల సర్దుబాటు కొలిక్కి

రేపు 74 మందితో కాంగ్రెస్ తొలి జాబితా
12 కల్లా మిగిలినవారితో తుది జాబితా
3 రోజుల చర్చల అనంతరం స్పష్టత
వార్ రూమ్ ఎదుట రవీంద్రనాయక్, బిసి నాయకుల నిరసన
‘తెలంగాణ ఇంటి పార్టీ’కి ఒక సీటు

Mahakutami

మన తెలంగాణ/ హైదరాబాద్ : మూడు రోజుల చర్చల అనంతరం మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియ దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. మొత్తం 119 స్థానాల్లో కాంగ్రెస్ 94 స్థానాల్లో మిగిలిన మిత్ర పక్షాలు 25 స్థానాల్లో పోటీచేసేలా స్పష్టత వచ్చింది. వార్ రూమ్‌లో మూడు రోజుల పాటు చర్చలు జరిగి న అనంతరం సోనియాగాంధీ అధ్యక్షతన ఆమె నివాసంలో గురువారం జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమి టీ సమావేశంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసే 74 మంది అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. ఈ జాబితా ను శనివారం అధికారికంగా విడుదల చేయనున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఆర్‌సి కుంటి యా మీడియాకు వివరించారు. మిగిలిన 20మంది అభ్యర్థుల విషయంలో పేర్లను ఖరారు చేయలేకపోయినందున మరింత లోతుగా చర్చలు జరిపి ఈ నెల 11 లేదా 12 తేదీల్లో ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. పలు నియోజకవర్గాల్లో ఒకరి కంటే ఎక్కు వ మంది టికెట్లను ఆశిస్తున్నందున అసంతృప్తితో ఉన్నవారితో కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికే చర్చించారని, ఇంకా చర్చలు కొనసాగాల్సి ఉన్నందున నాలుగైదు రోజుల సమయం పడుతుందని తెలిపారు. మిత్రపక్షాలకు కేటాయించిన పాతిక స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి 14, తెలంగాణ జన సమితికి 8, సిపిఐకి 3 చొప్పున ఇవ్వాలని సోనియాగాంధీ నిర్వహించిన సమావేశంలో స్పష్టత వచ్చిందని కుంటియా వివరించారు. కాంగ్రెస్ పోటీ చేస్తున్న 94 స్థానాల్లో అవసరా న్ని బట్టి ఒక సీటును ‘తెలంగాణ ఇంటి పార్టీ’కి ఇవ్వనున్నట్లు తెలిపారు. సీట్ల సర్దుబాటుతో పాటు అభ్యర్థుల ఖరారు కోసం ఢిల్లీలోని వార్ రూమ్‌లో జరిగిన భేటీల సందర్భంగా దేవరకొండ స్థానాన్ని తనకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాజీ శాసనసభ్యుడు రవీంద్రనాయక్ తన అనుచరులతో ధర్నా నిర్వహించారు. మరోవైపు గురువారం జరిగిన సమావేశం సందర్భంగా కాంగ్రెస్‌కు చెందిన బిసి నేతలు ధర్నా నిర్వహించారు. జనాభాలో సగానికిపైగా ఉన్న బిసిల కు టికెట్ల విషయంలోనూ తగిన న్యాయం చేయాలని పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు.

74 స్థానాలకు గ్రీన్ సిగ్నల్

సోనియాగాంధీ అధ్యక్షతన ఆమె నివాసంలో గురువారం జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో మూడు రోజుల పాటు వార్ రూమ్‌లో జరిగిన కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కసరత్తుపై చర్చ జరిగిం ది. మహాకూటమిలో భాగంగా 94 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్, స్క్రీనింగ్ కమిటీ నిర్ణయానికి ఆమోదం లభించడంతో పాటు అభ్యర్థుల వడపోతలో 74 మంది పేర్లకు కూడా ఆమోదం లభించింది. ఈ జాబితాను శనివారం ఉదయం 11 గంటలకు విడుదల చేయాడానికి పార్టీ ఎన్నికల కమిటీ ఆమోదం తెలిపింది. మరో ఇరవై మంది అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై కసరత్తు జరిగినప్పటికీ ఒకరికంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్నందున వారితో కాంగ్రెస్ పెద్దలు బుజ్జగింపు చర్చలు ప్రారంభించింది. మరో మూడు నాలుగు రోజుల పాటు ఈ ప్రక్రియను పూర్తి చేసి ఈ నెల 11న లేదా 12వ తేదీన విడుదల చేయనుంది. అప్పటికల్లా తెలుగుదేశం, తెలంగాణ జన సమితి, సిపిఐ కూడా వారి కి కేటాయించిన స్థానాల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తాయని కాంగ్రెస్ అభిప్రాయపడింది.

సిపిఐ సీట్లకు చంద్రబాబు మోకాలడ్డు ?

మహాకూటమిలో భాగంగా సిపిఐ తొలుత తొమ్మిది స్థానాలకు ప్రతిపాదనలను పంపి చివరకు నాలుగు లేదా ఐదు సీట్లకు కూడా సమ్మతిని తెలియజేసినా చివరకు మూడు కంటే ఎక్కువ సీట్లకు కాంగ్రెస్ నుంచి ఆమోదం లభించలేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కనుసన్నల్లోనే కూటమి సీట్ల సర్దుబాటు జరిగిందని వస్తున్న విమర్శలకు ఇప్పుడు సిపిఐకు కేవలం మూడు సీట్లు మాత్రమే కేటాయించడం బలం చేకూరుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక వైఖరి తీసుకున్నందువల్ల, భవిష్యత్తులో మిత్రపక్షంగా పనిచేసే అవకాశం లేనందువల్ల తెలంగాణలో ఆ పార్టీకి మూడు సీట్లు సరిపోతుందన్న తీరులో కాంగ్రెస్‌పై చంద్రబాబు వత్తిడి తీసుకొచ్చినట్లు అనుమానాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సిపిఐ వైఖరిలో సానుకూలత ఉన్నట్లు తెలుగుదేశం ఒక అభిప్రాయానికి వచ్చినట్లయితే తెలంగాణలో సీట్ల సర్దుబాటులో సంతృప్తికరమైన స్థానాలు లభించేవన్న వాదనలు కూడా తెరపైకి వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లో మూడు సీట్లతో సరిపెట్టుకోలేమని స్పష్టమైన అభిప్రాయాన్ని సిపిఐ వెల్లడించినప్పటికీ రెండు ఎంఎల్‌సి స్థానాలను ఇవ్వడానికి కాంగ్రెస్ పంపిన ప్రతిపాదనతో సిపిఐ నేతల మధ్య చర్చలు మొదలైనట్లు తెలిసింది. సిపిఐ తెలంగాణ రాష్ట్రశాఖ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాత్రం మహాకూటమితోనే కొనసాగుతామని గురువారం సాయంత్రం మీడియాకు స్పష్టత ఇచ్చారు.

పెండింగ్‌లో ఉన్న స్థానాలు

కాంగ్రెస్ పోటీ చేయాలనుకుంటున్న 94 స్థానాల్లో ఇప్పటికే 74 స్థానాలకు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందున మిగిలిన ఇరవై పెండింగ్ స్థానాలపై ఏఐసిసి వర్గాల ద్వారా 19 నియోజకవర్గాల సమాచారం అందింది. మిగిలిన ఒక స్థానాన్ని తెలంగాణ ఇంటి పార్టీ కోసం పక్కకు పెట్టినట్లు తెలిసింది. ఆ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం మేడ్చల్, మంచిర్యాల, సూర్యాపేట, ఇల్లెందు, కొత్తగూడెం, నకిరేకల్, తుంగతుర్తి, సికింద్రాబాద్, వికారాబాద్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, దేవరకొండ, వరంగల్, ములుగు, మెదక్, పాలకుర్తి, భద్రాచలం, ఇబ్రహీంపట్నం, నారాయణఖేడ్. ఇందులో సూర్యాపేట నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డికి సన్నిహితుడిగా ఉన్న పటేల్ రమేశ్‌రెడ్డి, కాంగ్రెస మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి పోటీ పడుతున్నందున అభ్యర్థి పేరు ఖరారు కాలేదు. దేవరకొండ విషయంలో బిల్యానాయక్, జగన్, బాలునాయక్ తదితరుల పేర్లతో పాటు రవీంద్రనాయక్ అసమ్మతి స్వరం వినిపించడంతో అభ్యర్థిని ఖరారు చేయలేదు. కొత్తగూడెం విషయంలో సైతం సిపిఐ తరఫున కూనంనేని సాంబశివరావు పోటీచేయాలని భావిస్తుండగా, కాంగ్రెస్ తరఫున వనమా ఆసక్తి చూపుతున్నారు.

వార్ రూమ్ ఎదుట నిరసనలు

తెలంగాణ ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటుతో పాటు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే ప్రక్రియ మూడు రోజులుగా జరుగుతున్నందున దేవరకొండ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతుండడంతో వారిని పిలిచి బుజ్జగించే పనిని ఆ పార్టీ పెద్దలు చేపట్టారు. అయితే కొలిక్కి రాలేదు. ఇదే సమయంలో ఆ స్థానం నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్న మాజీ శాసనసభ్యుడు రవీంద్రనాయక్ తన అనుచరులతో వార్‌రూమ్ దగ్గరకు వచ్చి నిరసన చేపట్టారు. గురువారం ఉదయం కాంగ్రెస్ పార్టీలోని బిసి నేతలు కూడా ఇదే తీరులో నిరసన తెలిపారు. బిసి అభ్యర్థులకు గణనీయమైన తీరులో అవకాశాలు ఇవ్వాలని ఓబిసి కన్వీనర్ అశోక్‌గౌడ్ వ్యాఖ్యానించారు.

Telangana Elections: Seats are Divided in Mahakutami

Telangana news