Home కలం తెలంగాణ జీవనది సిధారెడ్డి

తెలంగాణ జీవనది సిధారెడ్డి

నందిని సిధారెడ్డి అంటే తెలంగాణ నిలువుటద్దం. ఉద్యమ, అస్తిత్వ, సాహిత్య దార్శనికతతో పాటు పదుగురి ఎదుగుదలకు పాదులు తీసిన స్ఫురద్రూప, అపురూప చిత్తరువు దర్శనమౌతుంది, తొంగిచూస్తే. వ్యాసం రాయడు అలవోకగా, కథ రాయడు చిత్రకన్ను తెరువకుండా, ఒడువని బాధలు చుట్టుముట్టకుండా, వెన్నెల్లో ఛాతీ విరుచుకుని కలం కవాతు చేయడు, రేషం అద్దిన పద్యం ఎగరేయడు, పరిధి దాటి ఉపన్యసించడు, “బాగున్నవా” అనకుండా పలకరించడు.

తొలినాళ్లలో సిద్దిపేట సాహిత్య కేంద్రంగా (మంజీర రచయితల సంఘం), మలినాళ్లలో తెలంగాణ పది జిల్లాల (తెలంగాణ రచయితల వేదిక) అస్తిత్వ సాహిత్య ఎజెండాగా చూపిన చొరవ, తెగువ సిధారెడ్డి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. పల్లె, పట్నం అనే భేదం లేని, పేరు మోసిన, అప్పుడే రాస్తున్న వాళ్లని భేషజం చూపని సహజాత నడత ఇంకో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. “అవార్డులెన్నొచ్చినా (నంది అవార్డు కలిపి) కవిని నిలబెట్టలేవు. అక్షరం తప్ప, అని ప్రకటించే సాహస నిబద్దత సిధారెడ్డి సొంత శైలి. దు:ఖానికి శిల్పమద్దే వృధా ప్రయాసల, హంగూ ఆర్భాటాల అసహజ వాతావరణంలో నిలువడు.

తెలంగాణ నుడికారాన్ని సాహిత్య నారుమడిలో రంగరించి, నాగేటి చాళ్ల పొత్తిళ్లలో నాటుతున్న కాలాలకు నలభై వసంతాల కాలం ఎదురొచ్చిన సందర్భమిది. ‘భూమిస్వప్నం’, ‘సంభాషణ’, ‘ప్రాణహిత’, ‘ఒక బాధ కాదు’, ‘నది పుట్టువడి’, ‘ఇక్కడి చెట్లగాలి’ కవితాసంపుటాల్లోంచి శాశ్వతత్త్వాన్ని, సిద్ధాంత సూత్రీకరణల్ని ఆపాదించుకున్న కొన్ని కవితలను గుదిగుచ్చి, ‘నాలుగు దశాబ్దాల నందిని సిధారెడ్డి కవిత్వం’ పేరిట తెలంగాణ సాహిత్య చరిత్రలో ఆ మాటకొస్తే ప్రపంచస్థాయి సాహిత్యానికి ధీటుగా నిలబడే అదనపు చేరికగా ఈ విలువైన గ్రంథాన్ని పేర్కొనవచ్చు. వర్తమాన సాహిత్యానికి నిలువెత్తు చిరునామా డాక్టర్ నందిని సిధారెడ్డితో డాక్టర్ బెల్లంకొండ సంపత్‌కుమార్ ఆత్మీయ సంభాషణ ‘మన తెలంగాణ’ పాఠకుల కోసం ప్రత్యేకం.

Sida-reddy

మీ దృష్టిలో కవిత్వం అంటే ఏంటిది సార్?

హృదయంలో కలిగే ప్రకంపనలకు రూపమిచ్చేది కవిత్వం. సహజంగా, ప్రకృతి సౌందర్యం చూసినప్పుడో, మనసు వికలమైనప్పుడో భావోద్వేగం ప్రజ్వరిల్లినప్పుడో, ఉద్యమంరేకెత్తినప్పుడో వెలువడే భావ పరంపరకు అక్షర రూపమే కవిత్వం. ప్రధానంగా కవిత్వం హృదయ సంబంధి. రసానుభవానికి దర్పణం పడుతుంది.

‘వస్తువు’ను ఎట్లా చెప్పుకోవాలె?

కవిత్వం ప్రధానంగా లయ మీద ఆధారపడి రూపొందితే, అందులో ప్రధానంగా ఇమిడిఉండేది వస్తువు. రూపం దేని చుట్టూ పరిభ్రమిస్తుందో, దేన్ని అపురూపంగా తీర్చిదిద్దుతుందో, దేని ఆధారంగా నిర్మింపబడుతుందో దానికి కేంద్రమైంది వస్తువు. అది ప్రకృతి కావచ్చు, మానవుడు కావచ్చు, జీవితంలోని అనేక అనుభవాలకు చెందిన ఏ అంశమైనా కావచ్చు.

మానవ సమాజం పరిణామంతో కూడుకున్నది. చరిత్ర గతిలో ఎన్నో అపురూప అనుభవాలను సంతరించుకుంటూ పురోగమించిన వికాసం. ఈ క్రమంలో మానవుడిని ఆకర్షించిన, కదిలించిన ఏ దృశ్యమైనా, అనుభవమైనా, వర్ణించదలచుకున్నప్పుడు అది వస్తువు.
సమాజం నడిచివచ్చిన, మనిషి సంతరించుకున్న అనుభూతి వస్తువు. అది భక్తి దగ్గరి నుంచి శృంగారం, వీరం, కరుణ రసాలతో సహా వర్తమానంలో మరో ప్రపంచం కూడా కావచ్చు.

ఇవన్నీ కవిత్వంతో అల్లుకున్న వస్తువులే. కవి తనను కదిలించిన ఏ సంఘటననైనా వస్తువుగా స్వీకరించవచ్చు. దాన్ని అపురూపంగా మలిచే నైపుణ్యమే కళ.

కవిత్వ శిల్పం, రూపం, వాటి సమన్వయం గురించి చెప్పండి.
మనం పొందిన అనుభవాన్ని అపురూపంగా తీర్చిదిద్దే నైపుణ్యమే శిల్పం. హృదయంలో తలెత్తిన భావ సముదాయాన్ని బలంగా, అందంగా, లోతుగా, కొత్తగా చెప్పినప్పుడే శిల్పంగా భాసిస్తుంది.

మంచి వస్తువుకు సరైన శిల్పం అమరినప్పుడే అది కళగా రాణిస్తుంది. మంచి శిల్పం వస్తువుకు విధేయంగా ఉంటుంది. అలానే మంచి కవిత్వం జీవితానికి విధేయంగా ఉంటుంది.

వస్తువును అధిగమించే విధంగా శిల్పాన్ని రూపొందిస్తే కళగా అది విఫలమవుతుంది. శిల్పం బరువు ఎక్కువై వస్తువుకు ఊపిరి సలపక నిర్జీవమవుతుంది. నిజమైన అందం వస్తు వికాసానికి తోడ్పడాలి. కానీ వర్తమాన కవిత్వంలో కొందరు శిల్పవాదులు శిల్ప సౌందర్యమే సర్వస్వమని భావిస్తుంటారు. శిల్పానికి వస్తువుకంటే పెద్దపీట వేస్తారు. కానీ రూప సౌందర్యమెప్పుడూ హృదయ సౌందర్యంతో సరి తూగదు. హృదయమే సకల రసాలకు పుట్టినిల్లు. హృదయానికి తొడిగిన రూపమే శిల్పం.

తెలంగాణ భవిష్యత్ నిర్మాణమంటే ఏంటిది?

ఆరు దశాబ్దాల నిరంతర తెలంగాణ చైతన్యమే స్వరాష్ట్రాన్ని సాధించుకున్నది. తెలంగాణ అస్తిత్వం ఎక్కడ దెబ్బ తిన్నదో అక్కడ కేంద్రీకరించి, భవిష్యత్ తెలంగాణను నిర్మించుకోవలసి ఉంది. స్థానికంగా ఉన్న ప్రకృతి వనరులు, మానవ వనరులు, సాంస్కృతిక భావనలు ఇవన్నీ వలసాధిపత్యం కింద నలిగి పరాధీనమైనై.

తెలంగాణ ప్రధానంగా వ్యవసాయ ఆధారితమైన గ్రామీణ ఆర్థిక జానపద సాంస్కృతిక సమాజం. దానికి నీరు అతి ముఖ్యమైన వనరు. నదులున్నా ఇక్కడి నేలను తడపలేని దుస్థితిని ఇంతకాలం ఎదుర్కున్నాం. ప్రజలు నిర్మించుకున్న తరతరాల చెరువుల వ్యవస్థ కుప్పకూలింది. అనేక పీడనల అణచివేతలను తట్టుకోలేక ఊరు వలస పోయింది. ఇయాల నదులు ఈ నేలను తడపడానికే ప్రవహించాలి. చెరువులు పునర్నిర్మాణం పొందాలి. ఊరు తిరిగివచ్చి పునర్ వైభవంతో కళకళలాడాలి.

నగర మానవుడు, గ్రామీణ మానవుడు కొత్త వెలుగులతో ఉత్తేజం పొందాలి. సౌకర్యవంతమైన జీవితంతో, మానవ విలువలతో తెలంగాణ నూత్న శోభలను సంతరించుకోవాలి. తెలంగాణ రాష్ట్రాన్ని, రాష్ట్ర స్వరూపాన్ని సాకారం చేసుకున్నట్టే భవిష్యత్తులో మానవ జీవితం పరిణమించే మహా తెలంగాణను నిర్మించుకోవాలి. తెలంగాణ నిర్మాణమంటే ఇదే. ఈ స్ఫూర్తి సాహిత్యంలో ప్రతిబింబించాలి. కొత్త తెలంగాణ స్వప్న సాకార దిశగా సాహిత్య నిర్మాణం జరగాల్సి ఉంది.

జాతి అస్తిత్వ భావన సంపూర్ణంగా వికసించేందుకు అవసరమైన చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, కళలు రూపొందించుకోవాల్సి ఉంది. సాహిత్యం అన్ని లలిత కళల్లో కీలకమైంది. కనుక తెలంగాణ నవనిర్మాణంలో సాహిత్యం ప్రధానమైన పాత్ర నిర్వహించవలసి ఉంది. ఇప్పటికీ ఇంకా తెలంగాణ జీవితంలోని అన్ని పార్శ్వాలు సాహిత్యంలోకి ఆవిష్కరింపబడలేదు. అన్ని ప్రక్రియలు కవిత్వంతో సమానంగా విస్తరించలేదు. రాబోయే కాలంలో అన్ని పార్శ్వాలు, అన్ని ప్రక్రియలు వికాసం పొందే దిశగా సాహిత్యంలో తీవ్రమైన కృషి జరగవలసి ఉంది. అది ఇవ్వాళ్టి రచయితల ముందున్న కర్తవ్యం.

విస్మృతికి గురైనవారంటే ఎవరు?

కోస్తా ఆధిపత్యం వల్ల తెలంగాణ చరిత్ర పురుషులు కావచ్చు; రచయితలు, కళాకారులు కావచ్చు అనేక రంగాల ప్రముఖులు వివక్షకు బలైనారు. తెలంగాణ వర్తమానంలో విస్మృతికి గురైన మహానుభావులందర్నీ పునర్‌ప్రతిష్టించుకోవల్సి ఉంది.

కొంత వెలుగులో ఉండి విస్మృతికి గురైనవారే కాక వెలుగు కిరణాలు సోకని చీకట్లో ఉండిపోయినవారెందరో ఉన్నారు. అన్నమయ్య వంటి పద కవుల విషయంలో అన్నమయ్యకు దొరికినంత ప్రోత్సాహం ఇక్కడి తత్త్వ కవులకు లభించలేదు. వాళ్ల కృషిని, సాహిత్యాన్ని కనీసం గుర్తించ లేదు.
సంప్రదాయిక కవులు, పరిశోధకులు, తెలంగాణ సమాజ వికాసం కోసం పనిచేసిన కవులు, సంస్కర్తలు ఇవాళ తెలుగు సాంస్కృతిక రంగంలో ఫోకస్ చేయబడవలసి ఉంది. వాళ్ళపై దృష్టి కేంద్రీకరించవలసి ఉంది. వాళ్ళ రచనలు, సాహిత్య కృషి కొత్త తరానికి అందుబాటులోకి తేవలసి ఉంది.
విశ్వవిద్యాలయాలు, అకాడమీలు, పరిశోధకులు, సాహిత్యాభి మానులు సమన్వయంతో ఈ కృషి సాగించవలసి ఉన్నది.

అట్లాగే అనేకమంది వర్తమాన కవులు కూడా సరైన చేయూత లేక సతమతమవుతున్నారు. కళా విలువల పట్ల అవగాహన కొరకు దారులు వెతుకుతున్నారు. ప్రతిభ ఎంతో ఉన్నప్పటికీ రాణించలేకపోతున్నారు. ఈ తరానికి శిక్షణ, అవగాహన, ప్రోత్సాహం అందజేసి, వెలుగులు ప్రసరింపజేయవలసి ఉంది.
ఇదంతా సాహిత్య, సాంస్కృతిక రంగంలో జరగవలసిన పని. తెలంగాణ సోయితో ఈ పని జరగాలి.

తెలంగాణ బలమైన గొంతుక ఎలా భిన్నమైన స్వరం?

తెలంగాణ కవులది ప్రత్యేకమైన కంఠ స్వరం. మొదట్నుంచి విలువల పట్ల, జీవితం పట్ల ఇక్కడి కవులు, రచయితలు విధేయులు. కీర్తి ఆరాటం తక్కువ. చమత్కార భావాల కంటే అలంకారాల కంటే హృదయాన్నే, సహజ సౌందర్యాన్నే ఎక్కువగా ఇష్టపడ్డారు. జిగేలుమనే వ్యక్తీకరణలకంటే హృదయాన్ని హత్తుకునే రచనల పట్ల ఎక్కువ ప్రేమ.

నిజాయితీ ఎక్కువ, రేషం అమితం. రాజాస్థానాలనైనా, ఆధునిక కాలంలో రాజ్యాలనైనా ధిక్కరించిన ఉదాహరణలు కోకొల్లలు. స్వీయ భావన కంటే జాతి భావనలు ఎక్కువ. ఎంత పాండిత్యమున్నా కవిత్వ ప్రతిభ ఉన్నా చొరవ చూపరు. తమ గురించి తాము చెప్పుకోరు. ఆత్మస్తుతి తక్కువ.

తొలి తరం, మలి తరంలో ఎవర్ని చదవాలి?

కవులు తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు అన్ని భాషల, సమాజాల కవులను, కవిత్వాన్ని అధ్యయనం చేయవచ్చు. తెలుగు సాహిత్యంలో మహాకవులుగా పేరుపొందిన నన్నయ, తిక్కన, ఎర్రన, సూరన, వేమన, గురజాడ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, తిలక్, ఇస్మాయిల్, శివారెడ్డి మొదలైన కవులందర్నీ వాళ్ల శైలీ నైపుణ్యాలను, వైవిధ్యాలను లోతుగా పరిశీలించాలి. వాళ్లది లిఖిత సంప్రదాయమైతే మన తెలంగాణది ఆశు సంప్రదాయం. మనది పాట. కవిత్వం పుష్కలం.

తెలంగాణకు సంబంధించి పాల్కురికి సోమన, బమ్మెర పోతన, ద్విపద కవులు, తత్త్వ కవులు మొదలుకొని కాళోజీ, దాశరథి, నేటి తరందాకా ప్రముఖులను, లబ్ద ప్రతిష్టులను అందర్నీ చదవాలి. వాళ్లు వ్యక్తీకరించిన శిల్ప ప్రత్యేకతల్ని, వస్తు వైవిధ్యాలను, ఛందోలంకారాలను పరిశీలించాలి. మన దగ్గర అదనంగా అభ్యుదయ కవిత్వం, అస్తిత్వ కవిత్వం ఎక్కువ.
తెలుగు సాహిత్యంలో వస్తు నవ్యత ప్రత్యేకత ఏంటిది సార్?
ఆధునిక కాలం ఎన్నో ఉద్యమాలకు తెర తీసింది. అవి సామాజిక ఉద్యమాలు కావచ్చు, సాంస్కృతిక ఉద్యమాలు కావచ్చు.
తెలంగాణ రైతాంగ విమోచనోద్యమంలో కవులు స్వీకరించిన వస్తువు స్థానిక జీవితం. మిగతా తెలుగు ప్రాంతాల కంటే ఇది భిన్నమైంది, నవ్యమైంది. సాహిత్యంలో విముక్తి పోరాటం, ప్రజా పోరాటంగా పరిణమించిన క్రమం సాహిత్యంలో నూతనోత్తేజం.
నియంతను ధిక్కరించిన సాహసం ఈ నేలది. అది తెలంగాణ కవిత్వంలోనే కనబడుతుంది. భూమిని ప్రేమించటం, రాజును ఎదిరించటం, స్థానిక

భౌగోళిక రేఖల్ని చిత్రించటం తెలంగాణకే వన్నె తెచ్చే ప్రకృతి చిత్రణలు వస్తు నవ్యతకు నిదర్శనాలు.
అభ్యుదయ కవిత్వం తెచ్చిన పరిణామాలు విప్లవ కవిత్వం సృష్టించిన ప్రకంపనాలు, సంచలనాలు వస్తు నవ్యతకు మంచి ఉదాహరణలు.
తెలుగు సాహిత్యంలోనే అస్తిత్వ చైతన్యంతో సాహిత్యం సృష్టించిన తెలంగాణ కవిత్వం వస్తు నవ్యతకు పరాకాష్ట. ఇతర ప్రాంతాల అస్తిత్వానికి మార్గదర్శకం.

తెలంగాణలో ఉద్యమానంతర కవిత్వం ఎలా ఉంది? ఎట్లా అంచనా వేయవచ్చు?

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సాహిత్య రంగంలో కొంత అయోమయం నెలకొన్న మాటలలో కొంత వాస్తవం ఉంది. తెలంగాణ ఉద్యమంలో వస్తునిష్ఠ ఉండడం వలన చిక్కని కవిత్వం వచ్చింది. రాష్ట్ర సాధనానంతరం భవిష్యత్ తెలంగాణ నిర్మాణం పట్ల అంతటి ఉత్సాహం, నిబద్ధత, ఐక్యతాగొంతుక బలంగా ఉండాలి. అప్పుడే ఆశించిన కవితా నిర్మాణం సాధ్యమవుతుంది.
ఉద్యమ కాలంలో ఐక్యంగా ఉన్న రచయితలను తెలంగాణ భావోద్వేగాన్ని ప్రధానంగా వినిపించిన రచయితలు ఉద్యమానంతరం సంశయానికి గురవుతున్నారు. ఎన్నో ఆకాంక్షలతో ఉద్యమకాలంలో పనిచేసిన వ్యక్తులు అనంతరం తెలంగాణ సోయిని కోల్పోవడం వల్ల ఫలాలు అందుకునే దిశగా నడిచి విఫలం పొంది, వ్యతిరేకత పెంచుకుంటున్న స్థితిని చూస్తున్నాం.

నిజానికి రాష్ట్ర ఆవిర్భావం ఎంత ముఖ్యమో భవిష్యత్ నిర్మాణం కూడా అంతకంటే ప్రధానమైంది. మరింత తెలంగాణ చైతన్యంతో రచనలు చేయవలసిన తరుణం. ఈ బాధ్యతలను విస్మరించడం వలన రచనలో స్పష్టత కోల్పోతున్నారు. లక్ష్య నిర్దేశ్యం లేదు. తక్షణ స్పందనలు తప్ప దీర్ఘ దృష్టి లోపిస్తున్నది. అందువల్ల జరుగుతున్న అభివృద్ధిని చూసే సహనాన్ని కోల్పోతున్నారు.

కళ వాస్తవరూపం పొందడానికి పట్టే కాలాన్ని కూడా భరించలేక, అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆంధ్రా వలసవాద మీడియా చేసే ప్రచారంలో కొట్టుకుపోవడం వలన ఇలాంటి స్థితి ఏర్పడుతుంది. ఆరు దశాబ్దాల అణచివేతనుంచి బయటపడిన జాతి తలెత్తుకోవడానికి ఆరు సంవత్సరాల పరిమితైన పెట్టుకోకుండా మాట్లాడడం, రాయడం తెలంగాణ సోయి కాదు. అందుకని తెలంగాణ నిర్మాణంపై రచయితకు అందరికన్నా ఎక్కువ స్పష్టత అవసరం. లక్ష్యం చాలా ముఖ్యం.

ఇప్పటి తరానికి అందించవలసిన సందేశం ఏమిటి?

“వట్టిపోయిన తరానికి
మనిషిని కానుకగా ఇవ్వాలి”
“కూలిపోతున్న ఊరి చెలిమెలో
కూరిమి తోడాలి”
ప్రయోజనాత్మక సాహిత్యాన్ని అందివ్వాలి. నిర్మాణంలో భాగస్వాములు కావాలి.

డా॥ బెల్లంకొండ సంపత్‌కుమార్

9908519151